మొక్కజొన్న తోటలో ఇథనాల్‌ బావి!

దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తి క్రమంగా చెరకు నుంచి మొక్కజొన్న వంటి తృణధాన్యాలవైపు మళ్ళుతోంది. పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్‌ కలిపే లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తోంది.

Published : 08 Jul 2024 01:33 IST

దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తి క్రమంగా చెరకు నుంచి మొక్కజొన్న వంటి తృణధాన్యాలవైపు మళ్ళుతోంది. పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్‌ కలిపే లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తోంది. దేశంలో ఇంధన భద్రతకు తోడ్పడటమే కాకుండా, ఇతరత్రా అవసరాల దృష్ట్యా మొక్కజొన్నకు ప్రాధాన్యం పెరుగుతోంది.

మొక్కజొన్న వంటి తృణధాన్యాల నుంచి మన దేశంలో మొదటిసారి భారీగా ఇథనాల్‌ ఉత్పత్తి అయింది. ఇథనాల్‌ ఉత్పత్తిలో చెరకు వాడకంపై కేంద్రం పరిమితులు విధించడంతో ధాన్యాలపై దృష్టి సారిస్తున్నారు. 2023 నవంబరు నుంచి 2024 అక్టోబరు వరకు కొనసాగే ప్రస్తుత ఇథనాల్‌ సంవత్సరంలో ఇంతవరకు ధాన్యం ఆధారిత ఇథనాల్‌ వాటా 51శాతంగా ఉంది. ఈ ఏడాది జూన్‌ నాటికి 357.12 కోట్ల లీటర్ల మేర ఇథనాల్‌ ఉత్పత్తి అయింది. ఇందులో చెరకు రసం, బి-హెవీ మొలాసిస్, సి-హెవీ మొలాసిస్‌ల నుంచి 175.74 కోట్ల లీటర్లు; ఆహార ధాన్యాల ద్వారా మరో 181.38 కోట్ల లీటర్ల ఇథనాల్‌ తయారైంది. ఒక్క మొక్కజొన్న ద్వారానే 110.82 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి కావడం విశేషం. మిగిలినది పాడైపోయిన ఆహార ధాన్యాలు, బియ్యం తదితరాల నుంచి తయారైంది. 2022-23లో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం ఇథనాల్‌లో 37.4 శాతమే ధాన్యాల ద్వారా సమకూరింది.

కేంద్రం 2025-26 నాటికి 20శాతం ఇథనాల్‌ కలిపిన ‘ఈ20 పెట్రోల్‌’ను అందుబాటులోకి తీసుకురావాలని లక్షించింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 15శాతం ఇథనాల్‌ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం పెట్రోల్‌లో ఇథనాల్‌ వాటా 12.7శాతమే. కొన్నేళ్లుగా చెరకును ఉపయోగించి అధికంగా ఇథనాల్‌ ఉత్పత్తి చేపట్టగా, దానిపై కేంద్రం పరిమితులు విధించింది. ఒక నివేదిక ప్రకారం, ఎకరా విస్తీర్ణంలో చెరకును పండించడానికి తొమ్మిది లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. ‘ఈ20 పెట్రోల్‌’ లక్ష్యాన్ని సాధించడానికి దేశంలో అదనంగా 132కోట్ల టన్నుల చెరకు, 1.9కోట్ల హెక్టార్ల భూమితో పాటు 34,800 కోట్ల ఘనపు మీటర్ల పరిమాణంలో నీరు కావాలి. చెరకు నుంచి ఒక లీటర్‌ ఇథనాల్‌ ఉత్పత్తి చేయడానికి 2,860 లీటర్ల నీరు అవసరమవుతుందని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. కాబట్టి, చెరకు నుంచి అధిక మొత్తంలో ఇథనాల్‌ తయారుచేయడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది.

దేశీయంగా ఆహార ధాన్యాల విభాగంలో బియ్యం, గోధుమల తరవాత మొక్కజొన్నే అధికంగా ఉత్పత్తి అవుతోంది. ఇథనాల్‌ తయారీలో దాని వాడకం పెరగడంవల్ల ఆ పంటకు ప్రాధాన్యం ఏర్పడింది. మొక్కజొన్న వినియోగం, డిమాండ్‌ రాబోయే సంవత్సరాల్లో మరింతగా పెరగనుంది. ‘ఈ20 పెట్రోల్‌’ లక్ష్య సాధన కోసం ఒక్క చెరకు నుంచే ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం కష్టం కాబట్టి, మొక్కజొన్న నుంచి తయారీని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం ఇటీవల అయిదు లక్షల టన్నుల మొక్కజొన్న దిగుమతికి ఆమోదం తెలిపింది. దేశీయంగా ఈ పంట సాగును పెంచడంపైనా దృష్టి సారించింది. 2024-25 సీజన్‌కు సంబంధించి మొక్కజొన్న కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,225గా ప్రకటించింది. బయో ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచడం కోసం పరిశ్రమల స్థాపన, విస్తరణకు రాయితీలు అందిస్తోంది. దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరిస్తుండటం, పశుగ్రాసం తదితర అవసరాలు పెరుగుతుండటంవల్లా మొక్కజొన్నకు డిమాండ్‌ అధికమవుతోంది. 2023-24లో 3.46 కోట్ల టన్నులమేర మొక్కజొన్న ఉత్పత్తి అయింది. దాన్ని రెట్టింపు చేయగల సామర్థ్యం ఇండియాకు ఉంది. 

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను వినియోగించడంవల్ల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించవచ్చు. ఇథనాల్‌ తయారీ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అన్నదాతలకు కొత్త ఆదాయ మార్గాలు అందివస్తాయి. పంట వ్యర్థాల నుంచి ఇథనాల్‌ తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్రం తొలిసారిగా 2003లో అయిదు శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇథనాల్‌ శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో 2025-26 నాటికి దేశంలో 1,350 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరమవుతుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. అందులో దాదాపు 1016 కోట్ల లీటర్లు ఒక్క ‘ఈ20 పెట్రోల్‌’ కోసమే వినియోగించాల్సి ఉంటుందంటున్నారు. తృణధాన్యాల నుంచి ఇథనాల్‌ తయారీ చేపట్టడాన్ని కొందరు నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ చర్య ఆహార భద్రతకు మంచిదికాదని వారు హెచ్చరిస్తున్నారు. అందుకని ఇంధన, ఆహార భద్రతలను సమతౌల్యం చేసుకుంటూ ఈ రెండు లక్ష్యాలనూ సాధించడానికి ప్రభుత్వం సరైన ప్రణాళికలను రచించాలి.

దేవవరపు సతీష్‌బాబు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు