ఆరేళ్ల వయసులోనే వీడియో గేమ్ రూపొందించి..!
ఈ రోజుల్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్ పట్టుకున్నారంటే వదలడం లేదు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ, వీడియో గేమ్‌లు ఆడుతూ ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతున్నారు. వీరిని ఫోన్ నుంచి దూరం చేసి చదువుపై దృష్టి పెట్టేలా చేయడం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతోంది.
ఈ రోజుల్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్ పట్టుకున్నారంటే వదలడం లేదు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ, వీడియో గేమ్‌లు ఆడుతూ ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతున్నారు. వీరిని ఫోన్ నుంచి దూరం చేసి చదువుపై దృష్టి పెట్టేలా చేయడం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతోంది. అయితే కెనడాకు చెందిన ఆరేళ్ల సిమర్ ఖురానా మాత్రం ఇందుకు భిన్నం. తను స్మార్ట్‌ఫోన్లతో ఆటలు ఆడుకోకుండా ఏకంగా ఓ వీడియో గేమ్‌నే తయారు చేసింది. అంతేకాకుండా చిన్న వయసులోనే ‘వీడియో గేమ్ డెవలపర్’గా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో ఈ చిన్నారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...
ఎవరూ చేర్చుకోలేదు..!
సిమర్కు చిన్నప్పట్నుంచే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమట. అది ఎంతలా అంటే తనకంటే ఎక్కువ గ్రేడ్ చదువుతోన్న విద్యార్థులతో పోటీ పడేంతగా!
‘యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ సిమర్ సొంతంగా మ్యాథ్స్ చేయడం నేర్చుకుంది. తనకంటే ఎక్కువ గ్రేడ్ పిల్లలతో పోటీ పడి మ్యాథ్స్ చేసేది. సిమర్ ఆలోచనా విధానం కూడా వినూత్నంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న వస్తువులతో వివిధ రకాల బొమ్మలు చేస్తుంటుంది. చిన్నప్పట్నుంచే మ్యాథ్స్ బాగా చేయడం, వినూత్నంగా ఆలోచించడంతో ఆమెకు కోడింగ్‌లో శిక్షణ ఇప్పించాలనుకున్నాం. అలా ఒకసారి డెమో క్లాస్‌కు పంపించాం. అది తనకు బాగా నచ్చింది. దాంతో కోడింగ్‌లో శిక్షణ ఇప్పించాం. అయితే అది అంత సులభంగా జరగలేదు. ఎందుకంటే ఆరేళ్ల అమ్మాయికి కోడింగ్ నైపుణ్యాలు అర్థం కావని చాలామంది చేర్చుకోలేదు’ అంటారు సిమర్ తల్లిదండ్రులు.
నాలుగు నెలల్లోనే..
సిమర్‌కు కోడింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోయినా తన పేరెంట్స్ మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. చివరకు ఒక టీచర్ కోడింగ్ నేర్పించడానికి ముందుకు రావడంతో సిమర్ కోడింగ్ ప్రయాణం మొదలైంది.
‘తరగతులు ప్రారంభమైన కొద్దిరోజులకే సిమర్ కోడింగ్‌లో పట్టు సాధించింది. ఆ తర్వాత తనే సొంతంగా ఒక వీడియో గేమ్‌ను డెవలప్ చేయడం ప్రారంభించింది. దాంతో ఈ వయసులో ఎవరైనా డెవలపర్‌గా ‘వరల్డ్ రికార్డ్ సాధించారా?’ అని శోధించాం. అయితే ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాలంటే సిమర్ వయసును బట్టి ఆ ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేయాలని తెలిసింది. ఆ విషయాన్ని సిమర్‌కు చెబితే ‘నేను వరల్డ్ రికార్డ్’ కచ్చితంగా సాధిస్తానని మాకు చెప్పింది. అయితే సమయం తక్కువగా ఉండడంతో తనకు మరింత సహకారం అవసరమనిపించింది. అందుకోసం తనకు ఎక్కువ తరగతులు బోధించేలా చేశాం. సిమర్ బాగా కష్టపడింది. రోజుకు రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేసి నాలుగు నెలల్లోనే తన ప్రాజెక్టును పూర్తి చేసింది. ఈ క్రమంలో చిన్న వయసులోనే ‘వీడియో గేమ్ డెవలపర్’గా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. ఇందుకు చాలా గర్వంగా ఉంది’ అంటున్నారు సిమర్ తల్లిదండ్రులు.
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలంటూ..
ఓ రోజు డాక్టర్ సిమర్‌కు, తన సోదరికి ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన కల్పించింది. దాంతో జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుంది. ఈ రోజుల్లో పెద్దలు కూడా జంక్‌ఫుడ్‌కు అలవాటు పడుతుంటే సిమర్ మాత్రం ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటానని చెబుతోంది. వాటి గురించి ఇతరులకు కూడా తెలియజేయాలని భావించింది. ఆ ఆలోచనే తన వీడియో గేమ్‌కు (Healthy Food Challenge) ప్రేరణగా నిలిచిందంటోంది సిమర్. ఈ క్రమంలో అందరూ జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలని తన వీడియో గేమ్ ద్వారా సూచిస్తోంది. కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా సిమర్‌కు జిమ్నాస్టిక్స్, డ్యాన్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. అంతేకాకుండా ‘సిమర్స్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌నూ నిర్వహిస్తోంది. చిన్న వయసులోనే ఇన్ని రకాల నైపుణ్యాలతో గిన్నిస్ రికార్డ్ సాధించిన సిమర్‌కు కంగ్రాట్స్ చెప్పేద్దామా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.