ఓవైపు పర్యావరణ పరిరక్షణ.. మరోవైపు సమాజ సేవ!

కాలం వేగంగా పరిగెడుతోంది. ఇందుకు తగినట్లుగానే ఈ తరం విద్యార్థుల ఆలోచనలు కూడా అంతే వినూత్నంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు తమ ఆలోచనలతో......

Updated : 01 Apr 2022 15:16 IST

(Photo: Twitter)

కాలం వేగంగా పరిగెడుతోంది. ఇందుకు తగినట్లుగానే ఈ తరం విద్యార్థుల ఆలోచనలు కూడా అంతే వినూత్నంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు తమ ఆలోచనలతో ఒకవైపు సమాజ సేవ చేస్తూనే.. మరోవైపు పర్యావరణాన్నీ కాపాడుతున్నారు. బెంగళూరుకు చెందిన దియా అనే అమ్మాయి కూడా ఈ జాబితాలోకే వస్తుంది. పాత నోట్‌బుక్స్‌లో మిగిలిపోయిన తెల్లపేజీల్ని సేకరించి.. వాటితో కొత్త నోట్‌బుక్స్‌ తయారుచేస్తోందామె. వాటిని పేద విద్యార్థులకు పంచిపెడుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల దియా అక్కడి కెనడియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతోంది. పర్యావరణ పరిరక్షణ అంటే ఆమెకు చిన్నతనం నుంచే మక్కువ! ఒక్కో చేయి కలిస్తేనే ఇది సాధ్యమవుతుందని నమ్మే దియా.. తనవంతుగా ఈ దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా నలుగురికీ ఉపయోగపడే పని చేస్తోంది.

పాత పేజీలకు కొత్త రూపు!

మనం ఉపయోగించిన నోట్‌బుక్స్‌లో ఆఖర్లో కొన్ని తెల్లపేజీలు మిగిలిపోతుంటాయి. అయితే అవి ఇక పనికిరావంటూ పడేస్తుంటారు చాలామంది. కానీ తనకు మాత్రం అవే కావాలంటోంది దియా. అలాంటి పేజీల్ని సేకరించి.. తిరిగి వాటిని బైండ్‌ చేసి నోట్‌బుక్‌లా తయారుచేయిస్తోందామె. వాటిని పేద విద్యార్థులకు పంచుతోంది. అలా ఇప్పటివరకు 750 నోట్‌బుక్స్‌ని 200 మంది పేద పిల్లలకు పంచిపెట్టింది. దీని గురించి దియా మాట్లాడుతూ.. ‘పూర్తిగా వాడని నోట్‌బుక్స్‌ని తిరిగి ఉపయోగించడం వల్ల చెత్తను తగ్గించవచ్చు. తద్వారా పర్యావరణానికీ మేలు జరుగుతుంది. అలాగే ఆ పుస్తకాలను పేద విద్యార్థులకు అందించడం వల్ల వారికి ఎంతో కొంత సహాయం చేసినట్లవుతుంది. తీరిక సమయం దొరికినప్పుడల్లా పాత నోట్‌బుక్స్‌ని సేకరిస్తున్నాను. నా ఇనీషియేటివ్‌ని మరింత మందికి చేరువ చేయడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. పూర్తిగా వాడని, కొద్దిగా ఉపయోగించిన నోట్‌ బుక్స్‌ని సేకరించడానికి మా పరిసర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల దగ్గర డ్రాప్‌ బాక్స్‌లు పెట్టాను. నా తోటి విద్యార్థుల దగ్గర కూడా ఇలాంటి నోట‌్‌బుక్స్‌ని సేకరిస్తున్నాను..’ అని చెప్పుకొచ్చింది దియా.

అమ్మ దగ్గర నేర్చుకున్నా!

దియా తన స్కూల్‌ వర్క్‌లో భాగంగా పర్యావరణహితమైన ఓ ప్రాజెక్ట్‌ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే నోట్‌బుక్‌ రీబైండింగ్‌ని ఎంచుకుంది. అయితే తనకు ఈ ఆలోచన తన తల్లిని చూశాకే కలిగిందని చెబుతోంది దియా. ‘మా అమ్మ సరుకుల జాబితా రాయడం దగ్గర్నుంచి ఇంటి ఖర్చుల లెక్కలు వేయడం వరకు.. ఇలా ప్రతి పనికీ ఉపయోగించిన నోట్‌బుక్స్‌లో ఉన్న ఖాళీ పేపర్లనే వాడేది. ఇది చూశాకే నాకు రీబైండింగ్‌ ఆలోచన వచ్చింది.. ఒక్కో పేపర్‌ని పోగేసి నోట్‌బుక్‌లా తయారుచేస్తే అవసరంలో ఉన్న పిల్లలకు ఇవి ఉపయోగపడతాయి కదా.. అనిపించిందం’టోందీ బెంగళూరు అమ్మాయి. దియా చేస్తోన్న మంచి పనికి పాఠశాల యాజమాన్యం కూడా ఆమెను అభినందించింది. ‘నోట్‌బుక్స్‌ని అప్‌-సైకిల్‌ చేసే పనికి పూనుకొన్న దియాకు పర్యావరణంపై ఎంత ప్రేముందో అర్థమవుతుంది. వీటిని పేద పిల్లలకు అందజేయడం చాలా మంచి ఆలోచన!’ అంటూ ఈ లిటిల్‌ సోషల్‌ వర్కర్‌ను ప్రశంసించింది స్కూల్‌ యాజమాన్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్