చిన్నారులపై ‘సామాజిక’ పైత్యం

అడవిలో జంతువులు ఆకలేసినప్పుడే ఎదుటి ప్రాణి మీద దాడి చేస్తాయి. తమ వినోదం కోసమో, సంతోషం కోసమో మరే జంతువుకూ కీడు చేయవు. ఇది విచక్షణా జ్ఞానం లేని మూగజీవాలు సైతం పాటించే నీతి.

Published : 10 Jul 2024 01:03 IST

అడవిలో జంతువులు ఆకలేసినప్పుడే ఎదుటి ప్రాణి మీద దాడి చేస్తాయి. తమ వినోదం కోసమో, సంతోషం కోసమో మరే జంతువుకూ కీడు చేయవు. ఇది విచక్షణా జ్ఞానం లేని మూగజీవాలు సైతం పాటించే నీతి. అటువంటిది కొందరు తమ పైశాచికానందం కోసం సామాజిక మాధ్యమాల చాటున చేయరాని తప్పులు చేస్తూ వింత మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి, ఆన్‌లైన్‌ వేదికల నుంచి మన చిన్నారులను కాపాడుకోవాల్సిన అవసరముంది.

సామాజిక మాధ్యమాల్లో కనిపించే చిన్నారుల పట్ల నీచంగా ప్రవర్తించే సంస్కృతి నానాటికీ ఎక్కువైపోతోంది. మనుషులమనే స్పృహ లేకుండా ప్రవర్తించే వ్యక్తులను మృగాలతో పోలిస్తే అవి కూడా సిగ్గుతో తలదించుకుంటాయి. ఇటీవల ఒక చిన్నారి, మరో వ్యక్తి ఉన్న వీడియోకు కొందరు కుర్రాళ్లు వికృత వ్యాఖ్యానాలు జోడించి మరో వీడియోను రూపొందించారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. వారు పోస్టుచేసిన వీడియో, వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో సినీనటుడు సాయిదుర్గా తేజ్‌ (సాయిధరమ్‌ తేజ్‌) స్పందించారు. ఇటువంటి పెడధోరణుల పట్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ట్యాగ్‌ చేయడంతో ఆ పోస్ట్‌ గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క- విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు సాయిదుర్గా తేజ్‌ను అభినందించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే వీడియోను పోస్టుచేసిన వ్యక్తి క్షమాపణలు అర్థించినప్పటికీ, సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.

అపరిమిత స్వేచ్ఛతో అనర్థాలు...

కన్నవాళ్లు కంటిపాపల్లా కాపాడుకొనే చిన్నారుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యవహరించే తీరు జుగుప్సాకరంగానే కాదు, మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అనేంత ఆశ్చర్యం కలిగించేలా ఉంటోంది. అభంశుభం తెలియని చిన్నారులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న అంతటి స్వేచ్ఛ వారికి ఎందుకివ్వాలి? దీన్ని కచ్చితంగా అందరూ ఖండించే తీరాలి. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వాలు- ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల్లో దుశ్చర్యలకు పాల్పడే మేకవన్నె పులుల తోలు వలిచి బాలలకు భద్రత కల్పించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులను సైతం కొంతవరకు బాధ్యులను చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. వివాదాస్పదంగా మారిన ఆ వీడియో గురించి చెప్పాలంటే- అందులో ఉన్న వ్యక్తి చర్య బాలలపై హింసను ప్రోత్సహించేలా ఉంది. మరి పరిచయస్తులే పిల్లలతో ఇటువంటి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటే... ముక్కూమొహం తెలియనివారు బాధ్యతగా ప్రవర్తించాలని ఎలా ఆశించగలం?

సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపగల వ్యక్తులు (సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు) కొందరు తమ ఖాతాలను పూర్తిగా పిల్లలకు సంబంధించిన పోస్టులతోనే నడుపుతున్నారు. చిన్నారుల చిత్రాలు, వీడియోలతో లైకులు, షేర్లు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. ఇది ఎంతవరకూ సమర్థనీయం? చాలామంది ప్రముఖులే సోషల్‌ మీడియా విశృంఖలత్వానికి, ట్రోలర్ల ధాటికి బెదిరిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న అవమానాన్ని భరించలేక కొంతమంది బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. అటువంటి దుర్మార్గపు ప్రపంచంలోకి మన పిల్లల్ని మనమే తీసుకెళ్ళడం ఎంతవరకు సబబు? అందమైన, ఆహ్లాదకరమైన బాల్యానికి సామాజిక మాధ్యమాలు అవసరమా? అవి లేని ఒక సాధారణమైన వాస్తవిక ప్రపంచంలో వారిని పెంచలేమా?

అప్రమత్తతే రక్ష...

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన చిత్రాలు, వీడియోలు, వ్యాఖ్యలు నిరాటంకంగా వస్తూనే ఉన్నాయి. ఇది ఒక పోస్టుతోనో, ఒక కేసుతోనో పరిష్కారమైపోయే సమస్య కాదు. మన జీవితాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర అంతకంతకు పెరుగుతోంది. కానీ ఆ ప్రభావం పిల్లలపై ఎంతవరకూ ఉండవచ్చు అనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ అవసరం. తల్లిదండ్రులు తరచూ తమ పిల్లల చిత్రాలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడం సరికాదు. అది చిన్నారుల భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుంది. ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పెద్దలే ‘వ్యూస్‌’ ఊబిలో చిక్కుకుపోతే... రేపటి రోజున పిల్లలు ‘జీవితమంటే ఆన్‌లైనే’ అనుకునేంతగా పరిస్థితి మారిపోవచ్చు. భవిష్యత్తులో చిన్నారుల ఆలోచనలు దానిచుట్టూనే తిరుగుతూ జీవిత లక్ష్యాలకు దూరమయ్యే ప్రమాదముంది. కాబట్టి, యావత్‌ సమాజం అప్రమత్తంగా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన పోస్టు తన దృష్టికి రాగానే సూటిగా ప్రశ్నించి, అటువంటి వాటిని ఎంతమాత్రం సహించకూడదని పిలుపిచ్చిన నటుడు సాయిదుర్గా తేజ్‌కు, స్పందించిన ప్రభుత్వానికి అభినందనలు. ఆ క్రమంలో పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సైతం స్పందించారు. ప్రతి ఒక్కరూ ఇదే మాదిరిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే మన బిడ్డలకు భద్రమైన వాతావరణాన్ని కల్పించగలం!

 హితాన్షి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.