మొన్న NDA! వందేళ్ల తర్వాత ఇప్పుడు RIMC!

అరుదైన రంగాల్లోకి ప్రవేశించాలన్న ఆసక్తి అమ్మాయిలకు ఉన్నా..కొన్ని రంగాల్లో అవకాశాలు కరువవుతున్నాయి.

Published : 14 Mar 2022 18:44 IST

అరుదైన రంగాల్లోకి ప్రవేశించాలన్న ఆసక్తి అమ్మాయిలకు ఉన్నా..కొన్ని రంగాల్లో అవకాశాలు కరవవుతున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ అడ్డుగోడలు తొలగుతున్నాయని చెప్పచ్చు. ఇందుకు తాజా ఉదాహరణే.. దేహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ.. తన వందేళ్ల చరిత్రలో తొలిసారి ఐదుగురు బాలికల్ని చేర్చుకుంటున్నట్లు ప్రకటించడం! మొన్నటికి మొన్న జాతీయ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలోనూ తొలిసారి అమ్మాయిలకు అవకాశం దక్కింది. మరోవైపు త్రివిధ దళాల్లో మహిళా ఉద్యోగులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయడం కూడా శుభపరిణామమే! ఇవన్నీ చూస్తుంటే రక్షణ రంగంలో స్త్రీపురుష సమానత్వం సాధ్యమయ్యే రోజు ఇంకా ఎంతో దూరం లేదనిపిస్తోంది కదూ!

త్రివిధ దళాల్లో ఔత్సాహిక అమ్మాయిల్ని ప్రోత్సహించే నేపథ్యంలో తాజాగా ఉత్తరాఖండ్‌ దేహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ) చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ కళాశాలలో తొలిసారి ఐదుగురు బాలికలకు ప్రవేశం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ కాలేజీ ఏర్పాటై మార్చి 13తో వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తొలిసారి ఐదుగురికి ఛాన్స్‌!

1922, మార్చి 13న అప్పటి బ్రిటిష్‌-ఇండియా ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటుచేసింది. భారతీయ అబ్బాయిలకు ఇందులో మిలిటరీ శిక్షణ ఇచ్చి బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో అధికారులుగా చేర్చుకునేవారు. ఇక ఇప్పుడు ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), నావెల్‌ అకాడమీలో చేరుతున్నారు. అయితే ఇటీవలే ఎన్‌డీఏలో మహిళలకు ప్రవేశాలు కల్పిస్తూ తొలిసారి ప్రవేశ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తాము కూడా బాలికల్ని చేర్చుకోవాలని నిర్ణయించినట్లు, ఈ ఏడాది జులైలో ప్రారంభమయ్యే తరగతులకు బాలికల కోసం ఐదు సీట్లు కేటాయించినట్లు ఆర్‌ఐఎంసీ కమాండెంట్‌ కల్నల్‌ అజయ్‌ కుమార్‌ తెలిపారు. అంతేకాదు.. విద్యార్థినుల సౌకర్యార్థం స్కూల్లో వివిధ రకాల మార్పులు చేర్పులు చేయనున్నారు.

ఎంపిక ఇలా!

ఎనిమిదో తరగతి నుంచి ఈ కళాశాలలో ప్రవేశం కల్పిస్తారు. ప్రతి ఆరు నెలలకోసారి (జనవరి, జులై) 25 క్యాడెట్స్‌/విద్యార్థులు RIMCలో ప్రవేశం పొందుతారు. అలాగే అభ్యర్థులు ప్రవేశం పొందే సమయానికి (జనవరి 1 లేదా జులై 1) వాళ్ల వయసు పదకొండున్నరేళ్లకు తక్కువగా, 13 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు. ఒకవేళ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలైతే.. ఇద్దరికి సీట్లు కేటాయిస్తారు. చేరదలచుకున్న అభ్యర్థులు దరఖాస్తు పత్రాలు నింపి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాల్సి ఉంటుంది. ఇక ‘ఆలిండియా ఎంట్రన్స్ పరీక్ష’లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు. ఈ పరీక్షకు ఈసారి మొత్తంగా 568 మంది అమ్మాయిలు హాజరయ్యారు. ఇందులో నుంచి ఐదుగురు అమ్మాయిలకు ప్రవేశం కల్పించనున్నారు.
ఇలా RIMCలో అమ్మాయిల్ని చేర్చుకోవాలని ఇప్పుడు మొదటిసారి నిర్ణయించినప్పటికీ.. 1992లో తొలిసారి ప్రయోగాత్మకంగా స్వర్ణిమా తప్లియాల్‌ అనే అమ్మాయిని చేర్చుకున్నారు. ఆ స్కూల్లో పనిచేసే ఫ్యాకల్టీ కుమార్తె అయిన ఆమె.. ఆ తర్వాత ఆర్మీలో విజయవంతంగా సేవలందించి మేజర్‌గా రిటైరయ్యారు.

