Water crisis: నీటి కటకట... పొదుపే మార్గం!

దేశ రాజధాని దిల్లీ ప్రస్తుతం నీటి కొరతతో కటకటలాడుతోంది. ట్యాంకర్ల వెంట జనం పరుగులు తీస్తున్న దృశ్యాలు అక్కడి జల సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. దేశీయంగా చాలా నగరాలు భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని నివారించాలంటే జల సంరక్షణ అందరి జీవితాల్లో భాగం కావాలి.

Published : 15 Jun 2024 00:49 IST

దేశ రాజధాని దిల్లీ ప్రస్తుతం నీటి కొరతతో కటకటలాడుతోంది. ట్యాంకర్ల వెంట జనం పరుగులు తీస్తున్న దృశ్యాలు అక్కడి జల సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. దేశీయంగా చాలా నగరాలు భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని నివారించాలంటే జల సంరక్షణ అందరి జీవితాల్లో భాగం కావాలి. ప్రభుత్వాలు దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రపంచవ్యాప్తంగా నదులు నాగరికతకు నాంది పలికాయి. జల వనరులు ఆర్థిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి తోడ్పడ్డాయి. అందుకే మానవ జాతి చైతన్యం, మనుగడ జల సుస్థిరతపై ఆధారపడి ఉంటాయి. నీటిని పొందడం ప్రతి ఒక్కరి హక్కు. కేంద్ర భూగర్భ జల ప్రాధికార సంస్థ లెక్కల ప్రకారం- రోజుకు ప్రతి మనిషికి కనీసం 135 లీటర్ల నీరు కావాలి. పోనుపోను తాగు, సాగుతో పాటు పరిశ్రమలకు నీటి వినియోగం అధికమవుతోంది. నీటి వినియోగం పెరిగేకొద్దీ జల సంరక్షణ చర్యలూ ఊపందుకోవాలి. లేకుంటే, నీటి కొరత విజృంభించి ఆహార భద్రత, దేశ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

కాలుష్యం కోరల్లో...

ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా 18శాతం. జల వనరుల్లో మాత్రం ఇండియా వాటా నాలుగు శాతమే! భూ ఉపరితల జలాల్లో 89శాతం వ్యవసాయానికి, తొమ్మిది శాతం గృహ అవసరాలకు, రెండు శాతం పరిశ్రమలకు వినియోగిస్తున్నారు. భూగర్భ జలాల్లో 92శాతం వ్యవసాయానికి, అయిదు శాతం పరిశ్రమలకు, మూడు శాతం గృహ అవసరాలకు వాడుతున్నారు. ఇండియాలో 1951 నుంచి ఇప్పటి వరకు లభ్యమవుతున్న జల వనరులు ఇంచుమించు అలాగే ఉన్నాయి. కానీ, పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి వినియోగం మాత్రం మూడు రెట్లు అధికమైంది. ఇదే నీటి కొరతకు దారితీస్తోంది. ఇండియాలో 1951లో తలసరి వినియోగించదగిన నీటి లభ్యత 3450 ఘనపు మీటర్లు. 2011లో అది 1545 ఘనపు మీటర్లకు, 2021 నాటికి 1486 ఘనపు మీటర్లకు తరిగిపోయింది. 2051 నాటికి తలసరి నీటి లభ్యత 1228 ఘనపు మీటర్లకు పడిపోతుందని అంచనా. ప్రామాణిక లెక్కల ప్రకారం తలసరి నీటి లభ్యత 1700 ఘనపు మీటర్లు కన్నా తక్కువగా ఉంటే అది నీటి ఒత్తిడికి కారణమవుతుంది. దీని ప్రకారం దేశంలో నీటి కష్టాలు 2011 కన్నా ముందే మొదలయ్యాయని అర్థమవుతుంది.

కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం భారతదేశంలో 2010లో తాగడానికి, సాగుకు, పరిశ్రమలకు, విద్యుదుత్పత్తికి, ఇతర అవసరాలకు దాదాపు 81 వేల కోట్ల ఘనపు మీటర్ల నీరు వినియోగమైంది. 2050నాటికి అది 1.44 లక్షల ఘనపు మీటర్లకు చేరుతుందని అంచనా. విద్యుత్తు రంగంలో నీటి వినియోగం 2050 నాటికి 25శాతం పెరగనుంది. దేశీయంగా 2018-19లో మొదటిసారి జల వనరులపై జరిపిన సర్వే ప్రకారం చెరువులు, కుంటలు, సరస్సులు, జలాశయాలు కలిపి మొత్తం 24 లక్షల వరకు ఉన్నాయి. అందులో 38 వేలకు పైగా ఆక్రమణల బారిన పడ్డాయి. దేశంలో ప్రతి రోజూ నాలుగు కోట్ల లీటర్ల కలుషిత నీరు జలవనరుల్లోకి చేరుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా, 70శాతం నీరు వినియోగానికి పనికిరాకుండా పోతోంది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం ఇండియాలో 2018 నాటికే 60 కోట్ల మంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొన్నారు. 43శాతం జనాభాకు తాగునీటి సౌకర్యం లేదు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా దాదాపు 3.77 కోట్ల మంది నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడుతున్నారు.

సమర్థ చర్యలు అవసరం

ఇండియాలో నీటి గిరాకీ, లభ్యతల మధ్య సమతుల్యత లోపించిన దుష్ఫలితాలను బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటివి ఇప్పటికే చవిచూస్తున్నాయి. తక్షణం సమగ్ర నీటి పరిరక్షణ, నిర్వహణ చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తు మరింత నరకప్రాయంగా మారుతుంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను అడ్డుకోవడం ద్వారా జల వనరులను కాపాడవచ్చు. సరస్సులు, కుంటలు, జలాశయాల కబ్జాలను అరికట్టాలి. వాటిలో తరచూ పూడిక తీయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చు. బిందు, తుంపర సేద్య విధానాలతో సాగులో నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. వాన నీటి నిల్వను ప్రజలందరూ తమ బాధ్యతగా భావించాలి. నీరు కాలుష్యం బారిన పడకుండా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. కలుషిత నీటి శుద్ధి, పునర్వినియోగంపై దృష్టి సారించాలి. నీటి పొదుపు ఆవశ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.