Smriti-Palash: ఆ కొంటె నవ్వుకే పడిపోయాడా?!

‘అందగాడు, మనసున్న వాడు.. అంతకుమించి తన కెరీర్‌ను గౌరవించి తనను ప్రోత్సహించే వాడినే పెళ్లాడతానం’టూ ఓ సందర్భంలో పంచుకుంది భారత డ్యాషింగ్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన. అయితే అలాంటి వాడు దొరికేశాడంటూ సోషల్ మీడియాలో ఇటీవలే అఫీషియల్‌గా ఒప్పేసుకుంది స్మృతి.

Published : 09 Jul 2024 18:34 IST

(Photos: Instagram)

‘అందగాడు, మనసున్న వాడు.. అంతకుమించి తన కెరీర్‌ను గౌరవించి తనను ప్రోత్సహించే వాడినే పెళ్లాడతానం’టూ ఓ సందర్భంలో పంచుకుంది భారత డ్యాషింగ్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన. అయితే అలాంటి వాడు దొరికేశాడంటూ సోషల్ మీడియాలో ఇటీవలే అఫీషియల్‌గా ఒప్పేసుకుంది స్మృతి. ఇంతకీ ఎవరా లక్కీ బాయ్‌ అని వెతికే క్రమంలో.. ‘ఈడూ-జోడూ’ కలిసిన ఈ ముచ్చటైన జంటను చూసి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ ఈ క్యూట్‌ పెయిర్ను అభినందిస్తున్నారు. మరి, స్మృతి మనసు దోచిన ఆ సోగ్గాడు మరెవరో కాదు.. బాలీవుడ్‌ యువ మ్యూజిక్‌ కంపోజర్‌ పలాశ్‌ ముచ్చల్‌. ప్రస్తుతం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారిన వీళ్ల ప్రేమ కబుర్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

స్మృతీ మంధాన.. తన ఆటతీరుతోనే కాదు.. అందంతోనూ కుర్రకారును కట్టిపడేస్తుందీ స్టార్‌ క్రికెటర్‌. ముఖ్యంగా తన కొంటె నవ్వుతో ఎంతోమంది హృదయాల్ని కొల్లగొడుతుంటుంది. ఈ నవ్వే బాలీవుడ్‌ యువ మ్యూజిక్‌ కంపోజర్‌ పలాశ్‌ ముచ్చల్‌నూ ఫిదా చేసేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా తమ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ తాజాగా ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా తమ అనుబంధాన్ని బయటపెట్టింది.

చెప్పకనే చెప్పేశారా?

బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ సింగర్‌ పలక్‌ ముచ్చల్‌ గురించి తెలియని వారుండరు. ఆమె తమ్ముడే మన స్మృతిని వలచిన పలాశ్‌ ముచ్చల్‌. అక్క అడుగు జాడల్లో నడుస్తూ.. తాను సైతం సంగీతం వైపు వడివడిగా అడుగులేస్తోన్న ఈ హ్యాండ్‌సమ్‌.. మ్యూజిక్‌ కంపోజర్‌గా, నటుడిగా ఇప్పటికే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. టీ-సిరీస్‌, జీ-మ్యూజిక్‌ కోసం పలు మ్యూజిక్‌ వీడియోలు రూపొందించాడు పలాశ్‌. ఆశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో, అభిషేక్‌ బచ్చన్‌-దీపికా పదుకొణె కలిసి నటించిన ‘ఖేలే హమ్‌ జీ జాన్‌ సే’ అనే సినిమాలోనూ నటించాడీ యువ కంపోజర్‌. అలాగే రిక్షా అనే వెబ్‌సిరీస్‌కు, అర్ధ్‌ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. అందం, అణకువ, కెరీర్‌లో తనకు ఏమాత్రం తీసిపోని పలాశ్‌తో ఐదేళ్ల క్రితం ప్రేమలో పడిపోయింది స్మృతి. అయితే ఇన్నాళ్లూ తమ అనుబంధం గురించి తమంతట తాముగా పంచుకోని ఈ జంట.. ఇటీవలే తమ ఐదేళ్ల ప్రేమ బంధాన్ని సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టింది. ఇద్దరూ కలిసి కేక్‌ కట్‌ చేస్తోన్న ఫొటోను పంచుకుంటూ.. ‘#5, లవ్‌ సింబల్‌’తో తమ ప్రేమకు ఐదేళ్లు నిండాయంటూ పరోక్షంగా బహిర్గతం చేసిందీ ముద్దుల జంట. ఈ పోస్ట్‌పై పలాశ్‌ సోదరి పలక్‌ ముచ్చల్‌ స్పందిస్తూ.. ‘క్యూటీస్’ అని కామెంట్‌ చేసింది. మరికొందరు సెలబ్రిటీలు కూడా ‘మేడ్ ఫర్‌ ఈచ్‌ అదర్‌.. ఇద్దరి జోడీ కుదిరింది’ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో వీళ్ల ప్రేమ కబుర్లు, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఫొటోలో దాగున్న ప్రేమ!

స్మృతీ-పలాశ్‌ కలిసి దిగిన ఫొటోను ఈ జంట తాజాగా బయటపెట్టడం, తమది ఐదేళ్ల ప్రేమ అని బహిర్గతం చేయడంతో.. వీళ్ల లవ్‌ మ్యాటర్‌ గురించి చాలామందికి తెలిసింది! కానీ గత కొన్నేళ్ల నుంచే ఈ జంట డేటింగ్‌లో ఉందని రూమర్స్ వినిపించాయి. ఇందుకు కారణం.. గతంలోనూ పలు సందర్భాల్లో వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరలవడమే!

⚛ ఓ సందర్భంలో స్మృతి తన వద్ద పియానో పాఠాలు నేర్చుకునే వీడియోను పోస్ట్‌ చేసిన పలాశ్‌.. ‘నా కొత్త స్టూడెంట్‌’ అంటూ ఆమెను అందరికీ పరిచయం చేశాడు.

⚛ ఇక మరో సందర్భంలో గిటార్‌ వాయిస్తూ.. నునువెచ్చని సంగీతంతో తన నెచ్చెలికి ప్రేమ సందేశం అందించాడు పలాశ్.

⚛ ‘నాకు తెలిసిన అందమైన, బలమైన అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు!’ అంటూ బర్త్‌డే విషెస్‌ చెబుతూ.. ఇద్దరూ కలిసి దిగిన మరో క్యూట్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.

⚛ ఇక ఈ ఏడాది మహిళల ఐపీఎల్‌ గెలిచిన ‘రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు’ కెప్టెన్‌ అయిన తన ప్రేయసి స్మృతితో కలిసి క్రికెట్‌ మైదానంలోనే సంబరాలు చేసుకున్నాడీ హ్యాండ్‌సమ్‌ లవర్‌. ఈ ఫొటో కూడా అప్పట్లో తెగ వైరలైంది.

⚛ అంతేకాదు.. మొన్నామధ్య జరిగిన యాషెస్‌ సిరీస్‌నూ కలిసే తిలకించిందీ అందాల జంట.

ఇవే కాదు.. పుట్టినరోజులు, పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్నీ కలిసి జరుపుకొన్న వీళ్లిద్దరూ ఆ మెమరీస్‌నీ ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకుంటూ మురిసిపోయారు. ఇలా ఫొటోలన్నీ పలాశ్‌వేనా? ప్రేమంతా అతడిదేనా? అంటే.. కాదనే చెప్పాలి. మన స్మృతి కూడా ప్రతి సందర్భాన్నీ తన ఇష్టసఖుడితో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటూ.. అతడిపై తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ వచ్చింది. ఇలా ఈ ఐదేళ్లలో వీళ్ల ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఫొటోలు, వీడియోలు, సోషల్‌ మీడియా సందేశాలెన్నో!


అక్క సమక్షంలోనే..!

‘నీపై నా మనసులో ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలిసేలా అరచి చెప్తా..’ అంటాడు ఓ సినిమాలో యువ హీరో. పలాశ్‌ కూడా తన ప్రేమ ప్రపోజల్‌ విషయంలో ఇదే ట్రెండ్‌ని ఫాలో అయిపోయాడట! ఓసారి తన అక్క పలక్‌తో కలిసి ఓ పబ్లిక్‌ ఈవెంట్‌కు హాజరైంది ఈ జంట. దాంతో అక్కడే మంచి సమయం చూసుకొని.. అక్క పలక్‌ సాక్షిగా ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని స్మృతిని క్యూట్‌గా అడిగేశాడట పలాశ్‌. ఇలా నిర్భయంగా తన ప్రేమను బయటపెట్టిన అబ్బాయికి ఏ అమ్మాయీ నో చెప్పలేదు కదూ.. స్మృతి కూడా అంతే! వెంటనే ఓకే చెప్పేసి.. రొమాంటిక్‌గా ఓ హగ్గు కూడా ఇచ్చిందట! ఇలా ‘తమ లవ్‌ ప్రపోజల్‌ తన జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతుందం’టూ ఓ సందర్భంలో చెబుతూ సిగ్గుపడిపోయింది స్మృతి. నిజానికి ఇలా వీళ్ల ప్రేమ గురించి తెలియడం మనకు కొత్త కావచ్చు.. కానీ ఇదివరకే ఈ విషయం తెలుసుకున్న భారత మహిళల జట్టు.. అప్పుడప్పుడూ సరదాగా ఈ జంటను ఆటపట్టిస్తుందట!

ఏదేమైనా నచ్చిన వాడు, అర్థం చేసుకొనే వాడు దొరకడం అదృష్టమంటారు. తాను కావాలనుకున్న లక్షణాలన్నీ ఉన్న అబ్బాయితో ప్రేమలో పడడంతో ‘స్మృతి.. లక్కీ గర్ల్‌!’ అంటున్నారు నెటిజన్లు.

కంగ్రాట్స్‌ లవ్ బర్డ్స్!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్