Published : 03/02/2022 19:23 IST

శక్తినిచ్చే ఈ అయిదు పదార్ధాలూ మీ డైట్ లో ఉన్నాయా?

కరోనా మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో కీడు చేస్తున్నా.. టెక్నాలజీ విషయంలో మాత్రం మనల్ని ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ లేని సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. అలాగే విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు అందుబాటులోకొచ్చాయి. అయితే ఇంటి నుంచే పని చేస్తున్నా, క్లాసులకు హాజరవుతున్నా- తీసుకునే ఆహారం విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ క్రమంలో- ఐదు రకాల పదార్థాలను రోజూ తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఏంటా పదార్థాలు? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? రండి తెలుసుకుందాం..!

ఆరోగ్యానికి ‘ఐదు’ చిట్కాలు!

1. తాజా పండు

అరటి మొదలైన పండ్లతో చేసిన మిల్క్‌షేక్‌ తీసుకోవాలి. దీన్ని భోజన సమయంలో తీసుకోవచ్చు. లేదా పోహా/ఉప్మా/ఇడ్లీ/దోసె.. ఇలా వీటిలో ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తీసుకోవచ్చు.

ఎందుకు తీసుకోవాలి? 

పండ్లలో విటమిన్లు, పాలీఫినోల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీర్ణశక్తి మెరుగుపడేందుకు దోహదం చేస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. జంక్‌ఫుడ్‌ తినాలన్న కోరికను తగ్గిస్తాయి.

2. భోజనానికి పప్పన్నం

శెనగలు/రాజ్మా/కాబూలీ శెనగలు/పెసలు.. వంటి ధాన్యాలను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు వాటితో కూర చేసుకొని భోజన సమయంలో అన్నంతో పాటు తీసుకోవాలి. ఆపై గ్లాసు మజ్జిగ తాగాలి.

ఎందుకు తీసుకోవాలి?

ప్రి-బయోటిక్‌, ప్రొ-బయోటిక్‌, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు.. వంటి పోషకాలన్నీ ఈ పదార్థాల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటన్నింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

3. పెరుగు-ఎండుద్రాక్ష

రోజులో ఏదో ఒక సమయంలో కప్పు పెరుగు, కొన్ని నల్ల ఎండుద్రాక్ష తీసుకోవాలి.

ఎందుకు తీసుకోవాలి?

బి12, ఐరన్‌ పుష్కలంగా లభించే ఈ పదార్థాలు బద్ధకాన్ని దరిచేరనివ్వవు. అలాగే ఆకలిని, శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయి. అంతేకాదు.. హార్మోన్ల ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం.

4. డిన్నర్‌ కోసం...

రాత్రి 7 గంటల్లోపే భోంచేసేయాలి. పనీర్‌ పరాఠా/పూరీ సబ్జీ (సబ్జీ అంటే కాయగూరలన్నీ కలిపి తయారుచేసే కూర)/రోటీ సబ్జీ రోల్‌/వాము పరాఠా/జొన్న రొట్టె ఆలూ కర్రీతో కలిపి తీసుకోవాలి/వెజ్‌ పులావ్‌-రైతా/ఇంట్లో తయారుచేసిన అప్పడాలు.. ఇలా వీటిలో ఏదైనా మీరు భోజనం సమయంలో తీసుకోవచ్చు.

ఎందుకు తీసుకోవాలి?

ఇలాంటి ఆరోగ్యకరమైన ఇంటి భోజనంతో మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఇక వారానికోసారి ఇంట్లోనే తయారుచేసిన పిజ్జా/పాస్తా/పావ్‌ భాజీ.. ఇలా మీకు నచ్చిన ఆహార పదార్థమేదైనా తీసుకోవచ్చు.. అది కూడా ఇంట్లో తయారుచేసుకోవడంతో పాటు రాత్రి ఏడింటి లోపే తినేయడం మంచిదన్న విషయం గుర్తుపెట్టుకోండి.

5. పడుకునే ముందు..

రాత్రి 7 గంటల్లోపే భోజనం చేసేయడం వల్ల రాత్రి పడుకునే ముందు ఆకలేస్తుంటుంది. అలాంటప్పుడు పసుపు కలిపిన పాలు/ మిల్క్‌షేక్/ అరటిపండు.. ఇలా ఏదో ఒకటి తీసుకోవాలి.

ఎందుకు తీసుకోవాలి?

ఇవి తీసుకోవడం వల్ల రాత్రుళ్లు చక్కగా నిద్ర పడుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని