Own House: సొంతిల్లు... నెరవేరని కల!

దేశంలో సొంతింటి కల నెరవేరని కుటుంబాలెన్నో! చదువు, వ్యాపారం, ఉద్యోగం కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. దాంతో అక్కడి గృహాలకు డిమాండ్‌ అధికమవుతోంది. కాబట్టి, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు పెద్దపీట వేయాల్సిన అవసరముంది.

Updated : 05 Jul 2024 03:44 IST

దేశంలో సొంతింటి కల నెరవేరని కుటుంబాలెన్నో! చదువు, వ్యాపారం, ఉద్యోగం కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. దాంతో అక్కడి గృహాలకు డిమాండ్‌ అధికమవుతోంది. కాబట్టి, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు పెద్దపీట వేయాల్సిన అవసరముంది.

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం- తొలి మంత్రివర్గ సమావేశంలోనే దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా మూడు కోట్ల గృహాలను నిర్మించాలని నిశ్చయించింది. అంతకుముందు తాత్కాలిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి రాబోయే అయిదేళ్లలో గ్రామాల్లో అదనంగా రెండు కోట్ల గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు. అంటే, పట్టణ ప్రాంతాల్లో అద నంగా కోటి ఇళ్లను అందుబాటులోకి తెస్తారన్న మాట. అయితే 2018 నాటికే పట్టణాల్లో 2.9 కోట్ల ఇళ్లకు కొరత ఉన్నట్లు ‘అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలపై భారతీయ పరిశోధనా మండలి (ఇక్రియర్‌) నివేదిక-2020’ వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ 10 నాటికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-పట్టణ (పీఎంఏవై-యు) పథకం కింద మంజూరైన మొత్తం గృహాల సంఖ్య 1,18,60,000. పట్టణ ప్రాంతాల్లో ఇంతవరకు 83,70,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

అందరికీ గృహ వసతి ఏదీ?

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ), అంతకుముందు చేపట్టిన ఇతర గృహ నిర్మాణ కార్యక్రమాలు అన్నీ ‘అందరికీ గృహ వసతి’ అని వాగ్దానం చేశాయి. కానీ, ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- పట్టణ’ కింద నిర్మితమయ్యే గృహాల్లో కొన్నింటిని అద్దె ఇళ్లుగా వినియోగించాలనే విషయం చాలామందికి తెలియదు. పీఎంఏవై-యు కింద ఇలా అద్దె గృహాల నిర్మాణానికి రూ.6,000 కోట్లు మంజూరు చేశారు. ఈ పథకం ప్రారంభమైన మొదట్లో ఇళ్లను యాజమాన్య పద్ధతి మీదనే అందించాలని తలపెట్టిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. పీఎంఏవై-యు కింద మురికివాడల్లో పక్కా గృహాల నిర్మాణం; డెవెలపర్లకే ప్రభుత్వం సబ్సిడీ అందించి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను కేటాయించడం; గృహ నిర్మాణం కోసం లబ్ధిదారులకే ఆర్థిక సహాయం చేయడం వంటివి చేపట్టాలని నిర్ణయించారు. ఇళ్ల పట్టాల మంజూరులో ఇబ్బందులు, ప్రైవేటు డెవెలపర్లు ముందుకు రాకపోవడం, ఊరికి దూరంగా నిర్మాణాలు చేపట్టడం వంటి సమస్యల వల్ల పీఎంఏవై-యు సజావుగా ముందుకు సాగడంలేదు.

మన పట్టణాలు, నగరాల్లో అద్దె ఇళ్లు విరివిగా లభ్యమైతే వలస కార్మికులకు, అల్పాదాయ వర్గాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 2011 జనగణన ప్రకారం 27.5శాతం పట్టణ కుటుంబాలు బాడుగ ఇళ్లలోనే నివసిస్తున్నాయి. 2001-11 మధ్యకాలంలో అద్దె ఇళ్లలో నివసిస్తున్న పట్టణ కుటుంబాల సంఖ్య 64లక్షలకు పెరిగింది. అదే కాలంలో పట్టణాల్లో కొత్తగా 46లక్షల గృహాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి సంఖ్య బాగా పెరగాల్సి ఉంది. దేశంలోని పట్టణ కుటుంబాల్లో మూడో వంతు అద్దె గృహాల్లో నివసిస్తున్నట్లు 2018 నాటి ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే వెల్లడించింది. పది లక్షలకు మించి జనాభా కలిగిన పట్టణాల్లో ఇలాంటివారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. అద్దెకు ఉండేవారిలో 70శాతం తమ గృహ యజమానులతో ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోవడంలేదు. ఉభయులూ కేవలం నోటి మాటగానే ఒప్పందం చేసుకుంటున్నారు. చాలా అద్దె ఇళ్లలో ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం ఉండటం లేదు.