గతేడాది ‘ఎన్‌డీఏ’లోకీ ఎంట్రీ!

త్రివిధ దళాల్లో మహిళలకు పురుషులతో సమానంగా ప్రవేశాలు కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) గతేడాది సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏటా రెండుమార్లు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసేందుకు అమ్మాయిలకూ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్‌లో అమ్మాయిలు తొలిసారి ఈ ప్రవేశ పరీక్ష రాశారు. లక్షన్నర మందికి పైగా అమ్మాయిలు దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరవగా.. అందులో నుంచి 1002 మంది రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈ ఏడాదికి గాను తొలి విడత ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 10న జరగనుంది.

‘శాశ్వత’ కమిషన్‌తో సేవలు శాశ్వతం!

ఇక మొన్నటిదాకా త్రివిధ దళాల్లో చేరిన మహిళలు ఏ హోదాలో ఉద్యోగం చేస్తున్నా.. వాళ్లు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కిందే తమ కెరీర్‌ని కొనసాగించేవారు. అంటే.. పదేళ్లు మాత్రమే వారు సర్వీస్‌లో కొనసాగడానికి అర్హులు. ఆ తర్వాత అప్పటి అవసరాలు, అభ్యర్థుల ఆసక్తి-సమర్థతను బట్టి మరో నాలుగేళ్ల సర్వీస్‌ పొడిగించేవారు. దీంతో ఇష్టం లేకపోయినా మహిళలు అర్ధాంతరంగా తమ కెరీర్‌ను ముగించాల్సి వచ్చేది. దీంతో గ్రాట్యుటీ తప్ప పింఛను, ఇతర ప్రయోజనాలు కూడా దక్కేవి కావు. కాబట్టి ఇలాంటి అసమానతలకు తెరదించాలని ఏళ్లుగా పోరాటం చేశారు కొందరు ఉద్యోగినులు. దీంతో సుప్రీంకోర్టు ఈ పద్ధతికి తెరదించుతూ.. గతేడాదే రక్షణ రంగంలో మహిళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయమని ఆదేశించింది. ఫలితంగా పదవీ విరమణ వయసు వచ్చేవరకు మహిళలు ఉద్యోగంలో కొనసాగచ్చు. కనీసం 20 ఏళ్లు సేవలందించిన వారు పింఛను, ఇతర సదుపాయాలు పురుషులతో సమానంగా అందుకోవచ్చు. సాయుధ దళాల్లో మహిళల్ని ప్రోత్సహించడానికి దీన్నో ముందడుగుగా చెబుతున్నారు నిపుణులు.

వీటన్నింటిని పరిశీలిస్తే.. త్రివిధ దళాల్లో ప్రవేశించాలనుకునే మహిళలకు అడ్డుగా ఉన్న ఒక్కో తెర తొలగిపోతూ.. ఒక్కో అవకాశం వాళ్ల ముందు వాలుతోందని చెప్పచ్చు. వీటిని అందిపుచ్చుకుంటే అమ్మాయిల కల నెరవేరడమే కాదు.. శతాబ్దాలుగా మాటలకే పరిమితమైన స్త్రీపురుష సమానత్వాన్నీ సాధించి చూపించచ్చు.. ఏమంటారు?!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్