అమ్మమ్మలు, తాతయ్యలకు టెక్నాలజీ నేర్పిస్తోంది..!
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే చాలా పనులు పూర్తి కావడం లేదు. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు బయటకు వెళ్లేటప్పుడు స్మార్ట్ ఫోన్‌లు తీసుకెళ్తున్నారు. తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. అయితే వయసు పైబడిన వారు మాత్రం ఈ విషయాల్లో సరైన అవగాహన.....
(Photos: Instagram)
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే చాలా పనులు పూర్తి కావడం లేదు. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు బయటకు వెళ్లేటప్పుడు స్మార్ట్ ఫోన్‌లు తీసుకెళ్తున్నారు. తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. అయితే వయసు పైబడిన వారు మాత్రం ఈ విషయాల్లో సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. వారు ట్యాక్సీ బుక్ చేసుకోవాలన్నా, భోజనం ఆర్డర్ చేయాలన్నా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుంటుంది. ఎవరో కొంతమంది సొంతంగా గ్యాడ్జెట్లను ఉపయోగిస్తుంటారు. ముంబయికి చెందిన మహిమ భలోతియా ఈ పరిస్థితిని మార్చాలనుకుంది. పెద్ద వయసు వారికి కూడా టెక్నాలజీ, యాప్స్‌పై అవగాహన కల్పించాలనుకుంది. ఈ క్రమంలో ‘ది సోషల్ పాఠశాల’ను ప్రారంభించింది. దీని ద్వారా 5 వేల మందికి పైగా వయసు పైబడిన ఎంతోమందికి వారికి టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తోంది. ఇచ్చింది.
ఆ మాటే ‘అందుకు ప్రాణం పోసింది!
ముంబయికి చెందిన మహిమ (28) ఇటలీలో లగ్జరీ గూడ్స్&సర్వీసెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసింది. ఆ తర్వాత పలు సంస్థల్లో మార్కెటింగ్ నిపుణురాలిగా సేవలందించింది. ఒకసారి ఆఫీసులో మహిమకు తన బాస్‌కు మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మహిమ తన బాస్‌తో భోజనం చేస్తున్న సమయంలో బాస్ వాళ్ల అమ్మ క్యాబ్ బుకింగ్ గురించి ఆయనకు తరచూ ఫోన్ చేయడం గమనించింది. అప్పుడాయన సరదాగా ‘మహి.. నువ్వైనా ఈ పెద్దవారికి క్యాబ్ బుక్ చేయడం గురించి చెప్పచ్చుగా’ అన్నారట. కానీ మహిమ దానినే సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో వయసు పైబడిన వారిలో 60 శాతం మంది టెక్నాలజీకి సంబంధించిన అంశాలను నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుసుకుంది. వీటి గురించి వారు ఇతరులపై ఆధారపడకూడదని భావించింది. ఈ క్రమంలోనే ‘ది సోషల్ పాఠశాల’ను ప్రారంభించింది.
నిరాశ నుంచి ఆశలోకి..
‘ది సోషల్ పాఠశాల’ ప్రారంభించిన తర్వాత మహిమ ప్రచారం కోసం కరపత్రాలు పంచింది. అయితే అంతగా స్పందన రాలేదు. కేవలం ఐదుగురు మాత్రమే స్పందించగా ఇద్దరు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. దాంతో మహిమ కూడా నిరాశ చెంది తన ప్రయత్నానికి విరామం ఇచ్చింది. తర్వాత తన పాత పనులతో బిజీ అయిపోయింది. దీని తర్వాత కొన్ని రోజుల్లోనే కరోనా మహమ్మారి అడుగుపెట్టడంతో అందరిలాగే మహిమ కూడా ఇంటికే పరిమితమైంది. ఈసారి తన బాస్‌కు ఎదురైన సంఘటనే మహిమకు ఎదురైంది. కరోనా సమయంలో బంధువులతో మాట్లాడానికి వాళ్ల అమ్మగారు జూమ్, వాట్సప్ వీడియో కాల్ గురించి ఆమెను పదే పదే అడిగిందట. అది గమనించిన మహిమ కరోనా సమయంలో ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారని గ్రహించింది. దాంతో ఇంతకుముందు ప్రారంభించిన ‘ది సోషల్ పాఠశాల’ మీద తిరిగి దృష్టి పెట్టింది.
