81 ఏళ్ల వయసులో స్విమ్‌సూట్‌ ధరించి..!

ప్రముఖ మ్యాగజైన్ల కవర్‌ ఫొటోలపై కనిపించాలని చాలామంది తారలు కలలు కంటారు. కానీ, అది అంత సులభం కాదు. ఎన్నో కొలమానాలను దాటితే కానీ ఆ అవకాశం దక్కదు. అందుకే వివిధ పత్రికల కవర్‌ ఫొటోలపై ఎక్కువభాగం...

Published : 22 May 2023 13:50 IST

(Photos: Instagram)

ప్రముఖ మ్యాగజైన్ల కవర్‌ ఫొటోలపై కనిపించాలని చాలామంది తారలు కలలు కంటారు. కానీ, అది అంత సులభం కాదు. ఎన్నో కొలమానాలను దాటితే కానీ ఆ అవకాశం దక్కదు. అందుకే వివిధ పత్రికల కవర్‌ ఫొటోలపై ఎక్కువభాగం వర్థమాన తారలే కనిపిస్తుంటారు. అలాంటిది 81 ఏళ్ల మార్తా స్టివార్ట్ ప్రఖ్యాత ‘Sports Illustrated Swimsuit’ మ్యాగజైన్‌ కవర్‌పై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఈ మ్యాగజైన్ కవర్‌ ఫొటోపై కనిపించిన వృద్ధ మహిళగా ఘనత సాధించింది. అంతకుముందు ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్‌ మస్క్‌ తల్లి మయే మస్క్ (75) (Maye పేరున ఈ రికార్డు ఉంది. ఆమె గతేడాది ఈ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోపై కనిపించింది. మార్తా కేవలం మోడల్‌గా మాత్రమే కాకుండా రచయిత, వ్యాఖ్యాత, వ్యాపారవేత్తగా కూడా పలు ఘనతలు సాధించింది. ఈ క్రమంలో ఆమె గురించి మరిన్ని విశేషాలు..

99 పుస్తకాలు..

మార్తా స్టివార్ట్‌ 1941లో అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే. కాలేజీ రోజుల్లోనే మార్తా పలు బ్రాండ్‌లకు మోడల్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో వాటి ద్వారా వచ్చిన డబ్బును కాలేజీ ఫీజులకు చెల్లించేది. మార్తా 20 ఏళ్ల వయసులో ఆండ్రూ స్టివార్ట్ ను పెళ్లి చేసుకుంది. అతను ఒక పబ్లిషింగ్‌ హౌస్ ను నడిపేవాడు. మార్తా కొంతకాలం పాటు ‘క్యాటరింగ్‌ బిజినెస్‌’ కూడా చేసింది. ఆమెకు పుస్తకాలు రాయడమంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే మొదటిసారి 1982లో ‘ఎంటర్‌టైనింగ్‌’ అనే వంటల పుస్తకాన్ని రాసింది. ఆ తర్వాత ఆమె రాసిన 98 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. మార్తా ఎక్కువగా జీవనశైలికి సంబంధించిన పుస్తకాలను రాసింది.

మొదటి మహిళా బిలియనీర్‌గా..

మార్తా 1997లో Martha Stewart Living Omnimedia అనే సంస్థను స్థాపించింది. దీని ద్వారా వ్యాపారవేత్తగా పత్రిక, టెలివిజన్‌ రంగాల్లో ప్రవేశించింది. అంతకుముందు 1993లో తనే వ్యాఖ్యాతగా ‘మార్తా స్టివార్ట్‌ లివింగ్‌’ అనే టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పట్లో ఈ కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మహిళా అభిమానులు విపరీతంగా ఉండేవారట. అలా ఈ కార్యక్రమం 2004 వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఇందుకుగాను మార్తా పలు ‘ఎమ్మీ’ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
తర్వాత ‘మార్తా స్టివార్ట్‌ లివింగ్‌’ అనే పేరుతోనే 1990లో ఓ మ్యాగజైన్‌ను కూడా ప్రారంభించింది. ఇది గతేడాది వరకు కొనసాగింది. తనకున్న లైఫ్‌స్టైల్‌ అనుభవాలతో సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా నడుపుతోంది. మార్తాను అమెరికాలో సొంతంగా ఎదిగిన మొదటి మహిళా బిలియనీర్‌గా పిలుస్తుంటారు.

కవర్‌ ఫొటోతో వార్తల్లో నిలిచింది..!

కొన్ని కారణాల వల్ల మార్తా తన కెరీర్‌కి కొన్ని సంవత్సరాలు విరామం ఇచ్చింది. అయితే తాజాగా ప్రఖ్యాత ‘Sports Illustrated Swimsuit’ మ్యాగజైన్‌ కవర్‌పై కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మ్యాగజైన్‌లో మార్తాతో పాటు అమెరికా తారలు మేగన్‌ ఫాక్స్, కిమ్‌ పెట్రాస్, బ్రూక్స్‌ నాడర్‌లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఏదైనా సాధించాలంటే వయసు ఏమాత్రం అడ్డంకి కాదని తన తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది మార్తా.

ఈ సందర్భంగా ‘మార్పు కోసం ప్రయత్నించే వారు దాన్ని కచ్చితంగా సాధించగలరని నమ్ముతాను. అలానే నేను కూడా ఈ వయసులో కవర్‌ ఫొటోపై ఎందుకు కనిపించకూడదని అనుకున్నాను. అయితే అది అంత చిన్న విషయం కాదని నాకు తెలుసు. ఇందుకోసం రెండు నెలల పాటు బ్రెడ్‌, పాస్తా తినడం మానేశాను. వారానికి మూడు రోజులు వ్యాయామం చేశాను. చివరికి లక్ష్యాన్ని చేరుకున్నాను. జీవితంలో ఏ దశలో ఉన్నా కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఈ కవర్‌ ఫొటో ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే ‘వయసు కంటే ఆలోచనలు, అభిప్రాయాలు ఎంతో ముఖ్యం’ అని చెప్పుకొచ్చింది.

లింగ సమానత్వం కోసం...

Sports Illustrated Swimsuit తన మొదటి సంచికను 1964లో ప్రచురించింది. ఈ పత్రిక ఏడాదికోసారి తన ఎడిషన్‌ను ప్రచురిస్తుంటుంది. శరీరాకృతితో పాటు వర్ణ, లింగ వివక్షలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు తమ పత్రిక కవర్ పేజీ పైన స్థానం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కవర్‌ ఫొటో కోసం విభిన్న వ్యక్తులను ఎంపిక చేస్తోంది. తద్వారా ఒకవైపు మహిళా సాధికారతను ప్రోత్సహించడమే కాకుండా తన బ్రాండ్‌ను విస్తరించుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్