Renewable energy sources: సుస్థిర ఇంధన భవితకు నారీశక్తి

పునరుత్పాదక ఇంధన వనరులపై భారత్‌ ప్రస్తుతం అధికంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. వాటిని అందిపుచ్చుకొనే విషయంలో ఇండియాలో మహిళలు చాలా వెనకంజలో ఉన్నారు. వాస్తవానికి, హరిత ఇంధనాల పరంగా మన మహిళామణులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పాలకులు ఈ విషయం గుర్తించాలి.

Published : 05 Jul 2024 01:22 IST

పునరుత్పాదక ఇంధన వనరులపై భారత్‌ ప్రస్తుతం అధికంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. వాటిని అందిపుచ్చుకొనే విషయంలో ఇండియాలో మహిళలు చాలా వెనకంజలో ఉన్నారు. వాస్తవానికి, హరిత ఇంధనాల పరంగా మన మహిళామణులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పాలకులు ఈ విషయం గుర్తించాలి.

ఇటీవలి జీ7 సదస్సులో ప్రధాని మోదీ హరిత ఇంధనాల విషయంలో ఇండియా నిబద్ధతను చాటిచెప్పారు. 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థత సాధించాలని భారత్‌ లక్షించింది. ఈ క్రమంలో కొత్తగా అయిదు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) సామర్థ్యాన్ని సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఆర్‌ఈకి సంబంధించిన శ్రామిక శక్తిలో దేశీయంగా మహిళల వాటా దాదాపు పదకొండు శాతమే. ప్రపంచ సగటు 32శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఒక్క ఆర్‌ఈ రంగమే 2030 నాటికి ఇండియాలో కొత్తగా పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో నైపుణ్యాల పెంపుదలపై ప్రభుత్వాలు సరిగ్గా దృష్టి సారించకపోతే మహిళలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
పునరుత్పాదక ఇంధన రంగంలో దేశీయంగా ఉన్న లింగపరమైన దుర్విచక్షణ, అసమానతలకు కారణాలు ఏమిటో వెంటనే గుర్తించి తగిన పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉంది. లింగపరమైన అసమానతలకు సంబంధించి భారత్‌లో సరైన వివరాలు లేకపోవడం పెద్ద లోటు. ఆయా మంత్రిత్వ శాఖలు సమన్వయంతో ఈ వివరాలు సేకరించే ఏర్పాటు చేయాలి. తద్వారా ఆర్‌ఈ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సరైన చర్యలు తీసుకోవచ్చు. దేశీయంగా మహిళల్లో నైపుణ్యాలు పెంచడం, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) విభాగంలో వారిని తీర్చిదిద్దడం మరో కీలకాంశం. పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన చాలా ఉద్యోగాలకు అత్యున్నత నైపుణ్యాలు అవసరం. స్టెమ్‌ విభాగంలో నిపుణులు వాటిని తేలిగ్గా అందిపుచ్చుకోగలరు. అయితే, దేశీయంగా స్టెమ్‌ రంగంలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంది. స్టెమ్‌ ఉద్యోగాల్లో మహిళల వాటా 14శాతమే. సౌరశక్తి ప్రాజెక్టుల స్థాపన, వాటి నిర్వహణలో కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో యువత, ముఖ్యంగా మహిళలకు ఈ రంగంలో నైపుణ్యాలు పెంచేందుకు ‘సూర్య మిత్ర’ నైపుణ్య శిక్షణ కార్యక్రమం వంటి వాటిని కేంద్రం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద 2015-2022 మధ్య కాలంలో సుమారు యాభై ఒక్క వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించారు. అందులో మహిళల వాటా దాదాపు నాలుగు శాతమే! పైగా వీరు హెల్పర్లు, ఇతర సహాయ సిబ్బంది పాత్రలకే పరిమితం అవుతున్నారు. స్టెమ్‌ కోర్సుల్లో మహిళలను ప్రోత్సహించేలా విద్యావ్యవస్థలో సరైన మార్పులు తేవాలి. దానివల్ల హరిత ఇంధన రంగంలో మహిళా సారథులు, మేనేజర్లు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు వేగంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం దక్కుతుంది.

పునరుత్పాదక ఇంధన రంగంలో మహిళా వ్యవస్థాపకతను సమర్థ వ్యాపార నమూనాగా మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, మారుమూల జనసమూహానికి వారు చేరువయ్యేలా చూడాలి. గ్రామీణ భారతంలో విద్యుత్‌ పంపిణీ సరఫరాలో అత్యధిక నష్టాలు, కాలంచెల్లిన గ్రిడ్‌ మౌలిక వసతులు వంటి సమస్యలను డిస్కమ్‌లు ఎదుర్కొంటున్నాయి. సోలార్‌ లాంతర్లు, మైక్రో గ్రిడ్‌లు వేగంగా, తక్కువ వ్యయంతో విద్యుత్‌ సదుపాయం కల్పిస్తాయి. వీటికి సంబంధించి సుస్థిర వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయాలి. ఇంట్లో విద్యుత్‌ వినియోగం విషయంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ క్రమంలో సుస్థిర ఇంధన వనరుల విషయంలో సమాజిక స్థాయిలో మార్పునకు వారు కీలకంగా నిలుస్తారు. వినియోగదారుల అవసరాలు తెలుసుకోవడం, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండటం వల్ల విద్యుత్‌ ఉత్పత్తులు, సేవల విక్రయం, నూతన ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించడంలో వారు ప్రధాన భూమిక వహిస్తారు. ఇన్ని అవకాశాలు ఉన్నా, మహిళల ప్రోత్సాహానికి సమధిక పెట్టుబడులు లేకపోవడం విచారకరం. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వాలు కంకణబద్ధంకావాలి.

అపర్ణ రాయ్‌
(పర్యావరణ, ఇంధన రంగ నిపుణులు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు