Updated : 29/11/2021 18:35 IST

21 ఏళ్ల సర్పంచ్‌!

(Photo: Facebook)

పురుషాధిపత్యం అధికంగా ఉన్న రాజకీయాల్లోనూ మహిళలు ప్రవేశిస్తున్నారు. తమ సేవా కార్యక్రమాలతో, ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలందుకుంటున్నారు. తానూ ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది బిహార్‌కి చెందిన 21 ఏళ్ల అనుష్క కుమారి. సర్పంచ్‌గా పోటీ చేసి.. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిందామె. తద్వారా రాష్ట్రంలోనే పిన్న వయసులో సర్పంచ్‌గా ఎన్నికైన మహిళగా ఘనత సాధించింది.

అలా సెన్సేషన్‌ అయ్యింది...

బిహార్‌లో ఇటీవలే ఏడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో అనుష్క కుమారి శివహర్‌ జిల్లాలోని కుషహర్‌ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసింది. ఈ క్రమంలో ఆమె తన సమీప ప్రత్యర్థి రీతా దేవిపై 287 ఓట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా బిహార్‌లో పిన్న వయసులో సర్పంచ్‌గా ఎన్నికైన మహిళగా ఘనత సాధించింది. ఫలితాల్లో అనుష్కకి 2625 ఓట్లు రాగా.. తన ప్రత్యర్థి రీతా దేవికి 2338 ఓట్లు దక్కాయి. పోటీ చేసిన మొదటిసారే, అది కూడా అతి పిన్న వయసులో  విజయం వరించడంతో అనుష్క పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది.

ఆ నమ్మకాన్ని వమ్ము చేయను..

‘ఈ విజయం కుషహర్‌ గ్రామ ప్రజల వల్లే దక్కింది. మీ ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. ఈ గ్రామ ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు గ్రామంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇలాంటి ప్రతికూలతల్ని పారదోలడానికే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేశాను. ఈ గ్రామంలో కచ్చితంగా చేయాల్సిన మార్పులపై దృష్టి సారిస్తా. గ్రామ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను..’ అంటోంది అనుష్క.

ఇటు సేవ.. అటు చదువు!

బిహార్‌లో పుట్టి పెరిగిన అనుష్క.. 10వ తరగతి వరకు హరియాణాలోనే చదివింది. ఆ తర్వాత బెంగళూరులోని ఓ కాలేజీలో ‘హిస్టరీ ఆనర్స్‌’లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం సర్పంచ్‌గా ఎన్నికైనా.. ఓవైపు ప్రజలకు సేవ చేస్తూనే.. మరోవైపు చదువునూ కొనసాగిస్తానంటోందీ యువ సర్పంచ్‌. తాను రాజకీయాల్లోకి రావడానికి తన తాతయ్యే స్ఫూర్తి అని చెబుతోంది అనుష్క. ఇక అనుష్క తండ్రి సునీల్‌ సింగ్‌ గతంలో జిల్లా పరిషత్‌ సభ్యునిగా పని చేశారు.
‘ఏ రంగంలోనైనా కృషి, అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు దానంతటదే వస్తుంది. నాలాగే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి రావాలి. ముఖ్యంగా అమ్మాయిలు రాజకీయాల్లో ఉంటే గ్రామీణ మహిళల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి..’ అని చెప్పుకొచ్చింది.

వీళ్లు కూడా..

అంతకు ముందు హరియాణాకు చెందిన పర్వీన్‌ కౌర్‌ కూడా 21 ఏళ్లలోనే సర్పంచ్‌గా గెలిచింది. ఆమె 2016లో కైతల్‌ జిల్లాలోని కాక్రాలా గ్రామం నుంచి పోటీ చేసి విజయం సాధించింది. దీంతో హరియాణాలోనే పిన్న వయసు సర్పంచ్‌గా గుర్తింపు పొందింది. ఈ పదవిలో కొనసాగుతూ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందామె. మహిళల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, పిల్లల కోసం గ్రంథాలయం నిర్మించడం, గ్రామంలో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయడం.. వంటి పలు అభివృద్ధి పనులు చేసింది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఈ యువ సర్పంచ్‌ సేవలను కొనియాడుతూ ట్వీట్‌ కూడా చేశారు. అలాగే 2017 ‘మహిళల దినోత్సవం’ సందర్భంగా ప్రధాని మోదీ పర్వీన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

వీరిలాగే మరికొన్ని రాష్ట్రాల్లోనూ కొందరు అమ్మాయిలు చిన్న వయసులోనే రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. నేటి యువతకు స్ఫూర్తినిస్తున్నారు.


Advertisement

మరిన్ని