stray dogs: భౌ భౌ... బాబోయ్‌!

వీధి కుక్కల నియంత్రణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంటోంది. కాలు బయట పెట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న శునకాల సంచారం- దీర్ఘకాలిక సమస్యగా మారింది.

Published : 09 Jul 2024 01:57 IST

వీధి కుక్కల నియంత్రణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంటోంది. కాలు బయట పెట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న శునకాల సంచారం- దీర్ఘకాలిక సమస్యగా మారింది. మనుషుల రక్షణకు, జంతువుల హక్కులకు మధ్య సమతౌల్యం పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో దారుణ వైఫల్యమే- సమస్యకు మూల కారణం!

దేశంలో నిరుడు సుమారు 27.5 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అటువంటి బాధితుల సంఖ్య    2.89 లక్షలు. శునకాలు వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ దాడులకు తెగబడుతున్నాయి. అటుగా వచ్చేవారి వెంటపడి కరుస్తున్నాయి. చిన్నారులనైతే కండలూడేలా కొరుకుతూ లాక్కెళ్తున్న దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. తెలంగాణలో గత నెలలో నలుగురు పిల్లలు కుక్కల దాడిలో చనిపోయారు. ఉదయపు నడక సమయంలో వృద్ధులు, మహిళలు... పాఠశాల వేళల్లో విద్యార్థులు ఎక్కువగా కుక్కకాటు బారినపడుతున్నారు. వెంబడిస్తున్న శునకాలను తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్ర వాహనదారులు గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళల్లో పరిచయంలేని వీధుల్లోకి వెళ్ళాలంటే ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సిందే! శివార్లలో పడేసిన మాంసం వ్యర్థాలను శునకాలు తింటూ ఆ క్రమంలో గొర్రెలు, మేకల్ని చంపేస్తున్నాయి. ఆకలి, తీవ్రమైన దాహం, అభద్రతాభావంతోనే అవి అలా ప్రవర్తిస్తుంటాయని జంతు వైద్యులంటున్నారు.

అడుగడుగునా ఉల్లంఘనలే...

మన దేశంలో వీధి కుక్కలను వధించడం శిక్షార్హమైన నేరం. అయితే, వాటి సంతతి విచ్చలవిడిగా పెరగకుండా పుర, నగరపాలికలు విధిగా జంతు సంతాన నియంత్రణ (ఏబీసీ) చర్యలు చేపట్టాలి. శునకాలకు శస్త్రచికిత్సలు చేసి గాయం మానేదాకా జంతు సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలి. యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేసి, పూర్వ స్థానాల్లో వదిలేయాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగడంలేదు. నగరాల్లో పశువైద్య సిబ్బంది కొరత వేధిస్తుండటంతో జంతు సంతాన నియంత్రణ బాధ్యతను ఏజెన్సీలకు అప్పగించారు. కానీ, అది సజావుగా సాగడంలేదు. సుమారు ఆరు లక్షల వీధి కుక్కలున్న హైదరాబాద్‌లో అన్నింటికీ స్టెరిలైజేషన్‌ చేయాలంటే మరో అయిదేళ్లు పడుతుందని అంచనా. విశాఖపట్నంలో లక్ష్యంలో ఒక వంతు మాత్రమే పూర్తయింది. విజయవాడలో రోజూ 40-45 ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. పాలకవర్గాల తాత్సార వైఖరి కారణంగా నగరాల్లో ఏటికేడు వేల సంఖ్యలో వీధి కుక్కలు పుట్టుకొస్తున్నాయి. కాసుల కక్కుర్తితో కొన్నిచోట్ల స్టెరిలైజ్‌ చేయకుండానే చేసినట్లు చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏబీసీ ప్రక్రియను నిలిపేశారు.
నగరపాలికల్లో కేంద్ర మార్గదర్శకాలు కొంతవరకు అమలవుతున్నా, పురపాలికల్లో పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. సమస్య తలెత్తినచోట కొన్ని వీధి కుక్కలను పట్టుకుని జిల్లా కేంద్రాలకు తీసుకెళ్ళి స్టెరిలైజ్, వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తున్నారు. అందుకు ఒక్కో కుక్కకు రూ.1,000-1,200 ఖర్చవుతుండటంతో వెనకడుగు వేస్తున్నారు. పశువైద్య సిబ్బంది సాయంతో పట్టణాల్లో శస్త్రచికిత్సలు చేసే వెసులుబాటు ఉంది. కానీ, ఆ తరవాత నిర్వహణ లోపం వల్ల శునకాలు చనిపోతే ఎదురయ్యే న్యాయపరమైన వివాదాలకు జంకుతున్నారు.

పల్లెల్లో ఊసే మరిచారు... 

శునకాల వధను నిషేధించిన తరవాత గ్రామాల్లో పాలకవర్గాలు కాడి కిందపడేశాయి. కొన్నేళ్లుగా అక్కడ శునకాల నియంత్రణ చర్యలు కనిపించడమే లేదు. వ్యాక్సినేషన్‌ సంగతే మరిచిపోయారు. దైనందిన ఖర్చులు, కార్మికుల జీతభత్యాలకే నిధులు సరిపడక అవస్థలు పడుతుంటే... లక్షల రూపాయలు వెచ్చించి వీధి కుక్కల్ని ఎలా నియంత్రించగలమని అక్కడి పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలాగైతే భారత్‌ ‘2030 నాటికి రేబిస్‌రహిత దేశం’గా అవతరించడం ఎలా సాధ్యమవుతుంది? వీధి కుక్కల నియంత్రణ నిరంతర ప్రక్రియ. నిధుల లేమితో సతమతమవుతున్న స్థానిక సంస్థలకు కేవలం ఆదేశాలిచ్చి, సమీక్షలతో సరిపుచ్చితే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. అన్ని పురపాలికల్లో జంతు నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మహా నగరాల్లో స్టెరిలైజేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచాలి. కనీసం మండలానికి ఒక ఏబీసీ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి. యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌తోపాటు నడుం పైభాగంలో కరిస్తే తప్పకుండా వినియోగించాల్సిన ‘రేబిస్‌ ఇమ్యునోగ్లోబులిన్‌’ను అందుబాటులో ఉంచాలి. స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులపైనే భారం వేయకుండా వీధి కుక్కలకు నీరు, ఆహార సదుపాయం ఉండేలా చూడాలి. కుక్కకాట్ల సంఖ్య పెరగటంతోపాటు బాధితుల నిర్లక్ష్యమూ రేబిస్‌ మరణాలను పెంచుతోంది. ఈ మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులే అధికం. కాబట్టి, ప్రమాదకర సందర్భాలను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇటువంటి చర్యలతోనే దేశానికి రేబిస్‌ నుంచి విముక్తి లభిస్తుంది.

సముద్రాల స్వామినాథ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.