GST: జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్‌ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు.

Updated : 04 Jul 2024 15:02 IST

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్‌ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు.

జీఎస్టీ మండలి 52వ సమావేశం నిరుడు అక్టోబరులో జరిగింది. ఆ తరవాత ఎనిమిది నెలలకు 53వ భేటీ నిర్వహించారు. ఈ రెండు సమావేశాల మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో పాటు పలు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ ప్రభుత్వాల ప్రతినిధులు, మంత్రులు జీఎస్టీ సమస్యలపై లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. వాటన్నింటిపైనా ఆగస్టులో నిర్వహించే 54వ సమావేశంలో చర్చించాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. అయితే, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం కోసం తాజా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2017-20 మధ్యకాలంలో అవగాహన లేమి వల్ల కొందరు సరిగ్గా పన్ను చెల్లించలేదు. వాటిని 2025 మార్చి 31లోగా చెల్లిస్తే అపరాధ రుసుము, వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయించారు. పన్ను మొత్తం తక్కువగా ఉండే చిన్నపాటి కేసుల్లో జీఎస్టీ విభాగాలు ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు దాఖలు చేయకుండా నివారించాలని యోచించారు. అందుకోసం అప్పీళ్ల దాఖలుకు ద్రవ్య పరిమితులు విధించాలని నిర్ణయించారు. వీటితోపాటు కొన్నిరకాల వస్తువులు, సేవలపై పన్ను తగ్గించారు. కానీ, అత్యంత కీలకమైన నాలుగు సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.

ముసురుకొంటున్న వివాదాలు

జీఎస్టీ మండలి పరిష్కరించాల్సిన సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది- పన్నురేట్ల హేతుబద్ధీకరణ. బహుళ రేట్ల పరోక్ష పన్నులు అటు పన్ను చెల్లింపుదారులకు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. చెల్లించాల్సిన పన్నుల్లో స్పష్టత కొరవడటంవల్ల చెల్లింపుదారులకు, ప్రభుత్వ విభాగాలకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. దాంతో పన్ను వసూలుకు అంతరాయం కలుగుతోంది. వ్యాజ్యాలూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం జీఎస్టీలో ప్రధానంగా 5, 12, 18, 28శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాల దృష్టి ప్రధానంగా ఆదాయాన్ని రక్షించుకోవడంపైనే ఉండేది. కాబట్టి, ఆర్థికవేత్తలు సూచించిన రెండు రకాల రేట్లను కాదని నాలుగు రకాల పన్ను రేట్లను జీఎస్టీ మండలి ఆమోదించింది. ఈ విధానంవల్ల ఇబ్బందులు తలెత్తడంతో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కోసం ఆ మధ్య మంత్రుల కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ 12, 18శాతం పన్నులను ఏకీకరణ చేయడంపై దృష్టి సారించనుంది.

పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య- ‘విలోమ సుంక నిర్మాణం (ఇన్వర్టెడ్‌ డ్యూటీ స్ట్రక్చర్‌)’. సరఫరా చేసే ఉత్పత్తులపై విధించే పన్ను కంటే వాటి తయారీకి ఉపయోగించే ముడి సరకులపై పన్ను ఎక్కువగా ఉంటే దాన్ని ‘విలోమ సుంక నిర్మాణం’గా వ్యవహరిస్తారు. ఇటువంటి సందర్భాల్లో ముడి సరకులపై చెల్లించిన అధిక పన్నును ట్యాక్స్‌ చెల్లింపుదారులకు తిరిగి వెనక్కి ఇస్తారు. అయితే ఈ విషయంలో జాప్యం జరుగుతుండటంవల్ల వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతోంది. దీన్ని అధిగమించడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి: ఉత్పత్తులపై పన్ను పెంచడం. రెండోది: ముడి సరకులపై పన్ను తగ్గించడం. ఈ విలోమ సుంక నిర్మాణ సమస్య మొబైల్‌ ఫోన్లు, దుస్తులు, చెప్పులు, ఎరువుల విషయంలో ఎక్కువగా కనిపిస్తోంది. మొబైల్‌ ఫోన్లపై పన్నును 18శాతానికి పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించారు. మిగతా ఉత్పత్తులపై పన్ను పెంచితే వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. ఈ అంశంపైనా మంత్రుల కమిటీ దృష్టి సారించనుంది.

