UK elections: ‘లేబర్‌’దే బ్రిటన్‌ పీఠం

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) తాజా సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. గతంతో పోలిస్తే తక్కువ ఓటు షేరుతోనే గణనీయమైన స్థానాలను లేబర్‌ పార్టీ రాబట్టింది.

Published : 10 Jul 2024 01:04 IST

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) తాజా సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. గతంతో పోలిస్తే తక్కువ ఓటు షేరుతోనే గణనీయమైన స్థానాలను లేబర్‌ పార్టీ రాబట్టింది. కన్జర్వేటివ్‌ పార్టీ  భారీ ఓటమిని మూటగట్టుకొంది. ఓటర్ల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పునకు ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తాజా ఎన్నికల్లో దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని మొత్తం 650 సీట్లలో కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఏకంగా 411 స్థానాలను గెలుచుకొంది. పద్నాలుగేళ్ల తరవాత లేబర్‌ పార్టీ మళ్ళీ బ్రిటన్‌ అధికార పగ్గాలు అందుకొంది. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తన తొలి ప్రసంగంలో దేశ పునర్నిర్మాణానికి, రాజకీయాలను ప్రజాసేవ బాట పట్టించడానికి కృషి చేస్తానని స్టార్మర్‌ హామీ ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఓట్ల వాటా దాదాపు 32శాతం. మొన్నటి ఎలెక్షన్లలో ఆ పార్టీ ఓటు షేరు కొద్దిగా పెరిగి 33.8శాతానికి చేరింది. అయినా, పార్లమెంటులో 63శాతం సీట్లను ఆ పక్షం ఒడిసిపట్టింది.

సహకారానికి హామీ

కన్జర్వేటివ్‌ పార్టీ ఓటు షేరు 2019లో 43శాతం నుంచి మొన్నటి ఎన్నికల్లో 23.7శాతానికి పడిపోయింది. ఆ పార్టీ 121 సీట్లనే సాధించింది. గతంతో పోలిస్తే 244 స్థానాలు కోల్పోయింది. కన్జర్వేటివ్‌ పార్టీ పూర్వ ప్రధాని లిజ్‌ ట్రస్, రక్షణ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌లతో పాటు చాలామంది మంత్రులు పరాజయం పాలయ్యారు. పార్టీలో అంతర్గత పోరే తాజా ఓటమికి ప్రధాన కారణమని కన్జర్వేటివ్‌ పార్టీలో చాలామంది విమర్శిస్తున్నారు. అక్రమ వలసలు, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను సమర్థంగా పరిష్కరించలేకపోవడం వల్ల ఓటర్లు పార్టీకి దూరమయ్యారని చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పక్షం ఓటర్లు చాలామంది ‘రిఫామ్‌ యూకే’ పార్టీ వైపు మళ్ళారు. పన్నులు తగ్గిస్తామని, అక్రమ వలసలు నిరోధిస్తామని, ముఖ్యంగా బ్రిటిష్‌ సంస్కృతి, గుర్తింపు, విలువల కోసం పాటుపడతామని ఈ పార్టీ హామీ ఇచ్చింది. అయితే, రిఫామ్‌ యూకే పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం అయిదు సీట్లే సాధించినా, 14.3శాతం ఓట్లు సంపాదించింది. 103 చోట్ల అది రెండో స్థానంలో నిలిచింది. రిఫామ్‌ యూకే పార్టీ బలపడటం ఐరోపా దేశాల్లో వలసలు తదితరాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి అద్దం పడుతోంది. ఈ క్రమంలోనే ఐరోపాలో చాలామంది ఓటర్లు తీవ్ర ఉదారవాద పార్టీల వైపు మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతోంది. యూకే పార్లమెంటులో 72 సీట్లతో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ మూడో అతి పెద్ద పక్షంగా అవతరించింది. 2019లో ఆ పార్టీ 11.5శాతం ఓట్లతో 11 సీట్లే సాధించింది. మొన్నటి ఎలెక్షన్లలో ఓటు షేరు స్వల్పంగా 12.2శాతానికి పెరిగింది. కానీ, 72 స్థానాల్లో విజయం సాధించింది. ఐరోపా అంతటా ఉదారవాద పార్టీలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. యూకే ఎన్నికల ఫలితాలు సైతం అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. తాజా యూకే ఎన్నికల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు 28 మంది గెలుపొందారు. యూకే పార్లమెంటులో భారతీయ మూలాలున్న సభ్యుల సంఖ్య పెరిగినంత మాత్రాన బ్రిటన్‌-ఇండియా సంబంధాలు బలపడతాయని అనుకోవడానికి వీల్లేదు. వారు బ్రిటిష్‌ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. 

జెరెమి కార్బిన్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ 2019లో కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ జోక్యానికి పిలుపిచ్చింది. భారత్‌కు అది తీవ్ర ఆగ్రహం కలిగించింది. లేబర్‌ పార్టీ పగ్గాలు కీర్‌ స్టార్మర్‌ చేతికొచ్చాక ఇండియాలో ఎలాంటి రాజ్యాంగబద్ధ వివాదాలైనా ఆ దేశ పార్లమెంటుకు సంబంధించిన వ్యవహారాలని ఆయన తేల్చి చెప్పారు. కశ్మీర్‌ అంశం భారత్‌-పాకిస్థాన్‌లు శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన ద్వైపాక్షిక అంశమని స్టార్మర్‌ వ్యాఖ్యానించారు. ఇండియాతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంతో పాటు, సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకుంటామని, భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పుల విషయంలో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని లేబర్‌ పార్టీ మ్యానిఫెస్టో హామీ ఇచ్చింది. ఐరోపా సమాఖ్య నుంచి బయటకు వచ్చిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు భారతీయ విపణిలోకి ప్రవేశం పొందడం తప్పనిసరి అవసరం. విద్య, రక్షణ భాగస్వామ్యాలకు సంబంధించి ఇరు దేశాలు చర్చలు జరిపాయి.

దామాషా ప్రాతినిధ్య విధానం కోసం...

చాలా దేశాల్లో మాదిరిగానే పలు పార్టీలకు గణనీయమైన ఓటు షేరు లభించినా, అరకొర సీట్లతో సరిపెట్టుకోవడం యూకే ఎన్నికల్లోనూ కనిపించింది. ఈ క్రమంలో దామాషా ప్రాతినిధ్య వ్యవస్థపై యూకేలో మరోసారి చర్చ మొదలైంది. యూకే ఎన్నికల్లో చిన్న పార్టీలు 40శాతం ఓట్లు రాబట్టినా, 17 సీట్లకే పరిమితమయ్యాయి. అందుకే రిఫామ్‌ యూకే, గ్రీన్‌ పార్టీల నేతలు న్యాయబద్ధమైన ఎన్నికల వ్యవస్థ కోసం డిమాండు చేస్తున్నారు. ఓట్ల వాటాను బట్టి పార్లమెంటులో సీట్లను కేటాయించేలా దామాషా ప్రాతినిధ్య విధానానికి మారాలని చాలా ఏళ్లుగా మితవాద డెమోక్రాట్లు కోరుతున్నారు. దీనిపై 2011లో ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరిపారు. చాలామంది ప్రస్తుత విధానానికే మద్దతు తెలిపారు. దామాషా ప్రాతినిధ్య విధానం సమాజంలో విభజనలను పెంచుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, తాజా ఎన్నికలను పరికిస్తే యూకేలో రాజకీయ మార్పు పవనాలు స్పష్టంగా కనిపించాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలకు యూకేలో ప్రజల నిర్ణయాత్మక తీర్పు, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామం.


మిశ్రమ ఫలితాలు

యూకే ఎన్నికల్లో ప్రాంతీయ స్థాయి ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. స్వతంత్ర స్కాట్లాండ్‌ కోసం పిలుపిస్తూ యూకే ఉత్తర ప్రాంతంలో పోటీ చేసిన స్కాటిష్‌ జాతీయ పార్టీ (ఎస్‌ఎన్‌పీ) తొమ్మిది చోట్ల విజయం నమోదు చేసింది. 2019తో పోలిస్తే ఎస్‌ఎన్‌పీ దాదాపు 39 చోట్ల ఓడిపోయింది. ప్రస్తుతానికి ఆ పార్టీ అజెండా తెరమరుగైనా, 2026లో స్కాటిష్‌ పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో స్వతంత్ర స్కాట్‌లాండ్‌ అంశాన్ని మరోసారి తెరమీదకు తెస్తుంది. స్కాట్లాండ్‌లో లేబర్‌ పార్టీ 2019లో ఒక్క సీటే గెలిచింది. ఈ సారి 37 చోట్ల పాగా వేసింది. వేల్స్‌ ప్రాంతంలో కన్జర్వేటివ్‌ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఉత్తర ఐర్లాండ్‌లో షిన్‌ ఫెయిన్‌ పార్టీ ఏడు చోట్ల, డెమోక్రటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ అయిదు చోట్ల విజయం సాధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.