ప్రభుత్వ విధానాలు అద్దె ఇళ్లకు కాకుండా సొంత గృహాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి తోడు బాడుగలపై పరిమితి విధించే అద్దె నియంత్రణ చట్టం అమలులో ఉండటం ఇళ్ల కొరతకు దారితీస్తోంది. అద్దెకు ఉండేవారిని ఖాళీ చేయించే విషయంలో కోర్టు వివాదాలు తలెత్తితే, అవి పరిష్కారం కావడానికి చాలాకాలం పడుతోంది. స్థిరాస్తి ధరతో పోలిస్తే బాడుగ రూపంలో ఏటా లభించే ఆదాయం నగరాల్లో మరీ తక్కువగా ఉండటమూ కొత్త ఇళ్ల నిర్మాణాన్ని నిరుత్సాహపరుస్తోంది. పట్టణాల్లో బాడుగ ఇళ్లు చాలినన్ని లేకపోవడంతో ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. దాంతో అల్పాదాయ వర్గాలకు ఆర్థికంగా భారమవుతోంది. ఇటువంటి సమస్యల పరిష్కారానికి 2021లో నమూనా అద్దె చట్టాన్ని (ఎంటీఏ) తీసుకొచ్చారు. అడ్వాన్సును రెండు నెలల అద్దెకు పరిమితం చేయడం, సకాలంలో ఇంటిని ఖాళీ చేయకపోతే జరిమానా విధించడం, లీజు మధ్య కాలంలో అకారణంగా అద్దెలను భారీగా పెంచకుండా యజమానులపై నియంత్రణ విధించడం వంటి నిబంధనలతో ఎంటీఏ యజమానులు, అద్దెకు ఉండేవారి ప్రయోజనాల మధ్య సమతూకం పాటిస్తోంది. అద్దె ఒప్పందాల విషయంలో వివాదాల పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు ఎంటీఏ వీలు కల్పిస్తోంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు మాత్రమే ఎంటీఏ-2021కు అనుగుణంగా తమ అద్దె చట్టాలను సవరించాయి. అద్దె నియంత్రణ ప్రాధికార సంస్థ వద్ద బాడుగ ఒప్పందాలను నమోదు చేయాలని, అద్దెలను ఫలానా పరిమితికి మించి పెంచకూడదని ఎంటీఏ నిబంధనలు విధించింది. అద్దె ఒప్పందాల్లోని న్యాయ పరిభాషను అర్థం చేసుకోవడం బడుగు వర్గాలకు కష్టమవుతుంది. ఇటువంటి సమస్యలను అధిగమించాల్సి ఉంది.

వలసలతో పెరుగుతున్న గిరాకీ

భారత్‌లో పట్టణీకరణ జోరుగా సాగుతోంది. గ్రామాల నుంచి విద్య, వృత్తి ఉపాధుల కోసం నగరాలు, పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. అందువల్ల భవిష్యత్తులోనూ పట్టణ గృహాలకు డిమాండ్‌ అధికమవుతుంది. దాన్ని తీర్చాలంటే అద్దె ఇళ్లను విరివిగా నిర్మించాలి. కాబట్టి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణ)కు ప్రాధాన్యమివ్వాలి. అద్దె పద్ధతుల విశ్లేషణ, నియంత్రణలకు ప్రత్యేక నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలి. బడుగు వర్గాలకు అనుకూలంగా... ఆయా రాష్ట్రాలు, పట్టణాల్లోని పరిస్థితులకు తగ్గట్లు ఎంటీఏలో అవసరమైన మార్పుచేర్పులు చేయాలి. ఇలా పేద, మధ్యతరగతివారి గృహ అవసరాలను తీర్చడానికి విధానపరంగా, ఆచరణాత్మకంగా ముందుకు సాగాలి. అందరికీ గృహవసతి లక్ష్య సాకారానికి అంకితం కావాలి.


దక్కని రుణాలు

దేశవ్యాప్తంగా నగరాల్లో గృహాల కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్యను ఎదుర్కొంటున్న కుటుంబాల్లో 99శాతం అల్పాదాయ వర్గాలకు చెందినవారే. వారిలో అత్యధికులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, లేదంటే అసంఘటిత రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఆదాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి కాబట్టి, సొంతింటిని సమకూర్చుకొనేంత ఆర్థిక స్తోమత ఉండటంలేదు. అలాంటి కుటుంబాలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహరుణాలు ఇవ్వడంలేదు. దాంతో వారు అద్దె గృహాల్లోనే జీవనం సాగిస్తున్నారు.


సౌమ్యదీప్‌ చట్టోపాధ్యాయ్‌
(అసోసియేట్‌ ప్రొఫెసర్, విశ్వభారతి కేంద్రీయ విశ్వవిద్యాలయం, పశ్చిమ్‌ బెంగాల్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు