Published : 24/09/2021 16:58 IST

అందుకే 80 ఏళ్ల వయసులో గుర్రంపై సాహస యాత్ర!

(Photos: Screengrab)

మనల్ని మనం వెతుక్కుంటూ ఒంటరిగా సాహస యాత్రలు చేయాలని, ప్రపంచాన్ని చుట్టి రావాలని మనలో చాలామందికి ఉంటుంది. కానీ ఈ యాంత్రిక జీవనం ఎప్పటికప్పుడు మనల్ని వెనక్కు లాగుతూ ఉంటుంది. కనీసం స్నేహితులు, సన్నిహితులను కలిసే సమయం కూడా దొరకదు. కానీ ఇంగ్లండ్‌కు చెందిన ఓ బామ్మ ఎనిమిది పదుల వయసులోనూ తన అభిరుచులు, ఆసక్తులను నెరవేర్చుకుంటున్నారు. గుర్రంపై ఒంటరిగా ట్రెక్కింగ్‌, అడ్వెంచర్‌ యాత్రలకు వెళుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంతకీ ఎవరామె? విశ్రాంతి తీసుకునే వయసులో ఈ సాహస యాత్రలెందుకు చేస్తున్నారో తెలుసుకుందాం రండి.

జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి యాత్రికులు గుర్రాలపై వెళుతుంటారు. ఇదే రీతిలో ‘వయసు అనేది ఓ అంకె మాత్రమే’ అన్న మాటలను నిజం చేస్తూ గుర్రంపై ట్రెక్కింగ్‌ చేస్తున్నారు 80 ఏళ్ల జెన్ డొచిన్‌. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 1000 కిలోమీటర్ల పాటు అది కూడా ఏటా క్రమం తప్పకుండా ఇలాంటి యాత్రలు చేస్తున్నారీ డేరింగ్‌ వుమన్.

50 ఏళ్లలో 40 సార్లు!

జెన్‌కు ప్రయాణాలు, సాహస యాత్రలంటే ఎంతో ఆసక్తి. 1972లో మొదటిసారిగా తన ఇంటి నుంచి గుర్రంపై బయలుదేరిన ఆమె 965 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తర స్కాట్లాండ్‌కు చేరుకుంది. అప్పటి నుంచి ఏటా ఇదే మార్గంలో గుర్రంపై ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 31న నార్తంబర్‌ల్యాండ్‌లోని తన నివాసం నుంచి సాహస యాత్రను ప్రారంభించారు జెన్‌. ఈసారి డైమండ్‌ (గుర్రం)తో పాటు డింకీ (పెట్‌డాగ్‌)ని కూడా తోడుగా తీసుకెళ్లారు. మొత్తం ఏడు వారాల పాటు ఈ యాత్ర సాగనుంది. ‘రోజూ 25-30 కిలోమీటర్ల వరకు గుర్రం పైనే ప్రయాణిస్తాను. ఇలా సుమారు 1000 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. యాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకుంటాను. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తప్ప నా ప్రయాణ మార్గాన్ని మార్చుకోను.’

అప్పుడు మాత్రమే మొబైల్ వాడతా!

‘వాతావరణం అనుకూలంగా లేనప్పుడు కొండ ప్రాంతాల మీదుగా అసలు వెళ్లను. రాత్రి వేళల్లో సమీప గ్రామాల్లోనే టెంట్‌ వేసుకుని నిద్రపోతాను. తినడానికి ఓట్స్‌, కేక్స్‌, కొన్ని రకాల ఛీజ్‌ ఐటమ్స్‌ను ముందుగానే రడీ చేసుకుంటాను. అక్కడక్కడా గ్రామస్తులు కూడా నాకు ఆహార పదార్థాలు అందిస్తుంటారు. రాత్రి వేళల్లో రోడ్డుపై వెళుతున్నప్పుడు కచ్చితంగా ఆరెంజ్‌ కలర్‌ జాకెట్‌ను ధరిస్తాను. దీనివల్ల వాహనదారులకు దూరం నుంచే నేను కనిపిస్తాను. పాత తరం మొబైల్‌ ఒకటి నా దగ్గర ఉంటుంది. అయితే ఇక్కడ సిగ్నల్స్ అంతగా ఉండవు. అందుకే బ్యాటరీ ఆదా చేయడానికి ఎక్కువగా మొబైల్‌ను స్విచ్ఛాఫ్ మోడ్‌లోనే ఉంచుతాను. ఏదైనా అత్యవసరమైతే తప్ప ఫోన్‌ను ఆన్‌ చేయను.’

నాకు తెలియకపోయినా నా గుర్రానికి తెలుసు!

‘మొదటి యాత్రలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ముందుకు వెళుతున్నాను. స్నేహితులు, సన్నిహితులను ఏటేటా కలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది.  నా శరీరం సహకరించేంతవరకు ఇలాంటి యాత్రలు చేస్తుంటాను. కంటి చూపు సరిగా లేకపోయినా నాకు వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే నా గుర్రానికి ఈ మార్గం బాగా తెలుసు. అదే నన్ను గమ్యానికి చేరుస్తుంది’ అని అంటున్నారు జెన్.

పుస్తక రూపంలో యాత్రా విశేషాలు!

తన సాహస యాత్రకు సంబంధించిన విశేషాలన్నిటినీ ఎప్పటికప్పుడు పుస్తక రూపంలో పొందుపరుస్తున్నారు జెన్‌. ఇప్పటికే ఆమె రాసిన చాలా పుస్తకాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇక జెన్‌ సాగిస్తోన్న సుదీర్ఘ సాహస యాత్రలను మెచ్చుకుంటూ బ్రిటిష్‌ హార్స్‌ సొసైటీ ఆమెను ‘ఎక్సెప్షనల్‌ అఛీవ్‌మెంట్‌’ అవార్డుతో సత్కరించింది.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని