ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్లూ ఆర్‌ఏఎస్ ఆఫీసర్లే!

ఒక ఆడపిల్ల పుడితేనే గుండెల మీద కుంపటిలా భావించే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అలాంటిది ఆ పేద రైతు దంపతులకు ఏకంగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. అయినా రెక్కలు ముక్కలు చేసుకుని అందరినీ పాఠశాలకు పంపించారు. పేరెంట్స్‌ కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నత చదువులు అభ్యసించారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించారు. తమ తల్లిదండ్రులకు కుమారులు లేని లోటు కనపడనీయకుండా చేశారు.

Updated : 15 Jul 2021 19:09 IST

Photo: Twitter

ఒక ఆడపిల్ల పుడితేనే గుండెల మీద కుంపటిలా భావించే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అలాంటిది ఆ పేద రైతు దంపతులకు ఏకంగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. అయినా రెక్కలు ముక్కలు చేసుకుని అందరినీ పాఠశాలకు పంపించారు. పేరెంట్స్‌ కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నత చదువులు అభ్యసించారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించారు. తమ తల్లిదండ్రులకు కుమారులు లేని లోటు కనపడనీయకుండా చేశారు.

ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి!

మన ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమొస్తేనే సంబరాలు చేసుకుంటాం. అలాంటిది ఒకేసారి ముగ్గురికి, అది కూడా గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం వస్తే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే తేలియాడుతోంది రాజస్థాన్‌లోని భైరుసరి గ్రామానికి చెందిన సహదేవ్‌ సహరన్‌ కుటుంబం. 2018లో నిర్వహించిన రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో సహదేవ్‌ ముగ్గురు కూతుళ్లు అన్షు, రీతు, సుమన్‌లు ఏకకాలంలో ఆర్‌ఏఎస్‌(రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌)కు ఎంపికయ్యారు. ఇతని పెద్ద కుమార్తెలు రోమా, మంజులు ఇప్పటికే ఆర్‌ఏఎస్‌ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఏఎస్‌కు ఎంపికవ్వడంతో సహదేవ్‌ కుటుంబంతో పాటు భైరుసరి గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఐదుగురూ ఆర్‌ఏఎస్‌ ఆఫీసర్లే!

సహదేవ్‌ సహరన్‌ కేవలం 8వ తరగతి వరకే చదువుకున్నారు. ఆయన సతీమణి లక్ష్మి పూర్తిగా నిరక్షరాస్యురాలు. పొలం పనులు చేసుకునే ఈ దంపతులు తమకు పుట్టిన ఐదుగురు కూతుళ్లను కొడుకులుగా పెంచారు. వారికెలాంటి లోటు రానీయకుండా ఉన్నత చదువులు చదివించారు. ఆ దంపతుల రెక్కల కష్టం ఊరికే పోలేదు. ఆయన పెద్ద కూతుళ్లు రోమా, మంజులు కొన్నేళ్ల క్రితమే ఆర్‌ఏఎస్‌ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. తాజాగా విడుదలైన ఆర్‌ఏఎస్ ఫలితాల్లో మిగతా ముగ్గురు కుమార్తెలు కూడా ఉత్తీర్ణులయ్యారు.

‘ఇలా ఏక కాలంలో ముగ్గురం ఆర్‌ఏఎస్‌కు ఎంపికవ్వడం ఎంతో సంతోషాన్నిస్తోంది. అమ్మానాన్నలు మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. వారితో పాటు అమ్మమ్మ సుందర్‌ దేవి, టీచర్ల సహకారంతోనే మేం ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులమయ్యాం. మా సక్సెస్‌ క్రెడిట్‌ వీరికే చెందుతుంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారీ త్రీ సిస్టర్స్.

వారి పేరెంట్స్‌ను గర్వపడేలా చేశారు!

ఈ నేపథ్యంలో ప్రముఖ ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి పర్వీన్‌ కాశ్వాన్‌ ఆర్‌ఏఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ‘నిజంగా ఇది శుభవార్తే. హనుమాన్‌ఘర్‌ జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు అన్షు, రీతు, సుమన్‌ ఒకేసారి ఆర్‌ఏఎస్‌కు ఎంపికయ్యారు. తద్వారా వారి తల్లిదండ్రులు, కుటుంబం గురించి అందరూ గొప్పగా చెప్పుకునేలా చేశారు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. చాలామంది నెటిజన్లు ముగ్గురు అక్కాచెల్లెళ్లను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్