ఈ ‘సోలార్ ఇస్త్రీ బండి’తో బ్రిటన్ ప్రిన్స్‌ను ఆకట్టుకుంది!

ఎలక్ర్టిక్‌ ఇస్త్రీ పెట్టెలొచ్చినా నేటికీ చాలామంది బొగ్గుల ఇస్త్రీ పెట్టెలతోనే దుస్తులను ఇస్త్రీ చేస్తుంటారు. ముఖ్యంగా ఎలక్ర్టిక్‌ ఐరన్‌ బాక్స్‌లకు అయ్యే ఖర్చు, విద్యుత్‌ కోతలను భరించలేక ఎక్కువగా వీధి వ్యాపారులు వీటిని ఉపయోగిస్తున్నారు.

Published : 19 Sep 2021 18:19 IST

(Photo: Twitter)

ఎలక్ర్టిక్‌ ఇస్త్రీ పెట్టెలొచ్చినా నేటికీ చాలామంది బొగ్గుల ఇస్త్రీ పెట్టెలతోనే దుస్తులను ఇస్త్రీ చేస్తుంటారు. ముఖ్యంగా ఎలక్ర్టిక్‌ ఐరన్‌ బాక్స్‌లకు అయ్యే ఖర్చు, విద్యుత్‌ కోతలను భరించలేక ఎక్కువగా వీధి వ్యాపారులు వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ బొగ్గును మండించడం వల్ల ప్రమాదరకరమైన కార్బన్‌ మోనాక్సైడ్‌ పెద్ద మొత్తంలో వెలువడుతుంది. దీనికి తోడు బొగ్గును తయారుచేయాలంటే పెద్ద మొత్తంలో చెట్లను నరకాల్సిందే. ఇలా ఎటు చూసినా బొగ్గుతో పర్యావరణానికి ప్రమాదమే పొంచి ఉంది.

14 ఏళ్ల వయసులోనే!

ఇలాంటి పరిస్థితుల్లో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని ‘సోలార్‌ ఐరన్‌ కార్ట్’ను తయారుచేసింది తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల వినీష ఉమాశంకర్. తిరువణ్ణామళైలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోన్న ఈ విద్యార్థిని తక్కువ ఖర్చుతో ఈ మొబైల్‌ ఇస్త్రీ బండిని రూపొందించడం విశేషం. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న వినీష ప్రాజెక్టు తాజాగా బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం ప్రదానం చేయనున్న ‘ఎర్త్‌షాట్‌ ప్రైజ్’ ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకుంది!

అసలేంటీ ‘ఎర్త్‌షాట్‌ ప్రైజ్’?

పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి, ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తీసుకొచ్చేవారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్‌ ప్రిన్స్ విలియం ఈ ‘ఎర్త్‌షాట్‌ ప్రైజ్’ను నెలకొల్పారు. గతేడాది ప్రారంభించిన ఈ ప్రైజ్‌ ఫైనలిస్టుల జాబితాను తాజాగా విలియం ప్రకటించారు. మొత్తం 5 విభాగాల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 750 ఎంట్రీలను వడపోసి 15 ప్రాజెక్టులను తుది జాబితాకు ఎంపిక చేశారు. అందులో వినీష ప్రాజెక్టుతో పాటు దిల్లీకి చెందిన విద్యుత్‌ మోహన్‌ ప్రాజెక్టు కూడా చోటు దక్కించుకుంది. అక్టోబర్‌ 17న లండన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఈ 15 మంది ఫైనలిస్టుల్లో ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తారు. ప్రైజ్‌మనీగా ఒక్కొక్క ప్రాజెక్టుకు ‘రూ.10.12 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తారు.

ఆ ఇస్త్రీ బండి వ్యాపారిని చూసి!

ప్రస్తుతం తిరువణ్ణామళైలోని ఎస్‌కేసీ వనితా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది వినీష. చిన్నప్పటి నుంచే తనకు పర్యావరణమంటే ఎంతో ప్రేమ. దీనికి తోడు సైన్సుపై ఆసక్తి ఉంది. ఈ రెండింటి కలబోతగానే సోలార్ ఐరన్‌ కార్ట్‌ను తయారుచేసిందీ ట్యాలెంటెడ్‌ గర్ల్.

‘నా ఐదో పుట్టిన రోజు నాడు మా అమ్మానాన్నలు ‘స్పేస్‌ ఎన్‌సైక్లోపిడియా’ పుస్తకాన్ని బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఆ బుక్‌ను చదువుతూ సైన్స్‌తో పాటు పర్యావరణ సమస్యలు, వాటి పరిష్కారాలపై అవగాహన పెంచుకుంటున్నాను. ఇక సోలార్‌ ఐరన్‌ కార్ట్‌ ఐడియా రెండేళ్ల క్రితం వచ్చింది. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. ఒకరోజు నేను స్కూల్‌ నుంచి తిరిగివస్తూ మా ఇంటి సమీపంలోని ఇస్త్రీ బండి వ్యాపారిని చూశాను. అప్పుడతను బాగా మండించిన బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో వేసి దుస్తులు ఇస్త్రీ చేశాడు. అది పూర్తయ్యాక బొగ్గులను నీటితో చల్లార్చి పక్కనున్న చెత్తకుండీలో పడేశాడు. ఇంటికొచ్చాక చార్కోల్‌ను మండించడం వల్ల కలిగే నష్టాలను ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేశాను. ఈ పొగలో కార్బన్‌ మోనాక్సైడ్‌ అనే విషవాయువు ఉంటుందని, అది శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తుందని తెలిసింది. ఇక బొగ్గును ఉత్పత్తి చేయాలంటే చెట్లను నరికేసి చాలా రోజుల పాటు మండించాలని కూడా చదివాను. ఈ క్రమంలోనే పర్యావరణానికి ఎంతో విఘాతం కలిగిస్తున్న బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఏదైనా కనుగొనాలనుకున్నాను.’

సోలార్ ప్యానల్స్ సహాయంతో!

‘అప్పుడే మా టీచర్‌ సోలార్‌ ఎనర్జీ గురించి చెప్పారు. దీనిపై మరింత సమాచారం కోసం బుక్స్‌, యూట్యూబ్‌ వీడియోలు చూశాను. సోలార్ ప్యానల్స్ ఎలా పనిచేస్తాయో సమగ్రంగా తెలుసుకున్నాను. ఆతర్వాతే ప్రొటోటైప్‌ లైఫ్‌ సైజ్‌ ఐరన్‌ కార్ట్‌ను తయారుచేయడానికి ఉపక్రమించాను. సాధారణ ఇస్త్రీ బండిలానే ఇది కూడా ఉంటుంది. బండి పై భాగంలో సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఇవి బ్యాటరీతో అనుసంధానమై ఉంటాయి. గంటకు 250 వాట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ బ్యాటరీని 5-6 గంటల్లో ఫుల్‌ ఛార్జ్‌ చేస్తాయి. ఒకసారి బ్యాటరీ ఫుల్‌ అయ్యిందంటే స్టీమ్‌ ఐరన్‌ బాక్స్‌తో కనీసం ఆరుగంటల పాటు దుస్తులను ఇస్త్రీ చేయచ్చు. వర్షం కురిసినా, ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ ఛార్జింగ్‌ను స్టోర్‌ చేసుకునే సామర్థ్యం బ్యాటరీకి ఉండడం అదనపు ప్రయోజనం. అదేవిధంగా ఇందులోని యూఎస్‌బీ పోర్టులను ఛార్జింగ్‌ స్టేషన్లుగా వినియోగించుకోవచ్చు. దీనివల్ల మరింత ఆదాయం పొందవచ్చు’ అని తన ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చింది వినీష.

తన సృజనాత్మకతకు గుర్తింపుగా 2019లో ‘డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఇగ్నైట్‌ అవార్డు’ను అందుకుందీ ట్యాలెంటెడ్‌ గర్ల్. ‘నా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను పలు కాంపిటీషన్లలో ప్రజెంట్ చేశాను. అయితే అబ్దుల్‌ కలామ్‌ ఇగ్నైట్‌ అవార్డు వరించాకే నా ప్రాజెక్టు గురించి ప్రపంచానికి తెలిసింది. నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్‌లోని మెకానికల్‌, ఎలక్ర్టానిక్స్ విభాగాలకు చెందిన ఇంజినీర్లు నన్ను సంప్రదించారు. ప్రొటోటైప్‌ సోలార్‌ ఐరన్‌ కార్ట్‌ తయారీలో విలువైన సలహాలు, సూచనలు అందించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పేటెంట్‌ రైట్స్‌ను నా పేరుతో దరఖాస్తు చేశారు. నాకు 18 ఏళ్లు నిండగానే ప్రాజెక్టు పేటెంట్‌ రైట్స్‌ పూర్తిగా నా పేరుకు బదిలీ అవుతాయి’ అని ఓ సందర్భంలో వినీష చెప్పుకొచ్చింది.

స్మార్ట్‌ సీలింగ్‌ ఫ్యాన్... నెక్ట్స్ ఇదే!

తన మొబైల్‌ ఐరన్‌ కార్‌్యకు గుర్తింపుగా గతేడాది నవంబర్‌లో ‘చిల్ట్రన్స్ క్లైమేట్ ప్రైజ్‌’ను కూడా గెల్చుకుంది వినీష. దీనికి గాను స్వీడన్‌ చిల్డ్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్‌ నుంచి ఆమె రూ.8.64 లక్షల నగదు, మెడల్‌, ప్రశంసా పత్రం అందుకుంది. తాజాగా ‘ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌’ ఫైనల్‌ జాబితాలోనూ చోటు దక్కించుకుంది.

‘ఇలాంటి సోలార్‌ ఐరన్‌ కార్ట్‌లు మరిన్ని తయారుచేసి ఇక్కడున్న ఇస్త్రీ వ్యాపారులకు అందించాలనుకుంటున్నాను. ప్రాజెక్టుపై వారి అభిప్రాయాలు తెలుసుకుంటాను. అవసరమైతే మరిన్ని మార్పులు చేస్తాను. ఇక నా తర్వాతి ప్రాజెక్టు విషయానికొస్తే... మనం చాలాసార్లు ఫ్యాన్‌ స్విచ్‌లు ఆపేయకుండా బయటకు వెళుతుంటాం. దీనివల్ల అనవసరంగా కరెంట్‌ వృథా అవుతుంది. దీనిని నివారించేందుకు ఒక స్మార్ట్‌ సీలింగ్‌ ఫ్యాన్‌ తయారుచేయాలనుకుంటున్నాను. ఇది సెన్సర్ల సహాయంతో పనిచేస్తుంది. అంటే ఎవరైనా గదిలోకి ప్రవేశిస్తే ఆటోమెటిక్‌గా ఫ్యాన్‌ తిరుగుతుంది. అదేవిధంగా గది నుంచి వెళ్లిపోగానే దానంతట అదే ఆగిపోతుంది’ అని తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి చెబుతోందీ క్రియేటివ్‌ గర్ల్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్