జీఎస్టీ కారణంగా రాష్ట్రాల ఆదాయ వృద్ధి 14శాతం కంటే తక్కువగా ఉంటే... ఆ లోటును అయిదు సంవత్సరాల వరకు భర్తీ చేస్తానని మొదట్లో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ పరిహారం చెల్లించడానికి అవసరమైన నిధుల కోసం కొన్ని విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై ‘పరిహార సెస్‌’ విధించడానికి ప్రత్యేక చట్టం చేసింది. అలా వసూలైన మొత్తాన్ని గడువు ప్రకారం 2022 వరకు రాష్ట్రాలకు పరిహారంగా అందించింది. అయితే, కొవిడ్‌ ప్రబలిన 2020, 2021 సంవత్సరాల్లో నిధులు సరిగ్గా సమకూరలేదు. దాంతో కేంద్రం అప్పులుచేసి రాష్ట్రాలకు పరిహారం చెల్లించింది. ఆ రుణాలను తీర్చడం కోసం 2026 వరకు సెస్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. దేశార్థికం వేగంగా ఎగబాకుతుండటంతో పాటు జీఎస్టీ, సెస్‌ వసూళ్లు పెరుగుతున్నందువల్ల ఈ రుణాలు 2026కు ముందే తీరిపోవచ్చంటున్నారు. అప్పులు తీరిన తరవాత 2026 వరకు వసూలయ్యే సెస్‌ను కేంద్రం, రాష్ట్రాలు పంచుకుంటాయి. అయితే ఆ సెస్‌ను ఆ తరవాత కూడా కొనసాగించాలని, లేదంటే దాన్ని ‘28శాతం పన్ను’ స్లాబులోకి తీసుకువస్తే రాష్ట్రాలకు మరింత ఆదాయం సమకూరుతుందన్న అభ్యర్థనలు వస్తున్నాయి. ఏ విధంగా చూసినా సెస్‌ను రద్దు చేయకపోతే మాత్రం ప్రజలపై భారం పడుతూనే ఉంటుంది.

చొరవే కీలకం...

‘వస్తుసేవలను అంతిమంగా వినియోగించేవారే పన్ను చెల్లించాలి, వినియోగించిన రాష్ట్రానికే పన్ను సమకూరాలి’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ ప్రవేశపెట్టిన జీఎస్టీ... ‘ఒకే దేశం- ఒకే పన్ను’ లక్ష్యాన్ని సాకారం చేసింది. ఈ చట్ట నిబంధనలను మరింత సరళతరం చేయడంతో పాటు అన్ని సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా జీఎస్టీ మండలి చొరవ చూపాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.20.18 లక్షల కోట్ల వసూళ్లతో జీఎస్టీ కేంద్రం, రాష్ట్రాలకు అతిపెద్ద ఆదాయ వనరుగా నిలిచింది. దానికి సరైన దశ, దిశ నిర్దేశించే బాధ్యత జీఎస్టీ మండలిదే!


పెట్రో ఉత్పత్తులపై వడ్డన

దేశంలో పెట్రోల్, డీజిల్‌ తదితర ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మరో ప్రధాన సమస్యగా మారింది. వీటి ద్వారా రాష్ట్రాలకు 25శాతం మేర ఆదాయం సమకూరుతోంది. అందుకే రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు పెట్రో ఉత్పత్తులను మొదట్లో జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. దాంతో కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నుతో వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది పన్నుపై పన్ను విధించకూడదనే జీఎస్టీ మౌలిక సూత్రానికి విరుద్ధం. ఒక్కో రాష్ట్రం ఒక్కోలా పన్ను విధిస్తుండటంతో పెట్రోల్, డీజిల్‌ ధరల్లో వ్యత్యాసాలు ఏర్పడి వస్తు రవాణా సాఫీగా సాగడంలేదు. రాష్ట్రాల అంగీకారం లేకుండా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం సాధ్యంకాదని కేంద్రం చెబుతోంది. కాబట్టి జీఎస్టీ మండలి ఈ విషయంలో రాష్ట్రాలకు నచ్చజెప్పి, వాటి ఆదాయాలకు భరోసా కల్పించాల్సిన అవసరముంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.