Visakha Steel: విశాఖ ఉక్కు నిలదొక్కుకుంటుందా?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై కొన్నేళ్లుగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘సెయిల్‌’లో దాన్ని విలీనం చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి నేడు ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో విశాఖపట్నంలో చర్చలు జరపనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated : 11 Jul 2024 07:58 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై కొన్నేళ్లుగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘సెయిల్‌’లో దాన్ని విలీనం చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి నేడు ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో విశాఖపట్నంలో చర్చలు జరపనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

స్వాతంత్య్రానంతరం భారతదేశ అవసరాలకు సరిపడా ఉక్కును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌)ను స్థాపించింది. రావుర్కెలా, భిలాయీ, బొకారో, బర్నపుర్, దుర్గాపుర్‌లలో ఉక్కు కర్మాగారాలను విదేశీ పరిజ్ఞానంతో స్థాపించారు. ఆ తరవాత దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కర్ణాటకలోని భద్రావతి, తమిళనాడులోని సేలంలో మూడు కర్మాగారాలు ప్రతిపాదించారు. విశాఖ నుంచి ఉక్కు కర్మాగారాన్ని ఒడిశాకు మార్చాలని చూసినప్పుడు సమైక్యాంధ్రలో ప్రజలు ఉద్యమించారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి 32 మంది ప్రాణత్యాగాలతో కర్మాగారాన్ని సాధించుకున్నారు. 64 గ్రామాల ప్రజలు 22వేల ఎకరాలను విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇచ్చారు. అనేక బాలారిష్టాల తరవాత 2002 నుంచి స్టీలు ప్లాంటు లాభాల బాట పట్టింది. 2005-06లో కర్మాగారం సామర్థ్యాన్ని ముప్ఫై లక్షల టన్నుల నుంచి 73 లక్షల టన్నులకు విస్తరించారు. రాబోయే రోజుల్లో మరింత విస్తరణకు అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో దీన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయంతో కష్టాలు మొదలయ్యాయి.

సెయిల్‌లో విలీనం చేస్తేనే...

ఏపీ గత సీఎం జగన్‌ విశాఖ ఉక్కు ఊపిరి తీశారు. 22 మంది ఎంపీలు ఉన్నా కేంద్రంపై ఏనాడూ ఆయన ఒత్తిడి తేలేదు. స్టీలు ప్లాంటుకు అవసరమైన ఇనుప ఖనిజం అరకొరగా సరఫరా అవుతుంటే ఉక్కు పార్లమెంటరీ కమిటీలో ఇద్దరు వైకాపా ఎంపీలు ఉండీ పరిష్కారానికి యత్నించలేదు. పైగా, ఎన్నికల సమయంలో ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. రెండు వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసి ప్రతి నెలా రూ.500 కోట్ల విలువైన ఉక్కును ప్రభుత్వ పథకాలకు తీసుకెళ్ళాలని అభ్యర్థించినా పట్టించుకోలేదు. విశాఖ కర్మాగారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 58 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సాధించి, రూ.940 కోట్ల లాభాలు ఆర్జించింది. 2022 నుంచి ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ఆపేయడంతో ఏటా ఇరవై లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి కోల్పోయింది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి నష్టాలు అధికమయ్యాయి. పదోన్నతులు ఆపేయడంతో కీలక నిర్ణయాలు తీసుకునే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఉక్కు కర్మాగారం నిర్వహణ కోసం ఆస్తులు అమ్మకానికి పెడుతున్నారు.

ఉక్కు ఉత్పత్తిలో 2000లో చైనా రెండంకెల స్థాయిలోనే ఉండేది. ప్రస్తుతం అది ఏటా 115 కోట్ల టన్నులకు చేరింది. ఉక్కు ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్నామని చెప్పుకొంటున్న భారత్‌ 16 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి మాత్రమే సాధిస్తోంది. 2030 నాటికి 30 కోట్ల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగా సెయిల్‌కు ఇప్పుడున్న రెండు కోట్ల టన్నులకు అదనంగా మరో కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని భావిస్తున్నారు. సెయిల్‌ పది లక్షల టన్నుల ఉక్కును అదనంగా ఉత్పత్తి చేయాలంటే ఏడేళ్లు పడుతుంది. అదే విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేస్తే రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే తక్కువ పెట్టుబడితో డెబ్భై లక్షల టన్నుల ఉత్పత్తి సాధించవచ్చు. సెయిల్‌లో విలీనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ విలీనంతో కనీసం రూ.30వేల కోట్లు ఆదా కావడంతో పాటు, తక్షణమే ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

ఆశల మోసులు

సెయిల్‌లో విలీనం చేయడం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇనుప గనుల సమస్య తీరుతుంది. టన్నుకు కనీసం అయిదు వేల నుంచి ఆరు వేల రూపాయల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. సెయిల్‌కు విశాఖ, గంగవరం పోర్టులు అందుబాటులో ఉంటాయి. విశాఖ ఉక్కును భవిష్యత్తులో మరో యాభై లక్షల టన్నులకు విస్తరించి పది వేల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. గత ప్రధానులు వాజ్‌పేయీ, పీవీ నరసింహారావుల మాదిరిగా విశాఖ ఉక్కుకు తక్షణ సాయంగా మూడు వేల కోట్ల రూపాయల ప్రిఫరెన్షియల్‌ షేర్లు ఇవ్వాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఏపీలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, పేదల ఇళ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీటికి కావాల్సిన స్టీలును విశాఖ కర్మాగారం నుంచి కొనుగోలు చేయాలన్న అభ్యర్థనలు మరోసారి తెరపైకి వచ్చాయి. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారంపై సానుకూల నిర్ణయాలు వెలువడతాయన్న ఆశలు అందరిలో నెలకొన్నాయి.

యడ్లపాటి బసవ సురేంద్ర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.