కాసుల మేతకు వంతెనలు

పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట! కుక్కేం ఖర్మ... బల్లితోక తగిలినా నేలమట్టమయ్యేంత ‘నాణ్యం’గా నిర్మాణాలు చేపట్టే పనిమంతులకు మనదేశంలో లోటేమీ లేదు. ముఖ్యంగా వంతెనలు, ఫ్లైఓవర్లు వంటివి తరచూ పేక మేడలవుతున్నాయంటే కారణం- ఆ ప్రబుద్ధుల కాసులకక్కుర్తే!

Published : 07 Jul 2024 00:48 IST

పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట! కుక్కేం ఖర్మ... బల్లితోక తగిలినా నేలమట్టమయ్యేంత ‘నాణ్యం’గా నిర్మాణాలు చేపట్టే పనిమంతులకు మనదేశంలో లోటేమీ లేదు. ముఖ్యంగా వంతెనలు, ఫ్లైఓవర్లు వంటివి తరచూ పేక మేడలవుతున్నాయంటే కారణం- ఆ ప్రబుద్ధుల కాసులకక్కుర్తే! బిహార్‌లో గడచిన పందొమ్మిది రోజుల్లో పన్నెండు వంతెనలు కూలిపోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాయోజిత నిర్మాణాల తీరుతెన్నులు తీవ్ర చర్చనీయాంశాలవుతున్నాయి. పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్ల నడుమ పెనవేసుకుపోయిన చీకటి బంధాలు- సామాన్య జనానికి యమపాశాలవుతున్నాయి. అక్రమాల్లో ఆరితేరిన పాపిష్టి బృందాలు- నాసిరకం పనులతో వందలు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సుబ్బరంగా అరాయించుకుని బ్రేవ్‌మని తేన్చుతున్నాయి.

ఎప్పుడో శతాబ్దాల కిందట రాజుల కాలంలో కట్టిన కోటలు, దేవాలయాలెన్నో ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనపడుతుంటాయి. ఆంగ్లేయుల ఏలుబడిలో నిర్మితమైన వంతెనలూ అనేకం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అలాంటిది నిన్నమొన్న పనులు పూర్తయిన వంతెనలు హఠాత్తుగా పడిపోవడమేమిటి? ఆధునిక సాంకేతికతలు, విస్తృత వనరులు చేతిలో ఉన్నప్పటికీ ఈ దుస్థితి పదేపదే పునరావృతమవుతోందంటే- దేశానికది తలవంపులు కాదా? అంతకంటే అధ్వానం ఏమిటంటే- నిర్మాణంలో ఉన్న వంతెనలు కూడా కుప్పకూలిపోవడం! బిహార్‌లో విరిగిపడిన బ్రిడ్జీల్లో కొన్ని అటువంటివే. ఆ రాష్ట్రంలోని మధుబని, సుపౌల్‌ జిల్లాల మధ్య కోశీ నది మీద పది కిలోమీటర్ల పొడవున ఒక వంతెన కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైన ‘భారత్‌మాల’ ప్రాజెక్టులో భాగమైన ఆ బ్రిడ్జి మొన్న మార్చిలో కూలిపోయింది. ఆ దుర్ఘటనలో ఒకరు చనిపోగా, పదిమంది గాయపడ్డారు. కిందటి నెల పద్దెనిమిదో తేదీ తరవాత బిహార్‌లోని వివిధ ప్రాంతాల్లో డజను వంతెనలు పడిపోయాయి. వాటిలో పాతవే కాదు- ప్రారంభోత్సవం జరగని కొత్త బ్రిడ్జీలు కూడా ఉన్నాయి. భాజపా, కాంగ్రెస్‌ కూటముల మధ్య కప్పగంతులేస్తూ బిహార్‌ను నిరాటంకంగా ఏలుతున్న నీతీశ్‌ కుమార్‌ సాక్షిగా నిరుడు మొదటి ఏడునెలల్లో అక్కడ పది వంతెనలు కొట్టుకుపోయాయి. గంగానది మీద నిర్మాణంలో ఉన్న ఒక బ్రిడ్జి అయితే 2022లో ఒకసారి, 2023లో ఇంకోసారి కూలింది. ఆ వంతెనను సరిగ్గా కట్టలేదని అప్పట్లో సెలవిచ్చిన నీతీశ్‌ ప్రభువులవారు- బాధ్యులపై చర్యలు తప్పవని గుడ్లురిమారు. ఆయన మాటలన్నీ ఏట్లో ముంచిన ఉప్పు మూటలైన ఫలితమే ఇటీవలి వరస దుర్ఘటనలు! నిర్దేశిత డిజైన్‌ ప్రకారం పనులు చేయకపోవడం, నాణ్యతలేని సామగ్రిని వాడటం, ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం తదితరాల కారణంగానే కొత్త, నిర్మాణంలో ఉన్న వంతెనలు పడిపోతున్నాయన్నది ఇంజినీరింగ్‌ నిపుణుల పరిశీలన. పాత బ్రిడ్జీల నిర్మాణ బాధ్యతను గాలికొదిలేయడం మరింత ప్రమాదకరమవుతోంది. బిహార్‌లోనే కాదు- కీలక మౌలిక సదుపాయాల విషయంలో దేశమంతా ఇదే అరాచకం మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది!

చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు వెర్రిమొర్రి సాకులు చెప్పడం కొందరు నాయకులకు వెన్నతోపెట్టిన విద్య. అందులో అగణిత అద్భుత ప్రతిభాశాలి జగన్‌మోహన్‌రెడ్డి. రోడ్లకోసం తాము చాలా ఖర్చుపెట్టామని, వర్షాలు బాగా పడటం వల్ల ఆ అభివృద్ధి కనపడకపోయి ఉండవచ్చునని ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మునుపు జగన్మోహన దొరవారు నాలుక చప్పరించారు. అంటే ఏమిటి- అయ్యవారు కష్టపడి రోడ్లేయిస్తే, వానలొచ్చి వాటిని నాశనం చేశాయట! ఆలిండియా అబద్ధాలకోరుల సంఘం అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేంత ప్రతిభాపాటవాలు తనవని జగన్‌ ఎప్పటికప్పుడు అలా నిరూపించుకుంటూనే ఉంటారు. ఆయన్ను చూసి స్ఫూర్తిపొందారో ఏమో కానీ- బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి జీతన్‌రామ్‌ మాంఝీ కూడా వానల వల్లే వంతెనలు కూలిపోతున్నాయనే వాదనొకటి వినిపిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి బ్రిడ్జిలైనా సరే- రకరకాల కోణాల్లో అధ్యయనం చేసి, పొంచిఉన్న ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని, అన్నింటికీ తట్టుకునే విధంగా కడతారు. అలాగే కట్టాలి కూడా! ఆ మేరకు నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు పాటించారు కాబట్టే ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో సోలానీ (సోనాలీ అనీ పిలుస్తారు) నది మీద 1842-53 మధ్యకాలంలో కట్టిన వంతెన ఇప్పటికీ నిలిచి ఉంది. అదే నది మీద కొత్తగా నిర్మించిన వంతెన ఒకటి నిరుడు రాకపోకలు ప్రారంభమైన రెండు నెలల్లోనే కూలిపోయింది. ఇదీ మన ప్రభుత్వాలు, వాటి సిబ్బంది, వారికి ఆప్తమిత్రులైన కాంట్రాక్టర్ల పనితనం! తెలంగాణలో జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు వాగుమీద వంతెన నిర్మాణం 2016లో ప్రారంభమైంది. అరకిలోమీటరు దూరం బ్రిడ్జి ఇంతవరకు పూర్తికాలేదు సరికదా- మొన్న ఏప్రిల్‌లో దాని గడ్డర్లు మూడు కూలిపడ్డాయి. పిల్లర్లపైన నిలిపిన గడ్డర్లకు ఊతంగా బేరింగులకు బదులు కర్రలు పెట్టారు... అవి ఎండకు ఎండి, వానలకు తడిచి పుచ్చిపోయాయి... అందుకే గడ్డర్లు కుప్పకూలాయని అధికారులు చల్లగా సెలవిచ్చారు. గుత్తేదారు అంత నిర్లక్ష్యంగా ఉంటే- సర్కారీ యంత్రాంగం ఎక్కడ ఏ గుడ్డి గుర్రం పళ్లుతోముతోంది? ఏపీలో గడచిన అయిదేళ్లలో జగన్‌ పార్టీ పెద్దల కనుసన్నల్లో ఇసుక దోపిడి భారీగా జరిగింది. దాని ధాటికి కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్యలో గోదావరి మీది గామన్‌ బ్రిడ్జి బేరింగ్‌ కుంగిపోయింది. నేతలు, వారి అంతేవాసుల అవినీతి మేతల మూలంగా జనభారతానికి వాటిల్లుతున్న నష్టానికి ఇదో ఉదాహరణ మాత్రమే!

దేశవ్యాప్తంగా 1977 తరవాత నలభై ఏళ్లలో 2130 వంతెనలు పడిపోయాయి. 2020-22 మధ్యకాలంలో జాతీయ రహదారుల మీద సగటున నెలకు ఒక బ్రిడ్జి చొప్పున కూలిపోయిందని కేంద్రమే మొన్న డిసెంబరులో రాజ్యసభలో వెల్లడించింది. ఏడాదిన్నర కిందట గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన తెగిపడి 141 మంది మరణించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, కోల్‌కతా మొదలు మహారాష్ట్రలోని చిప్లూన్‌ వరకు ఎన్నోచోట్ల ఫ్లైఓవర్లు నేలమట్టమయ్యాయి. ఇటువంటి వార్తలు వినడమే తప్ప ఆయా నిర్మాణాల దుర్గతికి కారకులైన వారికి ఎప్పుడైనా శిక్షలుపడ్డాయా? ఏదైనా ఘటన సంభవించగానే విచారణ కమిటీల పేరిట హడావుడి చేయడం, తరవాత ఎక్కడికక్కడ అంతా సర్దేయడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. చైనా, వియత్నామ్, ఇండొనేసియా వంటి దేశాల్లో అవినీతి సొరచేపలకు మరణశిక్షలు విధిస్తుంటారు. మన దగ్గరేమో పొట్ట పగిలేలా ప్రజల సొమ్మును మేసిన మహానుభావులనూ మహానేతలంటూ నెత్తినపెట్టుకుంటారు. ఆ దౌర్భాగ్యమే అన్ని రకాల అక్రమాలకు తల్లివేరు వంటి రాజకీయ అవినీతిని పెంచిపోషిస్తోంది. ఆ మహాజాడ్యాన్ని వదిలించుకున్న నాడే దేశం నిజంగా అభివృద్ధి బాటపడుతుంది!

శైలేష్‌ నిమ్మగడ్డ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.