ఫోన్ కాల్స్ వెల్లువ...!
ఈసారి మహిమ తన మార్కెటింగ్ నైపుణ్యాలకు పదును పెట్టింది. వయసు పైబడిన వారు వార్తాపేపర్లు ఎక్కువగా చదువుతారని గమనించింది. ఈ క్రమంలోనే స్థానిక న్యూస్‌పేపర్‌లో ‘ది సోషల్ పాఠశాల’కు సంబంధించిన ప్రకటన ఇచ్చింది. తెల్లారి లేచేసరికి ఆమెకు ఫోన్ కాల్స్ వెల్లువలా వచ్చాయి. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. మహిమ దగ్గర మొదట శిక్షణ తీసుకున్న వ్యక్తి 67 ఏళ్ల వయసున్న ఒక న్యాయవాది. ‘ఆయన తన జీవితాంతం ఇతరుల అవసరం లేకుండా స్వతంత్రంగా జీవించారు. అయితే కరోనా సమయంలో తన మనవడికి బహుమతి ఇవ్వడంలో పలు సమస్యలను ఎదుర్కొన్నారు. ఆన్‌లైన్ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డు వాడడం చాలా రిస్క్ అన్నారు. ఆయనకు ఆన్‌లైన్ షాపింగ్ గురించి అవగాహన కలిగించడానికి ఐదు రోజుల సమయం పట్టింది’ అని తన మొదటి అనుభవాన్ని చెప్పుకొచ్చింది మహిమ.
వాటి గురించి నేర్పిస్తోంది..
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 5000 మంది వయసు పైబడిన వారికి వివిధ రకాల యాప్స్, టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై శిక్షణ ఇచ్చింది మహిమ. ఇందులో వివిధ రంగాల్లో మంచి హాదాల్లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. వివిధ సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం, ఆన్‌లైన్‌లో కావాల్సిన వాటిని బుక్ చేసుకోవడం, ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు జూమ్, వాట్సప్.. వంటి పలు అప్లికేషన్లను ఎలా ఉపయోగించాలో మహిమ ఈ పాఠశాల ద్వారా పెద్దవారికి శిక్షణ ఇస్తోంది. ఈ రోజుల్లో టెక్నాలజీని ఎంత ఉపయోగిస్తున్నారో అంతే స్థాయిలో ఆన్‌లైన్ నేరాలూ పెరిగిపోతున్నాయి. వయసు పైబడిన వారే ఎక్కువ బాధితులుగా ఉంటున్నారు. తన దగ్గరికి వచ్చే వారిలో కూడా వీటి గురించే ఎక్కువగా అడుగుతున్నారని అంటోంది మహిమ. ‘దీనికి ప్రధాన కారణం ఆయా అంశాలపై వారికి సరైన అవగాహన లేకపోవడమే. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారికి వీటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా’ అని చెబుతోంది.
<
ఈ క్రమంలో ‘వయసు పైబడిన వారికి టెక్నాలజీ గురించి ఎందుకు?’, ‘వారికి చాదస్తం ఎక్కువ.. వారికి ఎలా శిక్షణ ఇస్తున్నావు?’ వంటి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి మహిమకు. కానీ ఆమె మాత్రం వాటిని లెక్క చేయకుండా ‘ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి’ అని గాంధీజీ చెప్పిన మాటలను ఫాలో అవుతోంది. ‘ది సోషల్ పాఠశాల’ ద్వారా వయసు పైబడిన వారికి మరిన్ని కొత్త అంశాలను నేర్పించడానికి సిద్ధమవుతోంది. మరి ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుదామా?
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.