Updated : 29/06/2021 18:47 IST

వారి మరణం కలచి వేసింది.. అందుకే ఈ సేవ!

Image for Representation

ఉద్యోగ విరమణ పొందిన చాలామంది తమ విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఎక్కువగా కాలక్షేపం చేయాలనుకుంటారు. అయితే ఉద్యోగ విరమణ అనేది వృత్తికి మాత్రమే.. సేవకు కాదంటున్నారు 66 ఏళ్ల ఏఎస్‌ గీత. మైసూర్‌కు చెందిన ఆమె నర్సుగా ఇప్పటికే రిటైరయ్యారు. కానీ కొవిడ్‌ రోగుల కోసం మళ్లీ సేవామూర్తిగా మారారు. అందరి చేతా ‘కొవిడ్‌ వారియర్‌’గా మన్ననలు అందుకుంటున్నారు.

ఇంట్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల బ్యాంకు!

ఫ్రంట్‌లైన్ వారియర్లుగా కొవిడ్‌ను కట్టడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు వైద్య సిబ్బంది. వైరస్‌తో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా విధి నిర్వహణకే కట్టుబడుతున్నారు. ఈ క్రమంలో నర్సుగా ఉద్యోగ విరమణ పొందినప్పటికీ తన సేవా దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు మైసూరుకు చెందిన గీత. కొద్ది రోజుల క్రితం తనకు బాగా పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు ఆక్సిజన్‌ కొరతతో కన్నుమూయడం ఆమెను బాగా కలచివేసింది. అప్పుడే మరొకరు అలా బలికాకూడదనుకున్నారు. అందుకే ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో తన ఇంటిని ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల బ్యాంకుగా మార్చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇవి అవసరమైన వారికి క్షణాల్లో అందజేస్తున్నారు. అదేవిధంగా తనకున్న పరిజ్ఞానంతో కరోనా రోగులకు అవసరమైన మందులు అందిస్తున్నారు. సేవ చేస్తున్నారు. కొవిడ్‌ బాధితుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు.

100 కిలోమీటర్లు ప్రయాణించి..!

‘నాకు బాగా తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఆక్సిజన్‌ కొరతతో కన్నుమూశారు. వీరే కాదు చామరాజనగర్‌ జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో చాలామంది ఇలాగే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసింది. ఇది నా మనసును బాగా కలచివేసింది. కరోనా బాధితులకు నేను ఏవిధంగా సహాయపడగలను? అని తీవ్రంగా ఆలోచించాను. అప్పుడే నా సోదరుడు ‘స్వామి వివేకానంద యూత్‌ మూమెంట్‌ (SVYM )’ గురించి సమాచారమిచ్చాడు. వారి సహాయంతో కొన్ని పోర్టబుల్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను. కాల్‌ వచ్చిన మరుక్షణమే SVYM సిబ్బంది సహాయంతో ఆటోరిక్షాలో కాన్సన్‌ట్రేటర్లను బాధితుల దగ్గరికి చేరుస్తున్నాను. ఈ క్రమంలో కొన్నిసార్లు 100 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాల్సి వస్తోంది.’

ఇంట్లో 96 ఏళ్ల అమ్మ ఉంది!

‘నాకున్న ఇబ్బందుల కారణంగా ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేకపోవచ్చు. కానీ నా వృత్తిలోనే సేవాభావం ఉంది. అందుకే ఉద్యోగ విరమణ పొందినా ఆపత్కాలంలో నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. మా ఇంట్లో అందరూ వయసు పైబడిన వారే. మా అమ్మకు 96 ఏళ్లు. కరోనా కారణంగా నా వల్ల వారికి ఏమైనా అవుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. అలాగని సామాన్య ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చోలేను. అయితే వైరస్‌ నుంచి నన్ను నేను రక్షించుకునేందుకు అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాను’ అని చెబుతున్నారీ కరోనా వారియర్‌.

మా పోరాటానికి ఆమె స్ఫూర్తి!

‘కరోనా వారియర్‌గా గీత అందిస్తున్న సహాయ సహకారాల వల్లే కరోనాపై మా పోరాటం కొనసాగుతోంది. 66 ఏళ్ల వయసులో ఆమె అందిస్తోన్న సేవలు మాలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి’ అని SVYM నిర్వాహకులు గీతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని