పెళ్లికి ముందు వీటి గురించి కూడా అడగాల్సిందే!

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం..

Updated : 10 Jun 2021 20:14 IST

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!


ఈ పెళ్లి మీకు ఇష్టమేనా..?
దాదాపు అన్ని పెళ్లిళ్లు వధూవరుల ఇష్టంతోనే జరుగుతుంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో, కుటుంబ పరువును కాపాడేందుకు, బాధ్యతల దృష్ట్యా.. లేదా మరే ఇతర కారణం వల్లో తమకు ఇష్టం లేకపోయినా పెళ్లికి అంగీకరిస్తుంటారు. దీనివల్ల పెళ్లైన తర్వాత దంపతులిద్దరూ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టం లేని వ్యక్తితో వైవాహిక జీవితం సాఫీగా సాగడం చాలా కష్టం. అందుకే, పెళ్లికి ముందే మీరు చేసుకోబోయే వారిని ఈ పెళ్లి వాళ్లకు ఇష్టమో, లేదో.. అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీకే ఆ వ్యక్తితో పెళ్లి ఇష్టంలేని పక్షంలో.. ఆ విషయాన్ని మీరే సున్నితంగా వాళ్లకి వివరించండి. దీనివల్ల ఇద్దరికీ మేలు జరుగుతుంది.


పెళ్లి కానుకల గురించి!
సాధారణంగా ఓ అమ్మాయికి పెళ్లి ఫిక్సయితే...‘అబ్బాయికి కట్నమెంత ఇస్తున్నారు?’ అనే ప్రశ్న మొదట వినిపిస్తుంది. దీంతో పాటు పెళ్లి లాంఛనాల కింద వరుడికి అందించే కానుకల విషయం కూడా చర్చకు వస్తాయి. అందుకే ఈ విషయంపై కాబోయే భర్త అభిప్రాయాలు ముందుగా తెలుసుకోవాలి. ఒకవేళ అతను వరకట్నం, ఇతర పెళ్లి కానుకలు కావాలంటే మాత్రం వెంటనే ‘నో’ చెప్పడం మంచిది. ఎందుకంటే ఇలా డబ్బులిచ్చి భర్తను కొనుక్కుంటే మనమే ఆ అలవాటును అతడికి నేర్పించినట్లవుతుంది. పెళ్లయ్యాక ఇదే కారణంతో మళ్లీ మిమ్మల్ని వేధించే అవకాశమూ లేకపోలేదు.


వివాహ బంధంపై అభిప్రాయమేంటి..?
కొంతమంది వివాహమంటే కేవలం కలిసి బతకడమనే అనుకుంటారు. కానీ, వివాహమంటే రెండు మనసులు కలవడం. ఒకరికొకరు ప్రాణంగా ఉంటూ జీవితాంతం కలిసి చేయాల్సిన అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిని సహనంతో పరిష్కరించుకోవాలే తప్ప ఈ ప్రయాణాన్ని మధ్యలో ఆపకూడదు, ఆ బంధాన్ని మధ్యలో వీడకూడదు. అందుకే పెళ్లికి ముందే మీరు చేసుకోబోయే వారిని వివాహబంధంపై తమ అభిప్రాయమేంటని అడిగి తెలుసుకోండి. వాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు మీకు దగ్గరగా లేకపోతే మీ నిర్ణయంపై పునరాలోచన చేయడం మంచిది.


కుటుంబ బాంధవ్యాలకు విలువిస్తారా..?
కుటుంబ బంధాల మధ్య పెరిగిన వ్యక్తికి.. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమానురాగాలతో మెలగడం, కుటుంబ బాధ్యతల్లో పాలుపంచుకోవడం.. మొదలైన విషయాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే మీరు చేసుకోబోయే వ్యక్తితో పాటు తమ ఇంటి సభ్యులకి కూడా కుటుంబ బంధాలపై ఎలాంటి అభిప్రాయముందో ముందే తెలుసుకోండి. ఇంటి సభ్యులంతా ప్రేమానురాగాలతో కలిసుండే కుటుంబాలే ఎప్పటికీ సంతోషంగా ఉంటాయనే విషయం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా డబ్బులు, చిన్న విషయాలకు కూడా తల్లిదండ్రులపై ఆధారపడే అబ్బాయిల విషయంలో పునరాలోచించుకోవాలి. ఎందుకంటే వారు స్వతంత్రంగా ఏ నిర్ణయాలు తీసుకోలేరు. అలాంటి భాగస్వాములతో భవిష్యత్‌లో పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.


పెళ్లి తర్వాత ఉద్యోగం!
పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్న మహిళల్లో 10 శాతం మంది వివాహమయ్యాక తమ ఉద్యోగాలను విడిచిపెడుతున్నారని సర్వేలు, అధ్యయనాలు చెబుతున్నాయి. భర్త, అత్తమామల నుంచి ఎదురవుతోన్న తీవ్ర ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాబట్టి పెళ్లికి ముందే మీ ఉద్యోగం, జీవిత లక్ష్యం, తదితర భవిష్యత్‌ ప్రణాళికల గురించి కాబోయే భర్తతో మాట్లాడండి. మీ కలల ప్రయాణం గురించి అతడికి అర్థమయ్యేలా వివరించండి.


ఇంటి బాధ్యతల గురించి!
భార్యాభర్తలన్నాక కష్ట సుఖాలు పంచుకున్నట్లే ఇంటి పనులు, బాధ్యతలను కూడా షేర్‌ చేసుకోవాలి. కుకింగ్‌, క్లీనింగ్, ఇతర ఇంటి పనుల్లో పరస్పరం సహకరించుకునే తత్వం ఉండాలి. అంతేకానీ ఇంటి పనులన్నీ ఆడవాళ్లే చేయాలన్న అభిప్రాయం అబ్బాయికి ఉంటే మాత్రం మళ్లీ ఆలోచించాలి.


తల్లిదండ్రుల సంరక్షణ!
మీ తల్లిదండ్రులైనా, మీ భాగస్వామి తల్లిదండ్రులైనా ఇద్దరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించేది వారే. కాబట్టి తల్లిదండ్రులతో పాటు అత్తమామాల సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి. ఈ విషయంపై కాబోయే భార్యాభర్తలు ముందుగానే చర్చించి ఒక అభిప్రాయానికి రావాలి.


అనారోగ్య సమస్యల గురించి... 
కాబోయే జీవిత భాగస్వామికి ఏవైనా జన్యుపరమైన / దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయా అన్నది ముందుగానే నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇవి తల్లిదండ్రుల ద్వారా పుట్టబోయే పిల్లలకు కూడా సంక్రమించే అవకాశం ఉండచ్చు. అలాగే వంధ్యత్వ సమస్యలతో పాటు లైంగికంగా సంక్రమించే వ్యాధుల గురించి కూడా ఎంక్వైరీ చేయాలి.


బ్రేకప్‌, రిలేషన్‌షిప్స్‌ గురించి!
ప్రేమ, రిలేషన్‌షిప్‌కు సంబంధించి గతంలో మీకు ఏమైనా చేదు అనుభవాలుంటే కాబోయే భార్య/భర్తకు ముందుగానే చెప్పాలి. ఒకవేళ పెళ్లి తర్వాత వీటి గురించి తెలిస్తే ఒకరిపై ఒకరికి అపనమ్మకం ఏర్పడుతుంది. కాపురంలో కలహాలు మొదలవుతాయి. అదేవిధంగా శృంగారం విషయంలో భాగస్వామి అభిప్రాయాలు తెలుసుకోవాలి.


పిల్లల గురించి..
పెళ్లి తర్వాత చాలా జంటలకు పిల్లల విషయంలో రకరకాల మనస్పర్ధలు వస్తుంటాయి. అందుకే పిల్లలను ఎప్పుడు కనాలి? ఎంతమందిని కనాలి?.. మొదలైన విషయాలను ఇద్దరూ కలిసి పెళ్లికి ముందే చర్చించుకోవడం మంచిది. దీనితో పాటు ఒకవేళ పిల్లలు పుట్టని పక్షంలో IVF పద్ధతిని అనుసరించడం, పిల్లలను దత్తత తీసుకోవడం.. మొదలైన మార్గాల్లో ఒక దానిని పెళ్లికి ముందే ఎంపిక చేసి పెట్టుకోవడం కూడా మేలు.
మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి దగ్గర పై విషయాల గురించి ప్రస్తావించినప్పుడు, వారి ఆలోచనలు కూడా మీకు నచ్చితే మంచిదే. అలా కాకుండా, వాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచిన పక్షంలో మీ పెళ్లి నిర్ణయంపై ఒక్కసారి పునరాలోచన చేయడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్