భారత్‌ చుట్టూ బంధనాలు 

ముత్యాలసరం (స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌) పేరుతో భారత్‌ చుట్టూ వ్యూహాత్మకంగా నౌకాశ్రయాలను నిర్మిస్తున్న చైనా తాజాగా మియన్మార్‌లో నౌకాశ్రయ నిర్మాణానికి పావులు కదుపుతోంది. ఇప్పటికే పాక్‌లోని గ్వదర్‌, శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న బీజింగ్‌ తాజాగా భారత తూర్పుతీరం...

Published : 07 Dec 2018 00:54 IST

తూర్పుతీరంపై ‘బీజింగ్‌’ కన్ను 
భారత్‌ చుట్టూ బంధనాలు 

ముత్యాలసరం (స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌) పేరుతో భారత్‌ చుట్టూ వ్యూహాత్మకంగా నౌకాశ్రయాలను నిర్మిస్తున్న చైనా తాజాగా మియన్మార్‌లో నౌకాశ్రయ నిర్మాణానికి పావులు కదుపుతోంది. ఇప్పటికే పాక్‌లోని గ్వదర్‌, శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న బీజింగ్‌ తాజాగా భారత తూర్పుతీరం వైపు దృష్టి సారించడంపై రక్షణవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మియన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్ర తీరంలో క్యాక్‌ప్యులో నౌకాశ్రయాన్ని నిర్మించడానికి ఆ దేశంతో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో బంగాళాఖాతంతో పాటు అండమాన్‌ సముద్రంలో చైనా ప్రవేశానికి మార్గం ఏర్పడనుంది.

భారత్‌ చుట్టూ ఉన్న సముద్ర జలాలపై చైనాకు ఎటువంటి సముద్రయాన హక్కులు లేవు. అయితే మన పొరుగుదేశాలతో అది ఒప్పందాలు చేసుకొని పాగా వేయడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా నుంచి చమురు రవాణా సాఫీగా జరగడంతో పాటు ‘సముద్రయాన సిల్క్‌రోడ్‌’ను అభివృద్ధి పరచి ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా మారాలన్నది డ్రాగన్‌ ఆలోచన. ప్రత్యేకించి ఆసియాలో భారత్‌ను నిలువరించేందుకు ముత్యాలసరం ప్రణాళికలో భాగంగా ఈ నౌకాశ్రయాన్ని నిర్మించనుంది. తమ నౌకల రవాణాకు దీన్ని ఉపయోగించుకుంటామని ప్రకటిస్తున్నప్పటికీ అత్యవసర సమయాల్లో నౌకాదళ కేంద్రంగా వినియోగించుకునే సౌలభ్యం ఉండటం గమనార్హం. మరో వైపు థాయ్‌లాండ్‌లోని క్రా ప్రాంతంలో భారీ కాలువ నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయి. దీని ద్వారా థాయ్‌ అఖాతం, అండమాన్‌ సముద్రాల మధ్య నూతన మార్గం ఏర్పడుతుంది. సూయజ్‌, పనామా కాలువల తరహాలో ఇది అంతర్జాతీయ సరకు రవాణాలో చైనాకు లబ్ధి చేకూర్చనుంది.

మియన్మార్‌ పశ్చిమ తీరంలోని రఖిన్‌ రాష్ట్రం క్యాక్‌ప్యులో రేవు పట్టణం ఉంది. ఇక్కడ చైనా సంస్థలు డీప్‌ పోర్టు నిర్మాణం చేపట్టనున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన పారిశ్రామిక సంస్థల కన్సార్టియం క్యాక్‌ప్యు ప్రత్యేక ఆర్థిక మండలి పేరుతో నిర్మాణం చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.  2010-15 మధ్య కాలంలో క్యాక్‌ప్యు నుంచి చైనాలోని యున్నన్‌ రాష్ట్రంలోని కున్మింగ్‌ వరకు చమురు, సహజవాయువుల సరఫరాకు పైప్‌లైన్‌ నిర్మించారు. ఇప్పుడు నౌకాశ్రయ నిర్మాణం ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు వ్యయంలో చైనా 70 శాతం, మియన్మార్‌ 30 శాతం భరించనున్నాయి. క్యాక్‌ప్యు నౌకాశ్రయం నిర్మాణంతో బంగాళాఖాతంలో భారత నౌకల సంచారంతో పాటు నౌకాదళ స్థావరాలపై నిఘాపెట్టే సామర్థ్యం చైనాకు చేకూరనుంది. కోల్‌కతా నౌకాశ్రయం నుంచి మియన్మార్‌కు క్యాక్‌ప్యు ద్వారానే బియ్యం రవాణా జరుగుతోంది. చైనీయుల రాకతో వీటి రవాణాపై పెను ప్రభావం పడే అవకాశముంది. థాయ్‌ కాలువ నిర్మాణానికి బీజింగ్‌ నాయకత్వం పావులు కదుపుతోంది. పథకంలో భాగంగా దేశ  దక్షిణభాగంలోని కొంత ప్రాంతాన్ని తవ్వి అండమాన్‌, థాయ్‌ అఖాతం మధ్య జలమార్గాన్ని నిర్మించనున్నారు. పశ్చిమాసియా, ఆఫ్రికా నుంచి వచ్చే చైనా రవాణా నౌకలు, చమురు ట్యాంకర్లు మలక్కా జలసంధి ద్వారా వెళ్లి దక్షిణ చైనా సముద్రం ద్వారా చైనాలోని ప్రధాన ఓడరేవులను చేరుకుంటాయి. మలక్కా జలసంధి ఇరుగ్గా ఉండటంతో నిత్యం వందలాది నౌకల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే రవాణాపై తీవ్ర ప్రభావం ప్రసరిస్తుంది. మలక్కాకు ప్రత్యామ్నాయంగా థాయ్‌ కాలువ నిర్మాణానికి డ్రాగన్‌ తహతహలాడుతోంది. కాలువ నిర్మాణంతో ఏకంగా చైనాకు 1200 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. అండమాన్‌ సముద్రం నుంచి కొత్త కాలువ ద్వారా దక్షిణ చైనా సముద్రానికి త్వరితగతిన చేరుకునే సదుపాయం ఏర్పడుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి 10 సంవత్సరాలు పట్టనుంది. మొదట పెట్టుబడిని రుణంగా ఇచ్చి అనంతరం కాలువను తమ స్వాధీనంలోకి తీసుకోవాలన్నది చైనా యోచనగా చెబుతున్నారు.

క్యాక్‌ప్యు, థాయ్‌ కాలువ పథకాలు భారత్‌ తూర్పు తీర భద్రతపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఐక్యరాజ్యసమితి చట్టాల ప్రకారం బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రాలపై భారత్‌కు ఎక్కువ హక్కులు ఉన్నాయి. క్యాక్‌ప్యు రేవు నిర్మాణంతో తూర్పు తీర భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. క్యాక్‌ప్యు నౌకశ్రయానికి ఎగువన ఉన్న సిట్వె నౌకాశ్రయం ద్వారా ఈశాన్య భారతానికి కోల్‌కతా రేవు నుంచి సరకు రవాణా జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మియన్మార్‌తో కలిసి కలదాన్‌ నదీ పథకం పూర్తికావొచ్చింది. నది ద్వారా మియన్మార్‌ నుంచి మిజోరం వరకు సరకు రవాణా జరగనుంది. ఈ పరిస్థితుల్లో చైనా ఇక్కడ తిష్ఠ వేయడం ఆందోళనకరం. థాయ్‌ కాలువతో అండమాన్‌ సముద్రంలో చైనా నౌకల సంచారం పెరగనుంది. భారత్‌ ఇప్పటికే అండమాన్‌ దీవుల్లో సైనిక స్థావరాలను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా చైనా రాకతో అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. థాయ్‌ కాలువ నిర్మాణానికి భారీ వ్యయం కానుంది. కాలువతో పర్యావరణానికి తీవ్రనష్టం కలిగే ప్రమాదముందని థాయ్‌ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు దీనిపై అయిష్టత కనబరచడం వల్ల ప్రాజెక్టు ముందుకు సాగడం కష్టసాధ్యమన్నది నిపుణుల భావన. చైనా రుణమిచ్చినా అనంతరం చెల్లింపుల పేరుతో ఏకంగా కాలువనే స్వాధీనం చేసుకోవచ్చని, ఇది దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని వారు హితవు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ అండమాన్‌తో పాటు తూర్పు తీరంలో మరిన్ని నౌకాదళకేంద్రాలతో పాటు మౌలిక సౌకర్యాలను  విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సాధ్యమైనంత వరకు అధిగమించగలం!

- కొలకలూరి శ్రీధర్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.