ఆరేళ్లకే అమ్మతో కలిసి ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ చేరింది!

వయసుతో సంబంధం లేకుండా అసాధ్యాల్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు ఈ కాలపు పిల్లలు. అనితర సాధ్యమైన రికార్డుల్ని తమ పేరిట లిఖించుకుంటున్నారు. పుణేకు చెందిన ఆరేళ్ల అరిష్కా లద్దా ఈ కోవకే....

Published : 06 May 2023 12:39 IST

(Photos: Instagram)

వయసుతో సంబంధం లేకుండా అసాధ్యాల్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు ఈ కాలపు పిల్లలు. అనితర సాధ్యమైన రికార్డుల్ని తమ పేరిట లిఖించుకుంటున్నారు. పుణేకు చెందిన ఆరేళ్ల అరిష్కా లద్దా ఈ కోవకే చెందుతుంది. తన తల్లితో కలిసి ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ దాకా చేరుకొని.. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న భారతీయ బాలికగా చరిత్రకెక్కింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పసి వయసు నుంచే సాహసాలు చేయడం అలవాటు చేసుకున్న అరిష్క.. ప్రతికూల వాతావరణానికి ఎదురీదుతూ లక్ష్యాన్ని చేరుకోవడానికి పదిహేను రోజులు పట్టింది. అసలు ఈ సాహసం చేసే వయసు తనది కాకపోయినా.. రిస్క్‌ చేసి మరీ రికార్డు సృష్టించిన ఈ చిన్నారి భవిష్యత్తులో ఎవరెస్ట్‌ శిఖరాగ్రాన్ని చేరుకోవడమే తన లక్ష్యమంటోంది.

పుణేలోని కొత్రుడ్‌లో నివాసముంటోన్న అరిష్క.. ప్రస్తుతం అక్కడి ర్యాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌లో 2వ తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచి తను చదువులోనే కాదు.. ఇతర వ్యాపకాల్లోనూ చురుగ్గా ఉండేది. సాహసాల పైనా మక్కువ చూపేది. ఇది గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఈ చిన్నారిని సైక్లింగ్‌, ట్రెక్కింగ్‌, పరుగు.. వంటి అంశాల్లో ప్రోత్సహించడం ప్రారంభించారు. ఇక అరిష్క తల్లి డింపుల్‌కి కూడా పర్వతారోహణ అంటే మక్కువ. తన కూతురిని తీసుకొని వారాంతాల్లో పుణేలోని పలు కోటలు, కొండలు ఎక్కేదామె.

రిస్క్‌ చేద్దామనే..!

ఈ క్రమంలోనే తన కూతురితో కలిసి ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ వరకు చేరుకోవాలన్న ఆలోచన చేసింది డింపుల్. ‘నా ఆలోచనను ఇన్‌స్ట్రక్టర్‌తో పంచుకోగా ముందు వారించారు. కానీ ఆ తర్వాత నా సొంత రిస్క్‌పై తీసుకెళ్తానని చెప్పినప్పుడు ఒప్పుకున్నారు. పసి వయసు నుంచి నా కూతురు ఎంతో చురుకు. తన ఆసక్తి మేరకు ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌.. వంటి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాం. వారాంతాల్లో ఇద్దరం కలిసి ఇక్కడి కొండలు, కోటల్నీ ఎక్కుతుంటాం. అలా ఇక్కడి సింహగఢ్‌ కోటను పలుమార్లు అధిరోహించాం. ఇలా తనలో ఉన్న ఈ ఉత్సాహాన్ని ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ వరకు తీసుకెళ్లాలనుకున్నా. రిస్క్‌ అయినా జీవితంలో నా కూతురికి దీన్నో మధుర జ్ఞాపకంగా అందించాలనుకున్నా.. అనుకున్నట్లుగానే ఈ సాహసం సఫలమైంది..’ అంటోంది డింపుల్.

15 రోజులు.. 130 కిలోమీటర్లు..!

ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌కు చేరుకునే క్రమంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులుంటాయి. అక్కడి ఉష్ణోగ్రత -3 నుంచి -17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుంటుంది. ఇలా గడ్డ కట్టే చలిలో మనమే తట్టుకోలేం. అలాంటిది ఆరేళ్ల అరిష్క ఈ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ సముద్ర మట్టానికి సుమారు 17,500 అడుగుల (5,364 మీటర్ల)కు పైగా ఎత్తులో ఉండే బేస్‌క్యాంప్‌ వరకు తన తల్లితో కలిసి చేరుకుంది. ఈ క్రమంలో చలి నుంచి తట్టుకోవడానికి ఏడెనిమిది లేయర్ల దుస్తులు ధరించి, శరీరానికి శక్తినిచ్చే పదార్థాల్ని వెంట ఉంచుకొని మరీ నడక సాగించిందామె. ఇలా మొత్తమ్మీద 130 కిలోమీటర్ల దూరాన్ని 15 రోజుల్లో పూర్తిచేసి.. బేస్‌క్యాంప్‌ వద్ద జాతీయ పతాకం పట్టుకొని, తన తల్లితో ఫొటోలకు పోజిచ్చింది అరిష్క.

‘గడ్డకట్టే చలిలో, వెచ్చటి దుస్తులు ధరించి ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌కు చేరుకోవడం భలే సరదాగా అనిపించింది. నేను ఇప్పటివరకు చూడని కొన్ని జంతువులను ఈ ప్రయాణంలో ప్రత్యక్షంగా చూశాను. భవిష్యత్తులో తప్పకుండా ఎవరెస్ట్‌ శిఖరాగ్రాన్ని చేరుకుంటా..’ అంటూ తన ముద్దుముద్దు మాటలతో చెబుతోందీ చిన్నారి పర్వతారోహకురాలు. దేశంలోనే అతి పిన్న వయసులో ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ చేరిన బాలికగా రికార్డులకెక్కిన అరిష్క సాహసానికి ఆమె తల్లిదండ్రులు ఉప్పొంగిపోతున్నారు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ చిన్నారి పట్టుదలను కొనియాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్