63 ఏళ్ల వయసులోనూ.. 20 ఏళ్ల అమ్మాయిలా!

ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయసు పెరిగిపోతుందన్న చింతే ఎక్కువగా ఉంటుంది చాలామందికి! నిజానికి ఈ ఆలోచనే మనం నీరసించిపోయేలా చేస్తుందంటున్నారు సింగపూర్‌కు చెందిన జిమ్‌ ట్యాన్. అదే వయసును పట్టించుకోకుండా.. మన పని మనం చేసుకుపోతే మరింత ఉత్సాహంగా ముందుకు సాగచ్చని చెబుతున్నారు.

Updated : 19 Sep 2023 07:06 IST

(Photos: Instagram)

ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయసు పెరిగిపోతుందన్న చింతే ఎక్కువగా ఉంటుంది చాలామందికి! నిజానికి ఈ ఆలోచనే మనం నీరసించిపోయేలా చేస్తుందంటున్నారు సింగపూర్‌కు చెందిన జిమ్‌ ట్యాన్. అదే వయసును పట్టించుకోకుండా.. మన పని మనం చేసుకుపోతే మరింత ఉత్సాహంగా ముందుకు సాగచ్చని చెబుతున్నారు. ఇటీవలే 63వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ గ్రానీ.. ఈ వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిలా యాక్టివ్‌గా ఉంటారు.. తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో నవతరంతో పోటీ పడుతున్నారు కూడా! మరి, వయసుతో పాటే అందాన్ని, ఆరోగ్యాన్నీ పెంచుకుంటూ పోతోన్న జిమ్ తన ఆరోగ్య రహస్యాల గురించి ఇటీవలే సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

జిమ్‌ ట్యాన్‌ది సింగపూర్‌. పెళ్లయ్యాక భర్తతో కలిసి క్యాలిఫోర్నియా చేరిన ఆమె.. అప్పట్నుంచి ఇక్కడే నివసిస్తున్నారు. ఆమెకు చిన్నతనం నుంచే ఫ్యాషన్‌ రంగంపై మక్కువ ఎక్కువ. ఈ ఇష్టంతోనే ఇందులో పట్టు పెంచుకున్న ఆమె.. ఇదే రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించారు.

ఫ్యాషన్‌పై మక్కువతో..!

ఫ్యాషన్‌ రంగంలో 30 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం జిమ్‌ సొంతం. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే పలు ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్లతో కలిసి పనిచేసిన ఆమె.. సి-సూట్‌ ఎగ్జిక్యూటివ్‌గా, ఫ్యాషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా.. ఇలా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఈ రంగంలో పనిచేయడమే కాదు.. కొత్త ఫ్యాషన్లు ప్రయత్నించడానికీ ఇష్టపడుతుంటారు. ఈ మక్కువతోనే ఫ్యాషనబుల్‌గా ముస్తాబై.. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీనీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం 63 ఏళ్ల వయసున్న జిమ్.. తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో ఈ తరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ పాఠాలు కూడా నేర్పుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫ్యాషన్‌కు సంబంధించిన మెలకువలు కూడా అందిస్తున్నారు.
‘నా కూతురు మియా ప్రోత్సాహంతోనే నేను సోషల్‌మీడియాలోకొచ్చాను. తొలుత నేను ధరించిన ప్రతి అవుట్‌ఫిట్‌కు సంబంధించిన ఫొటోల్ని, నా ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని తను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్లు పెరగడం గమనించా. ఆ తర్వాత కొన్ని బ్రాండ్స్‌కి మోడలింగ్‌ చేస్తూ.. ఆ ఫొటోల్నీ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేదాన్ని. అలా తక్కువ సమయంలోనే నాకు లక్షల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది..’ అంటోన్న జిమ్‌.. 60 దాటినా ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ.. ‘వయసు కేవలం సంఖ్య మాత్రమే!’ అని నిరూపిస్తున్నారు.

వయసు గురించి ఆలోచించను!

కేవలం తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని సోషల్‌ మీడియాలో పంచుకోవడమే కాదు.. తన కూతురితో కలిసి దిగిన ఫొటోల్నీ పోస్ట్‌ చేస్తుంటారు జిమ్‌. ఇవి చూసిన వారంతా.. ‘ఈ వయసులోనూ అందం, ఆరోగ్యం, ఫ్యాషన్‌ అంశాల్లో కూతురితో సమానంగా పోటీ పడుతున్నారు..’ అంటూ నెటిజన్ల ప్రశంసలూ అందుకుంటున్నారామె. ఇక ఇటీవలే 63వ పుట్టినరోజు జరుపుకొన్న జిమ్‌.. తన ఆరోగ్యం, యాక్టివ్‌నెస్‌ సీక్రెట్స్‌ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నారు.

‘ఇటీవలే నాకు 63 ఏళ్లు నిండాయి. గతేడాది కంటే ఇప్పుడు మరింత యాక్టివ్‌గా, యవ్వనంగా కనిపిస్తున్నాననిపిస్తోంది. నిజానికి నేను వయసు గురించి ఆలోచించను. ఏళ్లు గడుస్తున్నాయి.. వృద్ధాప్యం దరిచేరుతుందన్న ఆందోళన అస్సలు ఉండదు. బహుశా.. ఈ పాజిటివిటీనే నన్ను వయసు పెరుగుతున్నా మరింత యవ్వనంగా, యాక్టివ్‌గా ఉంచుతుందేమో అనిపిస్తోంది.

ఇదే నా దినచర్య!

రోజూ పది కిలోమీటర్లు పరిగెత్తుతా.

ప్రతిపూటా భోజనంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాల్ని తీసుకుంటా. పండ్లు, కాయగూరలకే అధిక ప్రాధాన్యమిస్తా.

ఏడు గంటలు సుఖ నిద్రకు కేటాయిస్తా. ఖాళీగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటా.

బరువులెత్తే వ్యాయామాలు చేయడం నా వర్కవుట్‌ రొటీన్‌లో ఓ భాగం.

స్నేహితులతో గడపడం నాకిష్టం. అలాగే నా చుట్టూ పాజిటివిటీని, ప్రేమను పంచే వ్యక్తులుండేలా జాగ్రత్తపడతా..’ ఇలా నేను పాటించే ఈ చిట్కాలే నన్ను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతున్నాయి..’ అంటూ తన హెల్త్‌ సీక్రెట్స్‌ని బయటపెట్టారు జిమ్. ఇక ట్రావెలింగ్‌ని ఇష్టపడే జిమ్‌.. బీచ్‌ అందాల్ని ఆస్వాదించడానికి మక్కువ చూపుతానంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని