మానసిక సమస్య ఉన్నా.. తొమ్మిదేళ్లకే రెండు డిగ్రీలు!

చిన్నతనంలో పిల్లలకొచ్చే కొన్ని సమస్యలు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. స్కూలుకెళ్లే క్రమంలో వారిని ఇతర పిల్లలతో కలవకుండా చేస్తాయి. మెక్సికోకు చెందిన తొమ్మిదేళ్ల అధారా పెరెజ్‌ సాంచెజ్‌ కూడా అలాంటి అమ్మాయే! మూడేళ్ల వయసులో Asperger's Syndrome (మానసికంగా పరిణతి చెందకపోవడం) బారిన పడిన ఆమె..

Updated : 21 May 2022 11:32 IST

(Photo: Instagram)

చిన్నతనంలో పిల్లలకొచ్చే కొన్ని సమస్యలు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. స్కూలుకెళ్లే క్రమంలో వారిని ఇతర పిల్లలతో కలవకుండా చేస్తాయి. మెక్సికోకు చెందిన తొమ్మిదేళ్ల అధారా పెరెజ్‌ సాంచెజ్‌ కూడా అలాంటి అమ్మాయే! మూడేళ్ల వయసులో Asperger's Syndrome (మానసికంగా పరిణతి చెందకపోవడం) బారిన పడిన ఆమె.. పాఠశాలలో ఇటు తోటి పిల్లల వేధింపులు, అటు టీచర్ల ఫిర్యాదుల్ని ఎదుర్కొంది.. ఎంతో మానసిక వేదనను అనుభవించింది. అయితే తను మానసికంగా వెనకబడినప్పటికీ తనలో ఐక్యూ మాత్రం అద్భుతంగా ఉందని గుర్తించిన ఆమె తల్లి.. ప్రత్యేక థెరపీ ఇప్పించింది. ఫలితంగా ఆమె తొమ్మిదేళ్ల వయసులోనే రెండు డిగ్రీలు చదివేంత చురుగ్గా మారిపోయింది. ఐక్యూలో స్టీఫెన్‌ హాకింగ్స్, అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌.. వంటి మేధావుల్నే దాటేసిన అధారా.. భవిష్యత్తులో వ్యోమగామి కావడమే తన లక్ష్యమంటోంది. మరి, ఈ బ్రిలియంట్‌ గర్ల్‌ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం రండి..

అధారా పెరెజ్‌ సాంచెజ్‌.. మెక్సికోలోని Tlahuac స్లమ్స్‌లో పుట్టి పెరిగింది. మూడేళ్లొచ్చేదాకా అందరు పిల్లల్లాగే పాకడం, నడవడం, పరిగెత్తడం నేర్చుకున్న ఆమె ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించింది అధారా తల్లి నలేలీ సాంచెజ్‌. తోటి పిల్లలతో మాట్లాడడం, కలిసి ఆడుకోవడం కంటే తనతో తను ఆడుకోవడానికే ఇష్టపడేదంటోందామె.

మూడేళ్ల వయసులో ఆ సమస్య!

‘నా పాప మూడేళ్ల దాకా అందరు పిల్లల్లాగే నార్మల్‌గానే ఉంది. అయితే మూడేళ్ల వయసులో తనలో కొన్ని మార్పులు గమనించాను. ఎక్కువగా బ్లాక్స్‌తో ఆడుకోవడం, వాటిని చక్కగా అమర్చడం, పిల్లలు తినే కుర్చీలో కూర్చొని తినడం.. ఇలా తన లోకం తనదే.. రోజులో ఎక్కువ సమయం ఇలాగే గడిపేది. చాలా యాక్టివ్‌గా ఉండేది కూడా! అయితే రోజులు గడుస్తోన్నా ఇతర పిల్లలతో కలవకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడంతో వైద్యుల్ని కలిశాం. అప్పుడు తెలిసింది.. తనకు Asperger's Syndrome ఉందని. ఆటిజం లాంటిదే ఈ సమస్య కూడా! అంటే.. మానసికంగా పరిణతి చెందకపోవడం! అయినా తనలో గ్రహించే శక్తి, జ్ఞాపకశక్తి మెండుగా ఉన్నాయని నాకు అర్థమైంది.. ఈ క్రమంలోనే మానసిక నిపుణుల సలహా మేరకు ప్రత్యేక చికిత్స ఇప్పించా..’ అంటున్నారు అధారా తల్లి.

బుల్లీయింగ్‌కి గురైంది!

