New Criminal Laws: చిన్న నేరాలకు సమాజ సేవే శిక్ష

ఇటీవల కొత్తగా అమలులోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారికి సమాజ సేవను శిక్షగా విధించే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, సమాజ సేవ గురించి విస్తృతంగా నిర్వచించలేదు. కేంద్రం దీని గురించి పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఎలాంటి న్యాయ వ్యవస్థా లేని ప్రాచీన కాలంలో కన్నుకు కన్ను, పన్నుకు పన్నుగా ఎవరికి వారే నేరాలకు శిక్ష విధించేవారు.

Published : 07 Jul 2024 00:48 IST

ఇటీవల కొత్తగా అమలులోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారికి సమాజ సేవను శిక్షగా విధించే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, సమాజ సేవ గురించి విస్తృతంగా నిర్వచించలేదు. కేంద్రం దీని గురించి పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంది.

ఎలాంటి న్యాయ వ్యవస్థా లేని ప్రాచీన కాలంలో కన్నుకు కన్ను, పన్నుకు పన్నుగా ఎవరికి వారే నేరాలకు శిక్ష విధించేవారు. ఆ తరవాత రాజుల పాలనలో కొంతమేర విచారణలు జరిపి శిక్షలు విధించేవారు. చాలాసార్లు నేర తీవ్రతకు, శిక్షకు పొంతన ఉండేది కాదు. ఇండియాలో ఆధునిక న్యాయ వ్యవస్థ బ్రిటిష్‌ హయాములో వేళ్లూనుకుంది. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో  లార్డ్‌ మెకాలే ఆధ్వర్యంలో కూర్చిన భారత శిక్షాస్మృతి-1860ని ఆ తరవాత రెండేళ్లకు అమలులోకి తెచ్చారు. ఇది అనేక నేరాలను నిర్వచించి, వాటికి శిక్షలను నిర్దేశించింది. ఉద్దేశపూర్వకంగా చేయనివాటిని నేరాలుగా పరిగణించకూడదని, వాటికి ఎవరూ శిక్షార్హులు కారని ఈ శిక్షాస్మృతి చెబుతోంది. గత 162 ఏళ్లుగా అదే చిన్న చిన్న మార్పులు చేర్పులతో అమలులో ఉంది.

నూతన ఒరవడి

నేరాలు చేయడానికి ప్రజలు భయపడాలనే ఉద్దేశంతో శిక్షలు విధిస్తున్నారు. నేరస్తుణ్ని సంస్కరించి తిరిగి నాగరిక సమాజంలో మారిన మనిషిగా ప్రవేశ పెట్టడమే ఆధునిక సమాజంలో శిక్షల ఉద్దేశం. సంఘంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే హత్య, మోసం ఇతర ఏ నేరమైనా అది వ్యక్తిగతంగా కాకుండా, సభ్య సమాజానికి వ్యతిరేకంగా, లేదా శాసనం ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినట్లు భావిస్తారు. అందువల్ల న్యాయస్థానంలో నేరం నిరూపించి నేరస్తుడికి శిక్ష వేయించే బాధ్యత ప్రభుత్వానిదే. భారత శిక్షాస్మృతి-1860లోని సెక్షన్‌-53 మరణ శిక్ష, జీవిత ఖైదు, సాధారణ కారాగారం, కఠిన కారాగారం, జరిమానా అనే అయిదు శిక్షలను నిర్దేశించింది. హత్య, బలాత్కారం, రాజద్రోహం లాంటి హేయ నేరాలకు మరణ శిక్ష, కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు విధించవచ్చు. సాధారణ జైలు శిక్షలో నేరస్తుణ్ని కారాగారంలో నిర్బంధిస్తారు. కఠిన కారాగార శిక్షలో కఠినమైన శ్రమ చేయవలసి ఉంటుంది.  చిన్న నేరాలకు జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. మొన్న జులై ఒకటి నుంచి భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చింది. ఇందులో సెక్షన్‌-4లో పైన చెప్పిన అయిదు శిక్షలతో పాటు సంఘ సేవనూ చేర్చారు. అయితే, సమాజ సేవ అంటే ఏమిటో ఇందులో నిర్వచించలేదు. ఏ విధమైన జీత భత్యాలు లేకుండా సమాజ హితం కోసం పనిచేయడాన్ని న్యాయస్థానం ఒక శిక్షగా నిర్ణయించవచ్చునని జులై ఒకటిన అమలులోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్‌-23 సంఘసేవను నిర్వచించింది.

సంఘ సేవను శిక్షగా పరిగణించడం కొంచెం అసమంజసంగా తోస్తోంది. అయితే, న్యాయస్థానాలు సంప్రదాయంగా విధిస్తున్న శిక్షలను పరిశీలిస్తే ఇది ఒక కొత్త ఒరవడే. సాధారణంగా మొదటిసారి నేరం చేసినప్పుడు, అది చిన్నదైతే నేరస్తుడిని జైల్లో పెట్టి శిక్షించాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు సంఘసేవను శిక్షగా విధిస్తుంటారు. ఈ విధానం ఎప్పటినుంచో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉంది. నేరస్తుడు సంఘసేవ ద్వారా కొంత మానసిక సాంత్వన, పశ్చాత్తాపం పొందుతాడన్నది ఈ శిక్ష ఉద్దేశం. మన శిక్షాస్మృతిలో ఇలాంటి వాటిని చట్టబద్ధం చేయకున్నా- కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, మొక్కలు నాటడం, ఆస్పత్రుల్లో పనిచేయడం వంటి సామాజిక సేవకు సంబంధించిన శిక్షల్ని న్యాయస్థానాలు విధించాయి. జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని సెక్షన్‌-18 ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బాలలు సంఘ సేవ చేయాలని ఆదేశించే అధికారం జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుకు ఉంటుంది.

జరిమానాలకు బదులుగా...

నూతన చట్టం ఆరు నేరాలకే సంఘ సేవను శిక్షగా పేర్కొంది. ప్రభుత్వ సేవకుడు ఇతర వ్యాపారం చేసినప్పుడు, క్రిమినల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం న్యాయస్థానంలో హాజరు కానప్పుడు, ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా నిలువరించినప్పుడు, అయిదు వేల రూపాయలకు మించని వస్తువును మొదటి సారి దొంగిలించినప్పుడు, మద్యం సేవించి బహిరంగ స్థలంలో గొడవకు దిగినప్పుడు, పరువుకు భంగం కలిగిస్తే సమాజ సేవ చేయాలని కోర్టు ఆదేశించవచ్చు. అయితే, ఈ సంఘ సేవ ఎంతకాలం చేయాలో, దాని విధివిధానాలేమిటో చెప్పలేదు. పార్లమెంటు నూతన చట్టాలను సమీక్షించి చట్ట సవరణ ద్వారా సంఘసేవ విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆరు నేరాలకే పరిమితం కాకుండా, జరిమానా మాత్రమే విధించవచ్చని నిర్దేశించిన వాటికి జరిమానాతో పాటు లేదా దానికి బదులుగా సంఘ సేవను న్యాయస్థానాలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలి.

హరీశ్‌ కొలిచాల
(న్యాయ నిపుణులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.