Published : 02/01/2023 13:09 IST

Happy New Year: ఈ ‘30 రోజుల’ ఛాలెంజ్‌కి మీరు సిద్ధమేనా?

జంక్‌ఫుడ్‌ని దూరం పెట్టాలి.. రోజూ వ్యాయామాలు చేయాలి.. ఒత్తిడి తగ్గించుకోవాలి.. కొత్త సంవత్సరం వస్తోందంటే ఇలాంటి తీర్మానాలు తీసుకోవడం.. పనిలో పడిపోయి వాటిని వాయిదా వేయడం చాలామందికి అలవాటు! అయితే సవాలుగా తీసుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటున్నారు నిపుణులు. అందుకే అన్నీ ఒకేసారి చేయాలనుకోవడం కంటే.. ఒకదాని తర్వాత మరొకదాన్ని ఛాలెంజ్‌గా స్వీకరిస్తే అనుకున్న లక్ష్యాలను, నిర్దేశించుకున్న సమయానికి చేరుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో నెలకో ఛాలెంజ్ చొప్పున తీసుకోవడం మేలంటున్నారు. ఇంతకీ, ఏంటీ ‘30 రోజుల ఛాలెంజ్‌’? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

రోజుకో వ్యాయామం!

అనుకున్న పని సమయానికి పూర్తి కాకపోతే డీలా పడిపోతుంటారు చాలామంది. బరువు తగ్గే విషయంలోనూ ఈ నిరుత్సాహం ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని ఏడాది ఆరంభంలో సంకల్పించుకున్న వారు లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంతో దాన్ని అక్కడే వదిలేస్తుంటారు. అయితే అన్ని తీర్మానాలు ఒకేసారి అమలు చేయాలనుకోవడం వల్లే పూర్తిగా ఏ పని పైనా దృష్టి పెట్టలేకపోతారని చెబుతున్నారు నిపుణులు. మరి, ఈసారి అలా జరగకుండా ఉండాలంటే.. ఒక నెల పాటు పూర్తిగా వ్యాయామం పైనే దృష్టి పెట్టమంటున్నారు. ఈ క్రమంలో రోజూ గంట పాటు రోజుకో వ్యాయామం చొప్పున సాధన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక రోజు ప్లాంక్‌ వ్యాయామాలు చేస్తే, మరొక రోజు పుషప్స్‌, ఇంకో రోజు యోగా, ధ్యానం.. ఇలా సాధన చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. బరువు తగ్గడమనేది శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది. ఈ క్రమంలో అందరికీ అన్ని వ్యాయామాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి కొత్తగా 30 రోజుల ప్రణాళిక వేసుకోవాలనుకునే వారు ముందు ఓసారి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే మీ బరువులో తేడాలున్నాయో లేదో వారానికోసారి చెక్‌ చేసుకొని నోట్‌ చేసుకోవడం మర్చిపోవద్దు.

రోజుకో వెరైటీ!

ఒక్కోసారి మన వంట మనకే బోర్ కొట్టేస్తుంది. అందుకే కొత్తగా ట్రై చేయమంటున్నారు నిపుణులు. ఇంట్లోనే కొత్త వెరైటీలు ట్రై చేస్తే రోజుకో రుచిని ఆస్వాదించచ్చు.. పైగా వీటిలోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. ఈ క్రమంలో వంట పని మొత్తం మీపైనే పడకుండా మీవారికి, మీ పిల్లలకు తలా కొంత పంచచ్చు.. తద్వారా స్పెషల్‌ రెసిపీ తయారుచేసినా పెద్ద పని అనిపించదు. అలాగే కొన్ని ప్రత్యేక వంటకాలు చేయడంలో మీ భాగస్వామి సిద్ధహస్తులైతే వాటి తయారీని వారికే అప్పగించండి. ఇలా 30 రోజులు 30 రకాల వంటకాల్ని ఆస్వాదించారంటే.. బయటి ఫుడ్‌కి బై బై చెప్పడం ఖాయం!

ప్రశాంతతే పరమావధి!

