PM Modi: మాస్కోకు మోదీ

ప్రధాని మోదీ ఎల్లుండి నుంచి రష్యాలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌పై మాస్కో దండెత్తిన తరవాత మోదీ అక్కడికి వెళ్తుండటం ఇదే తొలిసారి. అమెరికా ఆంక్షలను కాదని రష్యాతో భారత్‌ వాణిజ్యం నెరపుతోంది.

Published : 06 Jul 2024 01:06 IST

ప్రధాని మోదీ ఎల్లుండి నుంచి రష్యాలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌పై మాస్కో దండెత్తిన తరవాత మోదీ అక్కడికి వెళ్తుండటం ఇదే తొలిసారి. అమెరికా ఆంక్షలను కాదని రష్యాతో భారత్‌ వాణిజ్యం నెరపుతోంది. ఇండియాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే చైనాకు మాస్కో చేరువవుతోంది. ఇలాంటి తరుణంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

క్రెయిన్‌పైకి దండెత్తిన మాస్కోను ఏకాకిని చేసేందుకు అమెరికా ఆధ్వర్యంలో పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో రెండు రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల భేటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. అయిదేళ్ల తరవాత పుతిన్, మోదీ మరోసారి ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. మాస్కోపై పాశ్చాత్యదేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా, తన ప్రయోజనం కోసం రష్యాతో ఇండియా వాణిజ్యం నెరపుతోంది. మోదీ పర్యటనలో ఆర్థిక అంశాలే కాకుండా, వ్యూహాత్మక విషయాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.

దగ్గరి దారి

మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరవాత మోదీ కజక్‌స్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీఓ)కు వెళ్ళాల్సి ఉంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యేందుకు ఆయన ఆసక్తి చూపడంలేదు. గల్వాన్‌ ఘర్షణ తరవాత ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారలేదు. మరోవైపు, పుతిన్‌ చైనాకు చేరువవుతున్నారు. పుతిన్‌తో మోదీ భేటీలో చైనాతో పాటు వివిధ కీలక అంశాలపై చర్చలు జరగవచ్చు. రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌ పట్ల అమెరికా వైఖరి ఏమిటన్నది ప్రధాన అంశం. అమెరికా ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుంచి ఇండియా భారీగా చమురు కొనుగోలు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని భారత్‌పై ఎప్పుడూ ఒత్తిడి రాలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. వాస్తవానికి రష్యన్‌ చమురు లేకుంటే పశ్చిమ దేశాలు ఎంతమాత్రం మనలేవు. అందుకే, శుద్ధి చేసిన రష్యన్‌ చమురు పెద్దమొత్తంలో ఐరోపా దేశాలకు, అమెరికాకు తరలివెళ్ళింది. భారత్‌ మార్గంగా రష్యన్‌ చమురు అందుబాటులో లేకుండా ఉండి ఉంటే, ద్రవ్యోల్బణం ఎగబాకేది. ప్రపంచార్థికం ప్రమాదంలో పడేది. రష్యా చమురును ఇండియా రూపాయల్లో కొనుగోలు చేయడం వల్ల మన కరెన్సీ పెద్ద మొత్తంలో మాస్కో వద్ద పోగుపడింది. దాన్ని ఏదో ఒక విధంగా ఖర్చు చేయాల్సి ఉంది. మోదీ, పుతిన్‌ భేటీలో దీనిపై చర్చ జరగవచ్చు. గతంలో మన రూపాయలతో రష్యన్‌ సంస్థ రాస్‌నెఫ్ట్‌- ఇండియాలోని ఎస్సార్‌ చమురు శుద్ధి కేంద్రాన్ని కొనుగోలు చేసింది.

అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవా (ఐఎన్‌ఎస్‌టీసీ) నిర్మాణానికి మాస్కో భారీమొత్తంలో వెచ్చించింది. సూయజ్‌ కాలువతో పోలిస్తే సరకు రవాణాకు ఇది దగ్గరి దారి. ఇరాన్‌ మీదుగా ప్రయోగాత్మకంగా చేపట్టిన సరకు రవాణాలో ఐఎన్‌ఎస్‌టీసీ బాగా అక్కరకొస్తున్నట్లు తేలింది. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి ఇరాన్‌లోని అబ్బాస్‌ పోర్టుకు, అక్కడి నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సరకులను సాఫీగా తరలించడానికి ఈ నడవాలో ఖాళీలను పూరించాల్సి ఉంది. దీనిద్వారా తొలిసారి రష్యా గనుల నుంచి బొగ్గును భారత్‌కు రైలు ద్వారా తరలించనున్నారు. ఐఎన్‌ఎస్‌టీసీకి ఇండియా-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక నడవా (ఐమీక్‌) సైతం సమఉజ్జీగా నిలుస్తోంది. ఐరోపాకు ఇండియా చేరువ కావడానికి ఇదీ ఉపయోగపడుతుంది. ఈ నడవా పశ్చిమాసియా, ఇజ్రాయెల్, గ్రీస్‌ తదితరాల మీదుగా సాగుతుంది. సూయజ్‌ కాలువతో పోలిస్తే ఈ నడవా సైతం తక్కువ సమయంలోనే సరకు రవాణాకు తోడ్పడుతుంది. ఎర్ర సముద్రంలో హూతీల దాడుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగానూ అక్కరకొస్తుంది. ఈ రెండింటి పట్లా భారత్‌ సానుకూలంగా ఉంది.

డాలర్‌ ఆధిపత్యానికి గండికొట్టాలని...

రష్యా, పశ్చిమాసియా యుద్ధాలు ఇండియా విదేశీ విధానానికి సవాళ్లు విసరుతున్నాయి. రష్యా సైన్యంతో చేరి భారతీయులు ఉక్రెయిన్‌పై పోరాడుతున్న అంశమూ మోదీ పర్యటనలో చర్చకు రావచ్చు. అధిక జీతాలు, నివాస సదుపాయం లభిస్తున్నందువల్ల భారతీయులతో పాటు చాలామంది తమ సైన్యంలో చేరుతున్నట్లు రష్యన్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. బ్రిక్స్‌ దేశాలు ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే భేటీలో డాలర్‌ ప్రాబల్యాన్ని తగ్గించే అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అమెరికా, దాని మిత్రదేశాల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి డాలర్‌ ప్రాధాన్యానికి గండి కొట్టాలని రష్యా, చైనా బలంగా భావిస్తున్నాయి. ఇండియా మాత్రం దీనిపట్ల విముఖత ప్రదర్శిస్తోంది. బిక్స్‌ సదస్సుకు భారత ప్రధాని సైతం వెళ్ళవచ్చు. వీటన్నింటి నేపథ్యంలో మోదీ రష్యా పర్యటన ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం.

 సంజయ్‌ కపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.