vegetable rates: కొనగలమా... తినగలమా?

దేశంలో కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. గతేడాది కరవు పరిస్థితులు, ఏప్రిల్‌ నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, రిజర్వాయర్లలో తగ్గిన నీటి నిల్వల కారణంగా వేసవి పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడిందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది.

Published : 24 Jun 2024 00:55 IST

దేశంలో కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. గతేడాది కరవు పరిస్థితులు, ఏప్రిల్‌ నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, రిజర్వాయర్లలో తగ్గిన నీటి నిల్వల కారణంగా వేసవి పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడిందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ప్రపంచ ఆహారోత్పత్తుల ధరలూ పెరుగుతున్నాయి.

దేశంలో ఏటా వానాకాలం ప్రారంభం నుంచి ఆగస్టు వరకు కూరగాయలు, ఉల్లి ధరలు పెరగడం ఆనవాయితీగా మారింది. గతేడాది (2023) జూన్, జులై నెలల్లో టొమోటోల కిలో ధర అత్యధికంగా రూ.300కి చేరింది. ఆ తరవాత ఉల్లిగడ్డల ధరలు అదరగొట్టాయి. 2023-24లో దేశంలో ఉల్లిగడ్డ 15శాతం, ఆలుగడ్డలు రెండు శాతం దిగుబడి తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో ప్రకటించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023-24లో దేశంలో కూరగాయల దిగుబడి 37 లక్షల టన్నుల వరకూ తగ్గింది. వర్షాభావ పరిస్థితులు పంట దిగుబడులను దెబ్బతీస్తున్నాయి. కూరగాయల ధరలు అందుబాటులో లేకపోవడంతో సామాన్యులకు పోషకాహారం దక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి.

దక్కని ప్రోత్సాహం

మన దేశంలో ప్రభుత్వాలు వరి, గోధుమలకు ఇస్తున్నంత ప్రోత్సాహం కూరగాయ పంటలకు ఇవ్వడం లేదు. 2020-21తో పోలిస్తే 2022-23లో ఉల్లిగడ్డ పంట సాగు విస్తీర్ణం అయిదు లక్షల ఎకరాలు, దిగుబడి 14 లక్షల టన్నులు తగ్గినట్లు కేంద్ర ఉద్యానశాఖ నివేదిక తెలిపింది. కూరగాయల సాగు, దిగుబడి తగ్గితే మార్కెట్లలో చిల్లర ధరలు పెరిగిపోయి సామాన్యులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నా, ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ధరలు ఏటా జూన్, జులైలో మండుతున్నా వాటిని స్థిరీకరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలే ఉండటం లేదు. మనదేశంలో పండే ఉల్లిగడ్డలు, ఇతర కూరగాయలకు పలు దేశాల్లో భారీ డిమాండు ఉంది. ఎగుమతులు పెరిగితే రైతులకు ఆదాయమూ ఇనుమడిస్తుంది. ఉల్లిగడ్డల ధరల్లో తరచూ హెచ్చుతగ్గులపై క్రిసిల్‌ సంస్థ అధ్యయనం చేసింది. రబీ సీజన్‌లోనే అత్యధికంగా 70శాతం వరకూ పంటను మార్కెట్లకు తెస్తున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య మార్కెట్లకు ఈ పంట పెద్దగా రావడం లేదని అధ్యయనంలో తేలింది. వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య రైతులు సాగుచేసే పంట సక్రమంగా పండితే అక్టోబరు నుంచి డిసెంబరు దాకా మార్కెట్లలో ధరలను నియంత్రించడమే కాకుండా విదేశాలకు పెద్దయెత్తున ఎగుమతులు చేయవచ్చు.

అనువైన వాతావరణం

ప్రజారోగ్యాన్ని కాపాడాలంటే తాజా కూరగాయలు, పండ్లు తక్కువ ధరల్లో ప్రజలకు లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దేశంలో కూరగాయల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగితే ప్రజలకు ఆహార, దేశానికి ఆర్థిక భద్రత సాధ్యమని గుర్తించాలి. దేశప్రజలకు అవసరమైన అన్నిరకాల కూరగాయలు ఏడాది పొడవునా లభించడం లేదు. ప్రతి మనిషి పోషకాహారం కోసం రోజుకు 400 గ్రాముల కూరగాయలు తినాలని వైద్యుల సూచన. ప్రజలందరూ ఈ స్థాయిలో రోజూ తినాలంటే సగానికి సగం కొరత నెలకొంది. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, టొమోటోలు పండినంతగా ఇతర పంటలు పండటం లేదు. వాస్తవానికి వందరకాలకు పైగా కూరగాయలు పండించడానికి అనువైన భూములు, వాతావరణం, వనరులు మనదేశంలో పుష్కలంగా ఉన్నాయి. సాగు, దిగుబడులు, ఎగుమతులు పెరిగితే రైతులకు నికర ఆదాయం రెట్టింపు అవుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. నగరాలు, పట్టణాల చుట్టూ స్థిరాస్తి వెంచర్ల కారణంగా కూరగాయలు, పండ్లు కావాలంటే వందల కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆలుగడ్డలు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి, ఉల్లిగడ్డలు మహారాష్ట్ర నుంచి, మునగకాయలు తమిళనాడు నుంచి, ఇతర రకాలు ఇంకా పలు రాష్ట్రాల నుంచి నిత్యం వందల లారీల్లో వస్తున్నాయి. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి రావడం వల్ల పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినప్పుడల్లా రవాణా వ్యయం భారం భారీగా పడుతూ చిల్లర మార్కెట్లలో కూరగాయలు, పండ్ల ధరలు సామాన్యుల జేబులు కొల్లగొడుతున్నాయి. బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌ లాంటి వెనకబడిన రాష్ట్రాల రైతులు కూరగాయలు పండించి దిల్లీ సహా పలు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం పంపుతూ ఆదాయం పొందుతున్నారు. ఏపీ, తెలంగాణలో కూరగాయలు, పండ్లు వంటి ఉద్యాన పంటల సాగుకు అనువైన వాతావరణం, భూములు ఉన్నందు వల్ల రైతులను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

మంగమూరి శ్రీనివాస్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.