Eectric vehicles: ఈవీలు జోరందుకునే వీలు

అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్‌ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్‌లో తగినన్ని ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది.

Updated : 21 Jun 2024 12:36 IST

అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్‌ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్‌లో తగినన్ని ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది.

భారత్‌లో వాహనాల వినియోగం అంతకంతకు పెరుగుతోంది. వస్తు, ప్రజా రవాణా అవసరాలు అధికమవుతుండటంతో అన్ని రకాల వాహనాలకూ డిమాండ్‌ ఎగబాకుతోంది. అయితే వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ వినియోగంవల్ల నగరాలు, పట్టణాల్లో కాలుష్యం తీవ్రస్థాయుల్లో ఉంటోంది. వాహన ఉద్గారాలవల్ల గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండటంతో ప్రజలను అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు భారత్‌ పెట్రోల్, డీజిల్‌ దిగుమతుల కోసం అనేక దేశాలపై ఆధారపడటమే కాకుండా, పెద్దమొత్తంలో విదేశ మారక ద్రవ్యాన్ని కోల్పోవాల్సి వస్తోంది. వీటన్నింటికీ విద్యుత్‌ వాహనాలు (ఈవీ) చక్కని పరిష్కారాలు చూపగలవన్న ఆశలు రేకెత్తుతున్నాయి.

ప్రయోజనాలెన్నో...

పెట్రోల్, డీజిల్‌ నుంచి కార్లు కేవలం 17-21శాతం శక్తినే గ్రహిస్తాయి. అంటే, 80శాతం మేర ఇంధనం వృథా అవుతుందన్న మాట. అదే ఈవీలైతే గ్రిడ్‌ నుంచి వచ్చే విద్యుత్తులో 60శాతం వరకు ఉపయోగించుకుంటాయి. బ్యాటరీతో నడుస్తాయి కాబట్టి వీటి నుంచి పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. పైగా నిర్వహణ వ్యయం తక్కువ. పెట్రోల్, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే వీటికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, రహదారి పన్నుల్లో రాయితీ లభిస్తుంది. ఎలెక్ట్రానిక్‌ వాహనాలవల్ల ఎటువంటి శబ్ద కాలుష్యం ఉండదు. రహదారులపై వీటి సంఖ్య పెరిగితే దేశంపై చమురు దిగుమతుల భారం గణనీయంగా తగ్గిపోతుంది. ఆ మేరకు విదేశ మారకద్రవ్య నిల్వలు ఆదా అవుతాయి. అందుకనే, కేంద్ర ప్రభుత్వం ఎలెక్ట్రానిక్‌ వాహనాల తయారీ కేంద్రంగా భారత్‌ను అవతరింపజేసేందుకు ‘నూతన ఈవీ పాలసీ’ని తీసుకువచ్చింది. ప్రపంచంలో పేరెన్నికగన్న ఈవీ ఉత్పత్తిదారులతో పాటు భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా దీనికి రూపకల్పన చేశారు. తద్వారా అత్యాధునిక ఈవీ సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, పెద్దయెత్తున ఉత్పత్తి చేపట్టడం ద్వారా తక్కువ ధరకే ఎలెక్ట్రానిక్‌ వాహనాలను మార్కెట్లలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

కొంతకాలంగా మన దేశంలో విద్యుత్‌ బ్యాటరీలతో నడిచే రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలతో పాటు బస్సులు కూడా విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. 2018లో దేశంలోని మొత్తం వాహనాల్లో ఈవీలు 0.5శాతమే (సుమారు 1,30,000) ఉండేవి. ఆ తరవాత కేంద్రం తీసుకొచ్చిన హైబ్రిడ్, ఎలెక్ట్రిక్‌ వాహనాల సత్వర తయారీ (ఫేమ్‌-2) విధానం వల్ల 2021లో వాటి సంఖ్య అమాంతం 10.22 లక్షలకు ఎగబాకింది. ఆ మరుసటి ఏడాది సుమారు 14 లక్షలకు చేరింది. మొత్తం వాహనాల్లో అది 8.3శాతం. ఎలెక్ట్రానిక్‌ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ, అనేక ఇబ్బందులు వారిని డోలాయమాన స్థితిలోకి నెట్టేస్తున్నాయి. సాధారణ వాహనాలతో పోలిస్తే వీటి ధరలు కొంత అధికంగానే ఉంటున్నాయి. ఎలెక్ట్రిక్‌ వాహనాల నుంచి మంటలు చెలరేగడం, ఉన్నఫళంగా బ్యాటరీలు క్షీణించి వాహనాలు ఆగిపోవడం, మార్గమధ్యంలో తగినన్ని ఛార్జింగ్‌ కేంద్రాలు లేకపోవడం వంటివి కొనుగోలుదారులను ఆలోచింపజేస్తున్నాయి. కాబట్టి, తక్కువ ధరకే అత్యంత భద్రమైన బ్యాటరీల తయారీని చేపట్టడంతోపాటు తగినన్ని ఛార్జింగ్‌ కేంద్రాలను నెలకొల్పడం ముఖ్యం.

తోడ్పాటే కీలకం...

ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లలో వాహనదారులు తమవంతు వచ్చేంతవరకు నిరీక్షించాల్సి వస్తోంది. పైగా ఛార్జింగ్‌ పూర్తికావడానికి అధిక సమయం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం బ్యాటరీ మార్పిడి విధానం తీసుకువచ్చింది. దీనివల్ల వంట గ్యాస్‌ బండల మాదిరిగా వాహనదారులు డిశ్ఛార్జి అయిన బ్యాటరీని ఇచ్చి పూర్తిస్థాయిలో ఛార్జ్‌ అయిన బ్యాటరీలను తీసుకోవచ్చు. తద్వారా నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ప్రయాణం కొనసాగించవచ్చు. దేశంలో 40లక్షల జనాభా దాటిన అన్ని మెట్రోపాలిటన్‌ నగరాల్లోనూ ఈ బ్యాటరీ మార్పిడి స్టేషన్లను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించింది. వీటిని శీఘ్రగతిన దేశవ్యాప్తంగా విస్తరించాలి. వేగవంతమైన ఛార్జింగ్‌ సాంకేతికతల కోసం పరిశోధన-అభివృద్ధిని జోరెత్తించాలి. ఆ దిశగా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలి. పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో పాటు రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సైతం ఎలెక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడం అత్యావశ్యకం. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌- కొత్తగా నిర్మించే భవనాలకు ఈవీ ఛార్జింగ్‌ సదుపాయం ఉంటేనే అనుమతులు మంజూరు చేయాలని యోచిస్తోంది. నగరవ్యాప్తంగా 81 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. పెద్ద సంఖ్యలో వాహన ప్రేమికులున్న తెలుగు రాష్ట్రాలకూ అటువంటి స్ఫూర్తి ఎంతో అవసరం!

టి.రఘు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.