Honey Trap: వలపు వలకు చిక్కి ఇక్కట్లు

గతంలో అమెరికా, సోవియట్‌ కూటములు ఒకరి ఏజంట్లను మరొకరు లోబరచుకోవడానికి అందమైన స్త్రీలను ప్రయోగించేవి. అదే నాటి జేమ్స్‌బాండ్‌ చిత్రాలకు ప్రేరణ. ఇప్పుడు కాలం మారింది. భౌతిక ప్రపంచంలో జరిగేవి డిజిటల్‌ సీమకు మారాయి.

Published : 08 Jul 2024 01:22 IST

గతంలో అమెరికా, సోవియట్‌ కూటములు ఒకరి ఏజంట్లను మరొకరు లోబరచుకోవడానికి అందమైన స్త్రీలను ప్రయోగించేవి. అదే నాటి జేమ్స్‌బాండ్‌ చిత్రాలకు ప్రేరణ. ఇప్పుడు కాలం మారింది. భౌతిక ప్రపంచంలో జరిగేవి డిజిటల్‌ సీమకు మారాయి. పాకిస్థానీ గూఢచారుల వలపు వలలో చిక్కి రక్షణ రహస్యాలను బయటపెడుతూ దేశద్రోహానికి పాల్పడుతున్న భారతీయుల ఉదంతాలు తరచూ వార్తలకు ఎక్కుతున్నాయి. 

భారతీయ రక్షణ పరిశోధన సంస్థలు, ఆయుధోత్పత్తి కర్మాగారాలలో పనిచేసే శాస్త్రవేత్తలను, సైన్యాధికారులను వలపు వలలతో పాకిస్థాన్‌ లోబరచుకున్న సందర్భాలు అనేకం. బ్రహ్మోస్‌ క్షిపణి రహస్యాలను లీక్‌ చేసి 2018లో అరెస్టయిన ఇంజినీర్‌ నిశాంత్‌ అగర్వాల్‌కు ఇటీవల నాగ్‌పుర్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం వలపు వల ఉదంతాలకు నిదర్శనం. బ్రహ్మోస్‌ క్షిపణుల కూర్పు విభాగంలో పనిచేసే అగర్వాల్‌ ప్రతిభా పురస్కారం పొందిన శాస్త్రవేత్త. పాకిస్థాన్‌ నుంచి సెజల్‌ అనే మహిళా నామంతో నడుపుతున్న ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పాకిస్థానీ ఏజెంట్లు అగర్వాల్‌ను లోబరచుకున్నారు. బ్రిటన్‌కు చెందిన హేస్‌ ఏవియేషన్‌ సంస్థలో పని చేస్తున్నానని, అగర్వాల్‌ను రిక్రూట్‌ చేసుకోవడానికి సుముఖంగా ఉన్నానని సెజల్‌ ప్రలోభపెట్టింది. 2017లో సెజల్‌ పంపిన లింకులపై క్లిక్‌ చేయడం ద్వారా అగర్వాల్‌ తన ల్యాప్‌టాప్‌లో మూడు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అవి- క్యూ విస్పర్, చాట్‌ టు హైర్, ఎక్స్‌ ట్రస్ట్‌. ఈ మూడు యాప్‌లూ నిజానికి మాల్‌వేర్‌లు. అవి అగర్వాల్‌ ల్యాప్‌టాప్‌లో భద్రపరచిన బ్రహ్మోస్‌ క్షిపణుల సమాచారాన్ని సంగ్రహించి పాక్‌కు చేరవేశాయి. 

మాయలో పడి... దేశద్రోహం

హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)తో కలిసి డ్రోన్ల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఓ గుజరాతీ సంస్థ అధికారి ప్రవీణ్‌ మిశ్రాను ఈ ఏడాది మే నెలలో పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్‌లోని ఐబీఎంలో పని చేస్తున్నానంటూ సోనాల్‌ గర్గ్‌ పేరుతో ఓ పాక్‌ గూఢచారిణి మిశ్రాతో స్నేహం చేశారు. అతడి నుంచి భారతీయ డ్రోన్‌ రహస్యాలను లాగేశారు. ఇదే విధంగా పాక్‌ గూఢచారిణుల మాయలో పడిన ప్రదీప్‌ కురుల్కర్‌ అనే శాస్త్రవేత్తను 2023 జులైలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కురుల్కర్‌ సాధారణ అధికారి కాదు- అగ్ని క్షిపణుల పరిశోధనలో నిమగ్నమైన డీఆర్డీఓ ఇంజినీర్స్‌ ప్రయోగశాల అధిపతి. జారాదాస్‌ గుప్తా పేరుతో పరిచయమైన ఓ పాక్‌ గూఢచారిణి ఈ-మెయిల్, వీడియో కాల్స్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంపిన నగ్న చిత్రాలు, సెక్స్‌ సందేశాలకు పడిపోయిన కురుల్కర్‌ రహస్య సమాచారాన్ని ఆమెకు అందించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన పేద సైన్స్‌ విద్యార్థినంటూ పరిచయం చేసుకున్న ఓ పాక్‌ గూఢచారిణి ఒడిశాలో భారత క్షిపణి పరీక్షల సమాచారాన్ని ఓ డీఆర్డీఓ అధికారి నుంచి సంగ్రహించారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఓలో ఒప్పందం ప్రాతిపదికన పనిచేస్తూ పాక్‌ ఐఎస్‌ఐకి రహస్య సమాచారం అందించిన దుక్కా మల్లికార్జునరెడ్డిని 2022 జూన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నటాషారావు పేరుతో ఓ పాక్‌ ఏజెంటు 2020 మార్చిలో ఫేస్‌బుక్‌ ద్వారా మల్లికార్జునరెడ్డికి పరిచయమయ్యారు. అతడిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అవసరమైన సమాచారమంతా లాగేసి మల్లికార్జునతో మాట్లాడటం మానేశారు. ఫేస్‌బుక్‌లో తన పేరును సిమ్రన్‌ ఛోప్‌డాగా మార్చేసుకున్నారు. 2020లోనే భారతీయ ఫైటర్‌ జెట్‌ విమాన రహస్యాలను ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ పాక్‌ మోహినికి అందించారంటూ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌  అధికారి దీపక్‌ శిర్సత్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళాలకు చెందిన పలువురు సిబ్బంది సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన మోసకారుల వలలో చిక్కి రక్షణ రహస్యాలను బయటపెట్టారు. ఇలాంటి వారంతా నిజానికి యువతులు కూడా కాకపోవచ్చు. ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాల మాటున దాగిన పురుష పాక్‌ గూఢచారులై కూడా ఉండవచ్చు. వీరు వేరే వనితల నగ్నచిత్రాలను, వీడియోలను చూపి రహస్యాలను కూపీ లాగుతున్నారు. 

కృత్రిమ మేధ సాయం

ఇలాంటి నకిలీ ప్రేమాయణాలను ముందుగానే పసిగట్టి నిరోధించడానికి భారత సైన్యం కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానాన్ని  నియోగించదలచింది. సైనికులు, అధికారులతో ప్రేమ ముచ్చట్లు నడిపి వారు వలపు వలలకు ఎర అవుతారో లేదో ముందే పసిగట్టడానికి ఒక ఏఐ చాట్‌బాట్‌ను రూపొందిస్తోంది. త్వరలోనే రంగప్రవేశం చేయనున్న ఏఐ చాట్‌బాట్‌ వాట్సాప్‌ ద్వారా పని చేస్తుంది. క్రమంగా ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిస్తుంది. తన దళంలోని సైనికుల్లో ఎవరు మాయా మోహినులకు లోబడతారో పసిగట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా అత్యధిక సైనికులు, అధికారులు... అజ్ఞాత సందేశాలకు స్పందించరు. ఎవరో కొద్దిమంది బలహీన మనస్కులే కిలేడీల మాయలో పడతారు. ఇలాంటి ముప్పు విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే!

కైజర్‌ అడపా 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.