ఇక తనకున్న మానసిక లోపంతో స్కూల్లోనూ పలు వేధింపులు ఎదుర్కొంది అధారా. తోటి విద్యార్థులు ఆమెను ‘Weirdo (విచిత్రమైన వ్యక్తి)’, ‘Oddball (అందరికంటే భిన్నమైన వ్యక్తి)’ అని ఆటపట్టించేవారు. మరోవైపు టీచర్లు కూడా ‘మీ పాప తరగతి గదిలోనే నిద్ర పోతుంది.. పాఠాలపై అస్సలు శ్రద్ధ పెట్టట్లేదు..’ అని ఆమె తల్లికి ఫోన్‌ చేసి పదే పదే ఫిర్యాదు చేసేవారు. అయినా తన కూతురి ప్రతిభ పైనే నమ్మకముంచింది నలేలీ. ఇక ఈ వేధింపులు భరించలేక ఒక్కోసారి స్కూలుకెళ్లనని మొండికేసేది అధారా.. తీవ్ర ఒత్తిడికి లోనయ్యేది. అయితే ఈ వేధింపులతో తన కూతురిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. మానసిక నిపుణుల సలహా మేరకు అధారాను ఆ స్కూల్‌ నుంచి ‘ట్యాలెంట్‌ సర్వీస్‌ సెంటర్‌ (CEDAT)’కి మార్చిందామె. ఇక్కడే అధారా ఐక్యూ 162గా ఉందని నిరూపితమైంది. అంటే.. 160 ఐక్యూ ఉన్న సీఫ్టెన్‌ హాకింగ్స్‌, అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌.. వంటి మేధావులనే దాటేసింది అధారా. సాధారణంగా ఒక వ్యక్తికి 130 ఐక్యూ ఉండడమే వరం.. అలాంటిది 162 ఐక్యూతో తన మానసిక లోపాన్ని కూడా ఓడించిందీ మెక్సికన్‌ అమ్మాయి.

తొమ్మిదేళ్లకే డిగ్రీ!

అయితే ట్యాలెంట్‌ సర్వీస్‌ సెంటర్‌లో కొన్నాళ్ల పాటు విద్యనభ్యసించిన అధారాను.. ఆపై ఆర్థిక పరిస్థితులు సహకరించక దూర విద్య ద్వారానే చదివించారు ఆమె తల్లి నలేలీ. ఈ క్రమంలోనే తన అద్భుత ప్రతిభతో ఐదేళ్లకే ప్రాథమిక విద్యాభ్యాసం, ఎనిమిదేళ్ల లోపే ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది అధారా. ప్రస్తుతం మెక్సికోలోని CNCI యూనివర్సిటీలో ‘సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌’, UNITEC యూనివర్సిటీలో ‘ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ మ్యాథమేటిక్స్‌’.. ఇలా రెండు విభాగాల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీలు చదువుతోందీ బ్రిలియంట్‌ గర్ల్.

వ్యోమగామి కావాలనుంది!

తన అద్భుతమైన ఐక్యూతో మానసిక సమస్యనే జయించి దూసుకుపోతోన్న అధారా.. భవిష్యత్తులో వ్యోమగామి కావాలని కలలు కంటోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ప్రతిభను మెచ్చి ఇప్పటికే అరిజోనా యూనివర్సిటీ, రైస్‌ యూనివర్సిటీలు తమ వద్ద ఆస్ట్రోఫిజిక్స్‌ చదివే అవకాశం ఇచ్చాయి. ఇక ఈ ఏడాది నవంబర్‌లో అలబామాలో జరగబోయే ‘ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్ (ISAP)’లో పాల్గొనమంటూ అధారాకు ఆహ్వానం కూడా అందింది.

‘నాకు దక్కిన గొప్ప అవకాశమిది. ఈ క్రమంలో అంతరిక్ష రంగ నిపుణుల దగ్గర్నుంచి బోలెడన్ని విషయాలు నేర్చుకోవచ్చు.. అలాగే నా ప్రాజెక్ట్‌ను కూడా ఈ వేదికగా ప్రజెంట్‌ చేయబోతున్నా..’ అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది అధారా.
తన జీవితంలో తనకెదురైన అనుభవాలతో ‘Do Not Give Up’ అనే పుస్తకం రాసిన ఈ మెక్సికన్‌ అమ్మాయి.. ఫోర్బ్స్ మెక్సికో ప్రకటించిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది.
‘మీకు అనువుగాని చోట ఉండి బాధపడే కంటే.. అనువైన చోటికి మారి లక్ష్యాల్ని సాధించేందుకు కృషి చేయండి.. అంతేకానీ కలల్ని మాత్రం వదులుకోవద్దు..’ అంటూ తన మాటలతో అందరిలో, ముఖ్యంగా మానసిక/శారీరక లోపాలున్న వారిలో స్ఫూర్తి నింపుతోంది అధారా. అంతరిక్షంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతోన్న ఈ చిన్నది.. భవిష్యత్తులో మార్స్ పైన అడుగిడతానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
ఆల్‌ ది బెస్ట్‌ అధారా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్