‘మానసిక ప్రశాంతత ముందు అన్నీ దిగదుడుపే’ అని తెలిసినా.. కొన్ని విషయాల్లో అనవసరంగా టెన్షన్‌ పడుతుంటాం. ఉన్న ప్రశాంతత కోల్పోతుంటాం. దీని ప్రభావం అప్పటికప్పుడు తెలియకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో వివిధ రకాల అనారోగ్యాలకు, మానసిక సమస్యలకు ఇదే మూలమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఒత్తిళ్లు, ఆందోళనలకు దూరంగా ఉండేందుకు.. నచ్చిన అలవాట్లకు, వ్యక్తులకు దగ్గరవ్వమంటున్నారు. ఈక్రమంలో రోజుకో గంట చొప్పున మనసుకు నచ్చిన పని చేస్తే చాలు. అంటే.. ఒక రోజు మీకు నచ్చిన పుస్తకం చదవడం, మరో రోజు పాటలు వినడం, ఇంకో రోజు ఇష్టమైన వారితో సమయం గడపడం, నచ్చిన ఆహారం తీసుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఆప్షన్లుంటాయి. వీటితో 30 రోజులేంటి..? ఏడాదంతా హ్యాపీగా ఉండచ్చు.. ఏమంటారు?!

కెరీర్‌పై గురి!

వ్యక్తిగతంగానే కాదు.. వృత్తిపరమైన లక్ష్యాలను నిర్దేశించుకునే వారూ ఎంతోమంది! అయితే వాటిని చేరుకోవడంలో సృజనాత్మకతదే పెద్ద పీట అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరున్న ఉద్యోగానికే పరిమితం కాకుండా చుట్టూ జరిగే విషయాలపై పట్టు సాధించాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, క్రియేటివిటీని పెంచుకోవడానికి ఆసక్తి చూపించాలి. ఎందుకంటే మన వృత్తి నైపుణ్యాలను ఏ రోజుకారోజు కొత్తగా చూపించుకుంటేనే కెరీర్‌లో ఎదగగలం! కాబట్టి ఇందుకోసం పుస్తకాలు చదవడం, సక్సెస్‌తో సంబంధం లేకుండా సమస్యకు వివిధ రకాల పరిష్కారాలు కనుక్కోవడం, బుర్రకు పదును పెట్టే ఆటలాడడం, పజిల్స్‌ పరిష్కరించడం, ఒక అంశాన్ని తీసుకొని వాటిపై కార్టూన్లు గీయడం, డూడుల్స్‌ రూపొందించడం, బొమ్మలేయడం.. ఇవన్నీ మనలోని సృజనను పెంచే మార్గాలే! కాబట్టి వీటిని రోజుకొకటి చొప్పున నెల రోజుల పాటు చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. ఇక ఇదే క్రియేటివిటీని పనిలో చూపించామంటే కెరీర్‌లోనూ దూసుకుపోవచ్చు.

బంధానికి అన్యోన్యతే బలం!

‘సంసారమన్నాక సవాలక్ష గొడవలుంటాయి.. అంతమాత్రానికే విడాకులంటే ఎలా?’ అంటుంటారు పెద్దలు. అయితే వివాహమంటే మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోతున్న ఈ రోజుల్లో.. కలతల్లేకుండా కలకాలం కలిసుండేలా ప్రతి జంటా కొత్త తీర్మానాలు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనూ 30 రోజుల ఛాలెంజ్‌ను స్వీకరించమంటున్నారు. ఇందులో భాగంగానే.. ఓ రోజు ఇద్దరూ కలిసి అలా వాకింగ్‌కి వెళ్లడం/వ్యాయామాలు చేయడం, మరో రోజు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వివిధ మార్గాల ద్వారా వ్యక్తపరచుకోవడం, వారాంతాల్లో రొమాంటిక్‌ డేట్‌ నైట్స్‌, ఇంకో రోజు లాంగ్‌ డ్రైవ్.. ఇలా ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలు దంపతుల మధ్య గొడవల్ని తగ్గించి సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలంటే ఇదే కీలకం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్న ఒత్తిళ్ల నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.

కొత్త ఏడాది మీరు ఎలాంటి తీర్మానం తీసుకున్నా.. ముందు ఇలా నెల రోజుల పాటు వాటిని సవాలుగా స్వీకరించి.. కచ్చితంగా చేయాలన్న నియమం పెట్టుకోండి.. తప్పకుండా లక్ష్యానికి చేరువవుతారు. అంతేకాదు.. ఇకపైనా వీటినే కొనసాగిస్తూ చక్కటి జీవనశైలికి అలవాటుపడతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని