Iran President: ఉదారవాదికి ఇరాన్‌ పట్టం

ఇటీవలి ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పరమ ఛాందసవాది సయీద్‌ జలీలీపై సంస్కరణవాది మసూద్‌ పెజెష్కియాన్‌ గెలుపు అందరినీ ఆశ్చర్యపరచింది. కట్టుబాట్ల పేరుతో పీడన, ఆర్థిక, రాజకీయ అస్థిరతల వల్ల ఇరాన్‌ ప్రజలు ఎన్నికలపై మొదట పెద్దగా ఆసక్తి కనబరచలేదు.

Published : 09 Jul 2024 01:58 IST

ఇటీవలి ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పరమ ఛాందసవాది సయీద్‌ జలీలీపై సంస్కరణవాది మసూద్‌ పెజెష్కియాన్‌ గెలుపు అందరినీ ఆశ్చర్యపరచింది. కట్టుబాట్ల పేరుతో పీడన, ఆర్థిక, రాజకీయ అస్థిరతల వల్ల ఇరాన్‌ ప్రజలు ఎన్నికలపై మొదట పెద్దగా ఆసక్తి కనబరచలేదు. పెజెష్కియాన్‌ ఉదారవాద అజెండాకు చాలామంది ఆకర్షితులవడం ఆయన గెలుపును నిర్దేశించింది. 

తాచారం ప్రకారం తల నుంచి పాదాల వరకు కప్పి ఉంచే చాదోర్‌ వస్త్రాన్ని ధరించనందుకు 2022లో కుర్దు యువతి మెహసా అమీనీని పోలీసు కస్టడీలో హతమార్చడంతో ఇరాన్‌లో పెద్దయెత్తున నిరసనలు రేగాయి. ఇటీవల అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చాదోర్‌ గురించి చర్చ వచ్చినప్పుడు పెజెష్కియాన్‌ తన కుటుంబంలోని స్త్రీలంతా చాదోర్‌ ధరిస్తారని, అయితే మహిళలను రెండో తరగతి పౌరులుగా చూడటం తగదని అన్నారు. షియా మతరాజ్యమైన ఇరాన్‌లో అటు సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునికతకూ చోటివ్వాలని వాదించే మధ్యేవాదిగా పెజెష్కియాన్‌ పేరుతెచ్చుకున్నారు. మైనారిటీ వర్గాలైన అజెరీ, కుర్దు తల్లిదండ్రులకు ఆయన జన్మించారు. ఇరాన్‌లోని అల్పసంఖ్యాక వర్గాలతోపాటు సంస్కరణాభిలాషులు, షియా మతంలోని ఉదారవాదుల ఆదరణ సైతం పొందినందువల్ల 53శాతానికి పైగా ఓట్లు సాధించి సనాతనవాది సయీద్‌ జలీలీని ఓడించారు. గత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే నెలలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో బరిలో నిలవడానికి షియా మతాచార్యుల మండలి అనుమతించిన ఏకైక సంస్కరణవాద అభ్యర్థి పెజెష్కియాన్‌ ఒక్కడే.

ఇరాన్‌ అణు కార్యక్రమంపై అమెరికా, దాని మిత్ర దేశాలతో ఏళ్లతరబడి చర్చలు జరిపిన మాజీ ఉప విదేశాంగ మంత్రి జలీలీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని చాలామంది భావించారు. అదే జరిగితే ఇరాన్‌ గుట్టుగా యురేనియం ఇంధన శుద్ధిని కొనసాగించి అణ్వస్త్రాలను తయారు చేసేదని పాశ్చాత్య పరిశీలకులు చెబుతున్నారు. ఇరాన్‌ అణ్వస్త్ర తయారీని విరమిస్తే ఆర్థిక ఆంక్షలను సడలిస్తామని 2015లో అమెరికా, ఇతర దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరాన్‌ తీరులో తప్పులెన్నుతూ 2018లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. తాజా ఎన్నికల్లో పెజెష్కియాన్‌ ఎన్నికవడం వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందా అని పరిశీలకులు ఎదురు చూస్తున్నారు. ఆర్థిక ఆంక్షల వల్ల కుదేలైన ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే అమెరికాతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని పెజెష్కియాన్‌ వాదిస్తున్నారు. అయితే, నవంబరు అమెరికా అధ్యక్ష ఎన్నికలో డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్ళీ గెలిస్తే పరిస్థితి మొదటికి రావచ్చు. పెజెష్కియాన్‌ గెలుపును ఇరాన్‌ మిత్రదేశమైన రష్యా వెంటనే స్వాగతించింది. అమెరికా, దాని పాశ్చాత్య మిత్రుల నుంచి పెద్దగా స్పందన లేదు. సౌదీ అరేబియా, పాకిస్థాన్‌లు మాత్రం పెజెష్కియాన్‌ను అభినందించాయి.  

వృత్తిరీత్యా హృదయ శస్త్రచికిత్స నిపుణుడైన పెజెష్కియాన్‌ రెండు దశాబ్దాల క్రితం ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరోవైపు గాజా, లెబనాన్, యెమెన్‌లలో ఇజ్రాయెల్, దాని మద్దతుదారైన అమెరికాపై పోరాడుతున్న తీవ్రవాద బృందాలకు పరోక్షంగా మద్దతిస్తోంది. ఎర్ర సముద్రం గుండా చమురు నౌకల రవాణాకు ముప్పుతెస్తున్న హూతీ తిరుగుబాటుదారులకూ ఇరాన్‌ అండ ఉంది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్‌లు పరస్పరం క్షిపణి వర్షం కురిపించుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పగ్గాలు చేపడుతున్న పెజెష్కియాన్‌ పాశ్చాత్య దేశాలతో సయోధ్యను సాధించగలరా, ఆయన సంస్కరణ అజెండాను మతాచార్యుల మండలి సాగనిస్తుందా అని ప్రశ్నించేవారు చాలామందే ఉన్నారు. పెజెష్కియాన్‌ ఆగస్టు మొదటివారంలో దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఇరాన్‌లో అధినాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన నాయకత్వంలోని మతాచార్యుల మండలి చేతిలోనే సర్వాధికారాలు ఉంటాయి. అధ్యక్షుడి అధికారాలు పరిమితం. ఖమేనీ మార్గదర్శకత్వానికి అనుగుణంగా ఆయన నడుచుకోకతప్పదు. ప్రస్తుతం సంస్కరణవాదిగా ముద్రపడిన పెజెష్కియాన్‌ ఇస్లామిక్‌ విప్లవం తొలినాళ్లలో ఆస్పత్రుల్లో నర్సులు, మహిళా రోగులు తప్పనిసరిగా చాదోర్‌ ధరించాలనే నిబంధనను అమలు చేశారు. ఇప్పుడు దేశాధ్యక్షుడిగా ఆయన గెలుపు ప్రపంచానికి ఇరాన్‌ ఉదారవాద పార్శ్వాన్ని ప్రదర్శించడానికి, అమెరికా కూటమి నుంచి ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడవచ్చని మతాచార్యులు, సైన్యాధికారులు ఆశిస్తూ ఉండవచ్చు. అయితే, అమెరికాలో ట్రంప్‌ గెలుపు వారి ఆశను అడియాస చేయవచ్చు. 

ఆర్య 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.