MSP: కనీస మద్దతు ధరలపై కనికరం లేదా?

దేశీయంగా సాగు రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వ్యవసాయ ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడం లేదు. దాంతో వారు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు పంటలకు మద్దతు ధరలు పెంచింది.

Published : 04 Jul 2024 01:36 IST

దేశీయంగా సాగు రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వ్యవసాయ ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడం లేదు. దాంతో వారు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు పంటలకు మద్దతు ధరలు పెంచింది. వాస్తవ ఖర్చులతో పోలిస్తే అవి ఏమాత్రం సరిపోవని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన అంశాల్లో ధరల విధానం ఒకటి. సాగు రంగం ఆధునికీకరణను అందిపుచ్చుకొని, పంటల ఉత్పాదకత పెరగాలంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ప్రోత్సాహకరంగా ఉండాలి. పంటలకు లాభసాటి ధర వచ్చినప్పుడే రైతు అధికంగా ఉత్పత్తి చేయడానికి సిద్ధపడతాడు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ధరలను వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల వర్ధమాన దేశాల్లో అభివృద్ధి దృష్ట్యానే కాకుండా, మొత్తం ఆర్థిక వ్యవస్థ పరంగానూ సాగు రంగం ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటిస్తోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 14 రకాల పంటలకు కనీస మద్దతును కేంద్రం ఇటీవల పెంచింది. గత సంవత్సరంతో పోలిస్తే క్వింటా వరికి కనీస మద్దతు ధర రూ.117 పెరిగింది. పప్పు ధాన్యాల దిగుమతులను తగ్గించాలనే లక్ష్యంతో కందులకు క్వింటాలుకు రూ.550 పెంచింది. అయితే, వాస్తవ ఖర్చులతో పోలిస్తే ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు అరకొరేనని రైతులు వాపోతున్నారు.

ఆహార భద్రతపై ఆందోళన

ఝా కమిటీ (1964) సూచన ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1965లో వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, చెరకు, నూనెగింజలు, పత్తి, జనుము ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి ఈ కమిషన్‌ సూచనలిస్తుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ అవసరాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సంతులిత, సమగ్ర ధరల వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఇది ప్రధానపాత్ర పోషిస్తుంది. వ్యవసాయ ధరల కమిషన్‌ను 1985లో వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌(సీఏసీపీ)గా మార్చారు. ధరల అనిశ్చితి నుంచి రైతులను రక్షించేందుకు 1966-67లో భారత ప్రభుత్వం కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీని) ప్రవేశపెట్టింది. తృణధాన్యాల ఉత్పత్తిలో భారీ లోటు నెలకొన్న తరవాత వెలువడిన నిర్ణయమిది. జనాభాకు కావాల్సిన ఆహార ధాన్యాల గిరాకీని దృష్టిలో పెట్టుకొని పంటలు పండించడానికి అనువుగా ఉండేలా ధరల విధానాన్ని రూపొందించింది. ఈ కనీస మద్దతు ధరలను నిర్ణయించే సందర్భంలో ఉత్పత్తి వ్యయాలు, ముడిపదార్థాల ధరల్లో మార్పులు, వివిధ ఆహార పంటల ధరల వ్యత్యాసం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, కేంద్రం ప్రకటించే మద్దతు వల్ల ఒరుగుతున్నది ఏమీ లేదని రైతులు విమర్శిస్తున్నారు. కేంద్రం మద్దతుతో పోలిస్తే బయటి విపణిలో అధిక ధర లభిస్తుండటంతో కొంతకాలంగా గోధుమ రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంటను విక్రయిస్తున్నారు. దానివల్ల ఆహార భద్రత చట్టం కింద నిర్దేశిత లక్ష్యం మేరకు కేంద్రం గోధుమ సేకరణ చేయలేకపోతోంది. దాంతో ఆహార భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. 

భూమి విలువ, కౌలు ధర సహా అన్ని రకాల వాస్తవిక వ్యయాల్ని గణించి అదనంగా 50శాతం గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్‌ సిఫార్సు చేశారు. నీతి ఆయోగ్‌ మాత్రం భూమి ధరలు, కౌలు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించడం రైతు కష్టాన్ని విస్మరించడమే. ఇటీవలి కాలంలో డీజిల్, విద్యుత్, ఎరువులు, సాగు ఖర్చుల ధరలు విపరీతంగా పెరిగాయి. సరైన మద్దతు ధర రాక కొన్నిచోట్ల క్రాప్‌ హాలిడే సైతం ప్రకటిస్తున్నారు. సాగు సంక్షోభం వల్ల చాలామంది అన్నదాతలు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పట్టణాలు, నగరాలకు వలసవెళ్ళి అక్కడ దయనీయంగా జీవితాలు వెళ్ళదీస్తున్నారు. ఈ దుస్థితిని తప్పించాలంటే, పంటలకు సరైన మద్దతు ధర కల్పించాలి. దీనికోసం రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పాదయాత్రలు, ధర్నాలు చేస్తూ తమ డిమాండ్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. పాలకులు వాటిని ఆలకించాలి. కొన్ని పంటలకే ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడం వల్ల చాలామంది అన్యాయమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల ఉత్పత్తి వ్యయాలపై అధ్యయనాలు చేసి కనీస గిట్టుబాటు కల్పించాలి. 

ఎన్నో లాభాలు

వాస్తవ సాగు ఖర్చులు, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరలు ప్రకటించడం వల్ల ఇటు రైతుకు, అటు సమాజానికి ఎన్నో లాభాలు చేకూరతాయి. ముఖ్యంగా, దీనివల్ల అన్నదాతలు ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి, ఉత్పత్తిని పెంచుతారు. ఫలితంగా వారి ఆదాయాలు అధికమవుతాయి. ప్రస్తుతం దేశీయంగా పప్పుధాన్యాల సాగు తగ్గి, పెద్దమొత్తంలో విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దాంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరైన మద్దతు ధరలను ప్రకటించడం వల్ల ఇండియాలోనే పప్పుధాన్యాలకు సాగును పెంచవచ్చు. అప్పుడు విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నూనె గింజల విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించాలి. సరైన మద్దతు ధరలు రైతుల ఆదాయాలను పెంచి, సాగులో వారు నిలదొక్కుకోవడానికి తోడ్పడతాయి.


సరైన ప్రణాళికలతో...

సాధారణంగా పంటకోతల సమయంలో మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా పెరిగి ధరలు విపరీతంగా తగ్గుతాయి. ఉల్లి, టొమాటో తదితర కూరగాయల్లో దీన్ని ఎక్కువగా గమనిస్తాము. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దుస్థితిని నివారించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. దేశ ప్రజల అవసరాలు, ఎగుమతులకు సంబంధించి ముందుగానే సరైన అంచనాలు తయారు చేసి పకడ్బందీగా పంట ప్రణాళికలు రూపొందించాలి. దానికి అనుగుణంగా ఆయా పంటలు సాగు చేసేలా చూడాలి. దానివల్ల అధిక ఉత్పత్తి కారణంగా టొమాటోలు, ఇతర కూరగాయలను రోడ్లపై పారబోయాల్సిన దారుణ దురవస్థ తప్పుతుంది. ఆహార శుద్ధి విషయంలో రైతులను ప్రోత్సహిస్తే వారి ఆదాయాలు పెరుగుతాయి.

ఆచార్య కొండపల్లి పరమేశ్వరరావు
(ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.