శాంతమ్మ@95.. అలుపెరగని టీచరమ్మ..!

మనలో చాలామంది ఏదో ఒక వృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తుంటారు. కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకొని శేష జీవితాన్ని మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతుంటారు. కానీ, కొంతమంది మాత్రం మలి వయసులోనూ తమ పనిని....

Published : 23 Aug 2022 19:49 IST

మనలో చాలామంది ఏదో ఒక వృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తుంటారు. కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకొని శేష జీవితాన్ని మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతుంటారు. కానీ, కొంతమంది మాత్రం మలి వయసులోనూ తమ పనిని యజ్ఞంలా చేస్తుంటారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా లెక్కచేయరు. ఈ జాబితాలో ముందువరుసలో ఉంటుంది విశాఖకు చెందిన శాంతమ్మ. ప్రస్తుతం 95 ఏళ్ల వయసులో ఉన్న ఆమె.. రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. మరోవైపు పరిశోధనలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ‘ప్రపంచంలోనే అత్యధిక వయసున్న ప్రొఫెసర్‌’గా త్వరలో గిన్నిస్‌ బుక్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోన్న ప్రొఫెసర్‌ శాంతమ్మ గురించి మరిన్ని వివరాలు మీకోసం...

చదివిన చోటే లెక్చరర్‌గా..!

శాంతమ్మ మచిలీపట్నంలో జన్మించారు. ఐదు నెలల వయసులోనే ఆమె తండ్రి చనిపోయారు. దాంతో బంధువుల దగ్గరే పెరిగారు. ఆ తర్వాత విశాఖపట్నంలోని ఏవియన్‌ కాలేజిలో ఇంటర్‌, ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేశారు. మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపీ సబ్జెక్టుగా డీఎస్సీ(పీహెచ్‌డీతో సమానం) పూర్తి చేశారు. తిరిగి అదే యూనివర్సిటీలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అప్పటినుంచి ఓవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. మరోవైపు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారామె.

విదేశీ వర్సిటీల్లోనూ..

శాంతమ్మ విద్యార్థి దశలోనే బ్రిటన్‌ రాయల్‌ సొసైటీ ఆచార్యుల పరిశీలనలో ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. స్పెక్ట్రోస్కోపీలో విశేషమైన పరిశోధనలు చేసిన డాక్టర్‌ రంగధామారావు మార్గదర్శకత్వంలో ఆమె అనేక పరిశోధనలు చేశారు. లేజర్‌ టెక్నాలజీ, పెట్రోల్‌లో మలినాల గుర్తింపు వంటి అనేకానేక ప్రాజెక్టుల్లో శాంతమ్మ పరిశోధనలు చేశారు. పలు జర్నల్స్‌లో ఆమె పరిశోధన పత్రాలు కూడా ప్రచురితమయ్యాయి. అమెరికా, బ్రిటన్‌, దక్షిణ కొరియాలోని పలు యూనివర్సిటీలు శాంతమ్మను ఆహ్వానించి ఆమె అనుభవాలు తెలుసుకున్నాయి. ఈ క్రమంలో ఆమె పలు అవార్డులతో పాటు బంగారు పతకాలను కూడా అందుకున్నారు. శాంతమ్మ మార్గదర్శకత్వంలో 17 మంది విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తి చేశారు.

పదవీ విరమణ చేసినా ప్రయాణం ఆగలేదు..!

పదవీ విరమణ చేసిన తర్వాత చాలామంది తమ శేష జీవితాన్ని మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతుంటారు. శాంతమ్మ ఇందుకు పూర్తి భిన్నం. భౌతిక శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా 1989లోనే ఆమె పదవీ విరమణ పొందారు. కానీ ఆమె బోధన మాత్రం కొనసాగుతూనే ఉంది. అప్పటి ఏయూ వీసీ సింహాద్రి గౌరవ వేతనంపై ఆమెను ప్రొఫెసర్‌గా కొనసాగించారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన జీఎస్‌ఎన్‌ రాజు కూడా శాంతమ్మను ప్రొఫెసర్‌గా కొనసాగించారు. విశేషమేంటంటే.. జీఎస్‌ఎన్‌ రాజు శాంతమ్మ ప్రియ శిష్యుడే. అయితే ఆయన సెంచూరియన్‌ యూనివర్సిటీకి వీసీగా మారడంతో ఆమె కూడా అదే యూనివర్సిటీలో పాఠాలు చెబుతున్నారు. దీనికోసం ఆమె రోజూ విశాఖ నుంచి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ వర్సిటీకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె వారానికి నాలుగు తరగుతులు బోధిస్తున్నారు. రెండు మోకాళ్లకు ఆపరేషన్‌ జరగడంతో రెండు కర్రల సహాయంతోనే ఆమె తన బోధనను కొనసాగిస్తున్నారు.

ఆధ్యాత్మిక చింతన ఎక్కువే...

శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన తెలుగు ఫ్రొఫెసర్‌. కొద్ది సంవత్సరాల క్రితమే ఆయన మరణించారు. శాంతమ్మకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. తన భర్త ద్వారా ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నారు. ఆ ఆసక్తితోనే భగవద్గీతను అధ్యయనం చేసి  ఆంగ్లంలోకి అనువధించారు. అలాగే వేద గణితంలోని 29 సుత్రాలపై పరిశోధనలు చేసి 7 సంపుటాలను రాశారు. ప్రస్తుతం ఆమె యాంటీ క్యాన్సర్‌ డ్రగ్‌పై తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు.

రెండింటికీ విలువివ్వాలి...

ఈ వయసులో మీకు ఇది ఎలా సాధ్యమవుతుందని అడిగితే.. ‘టీచింగ్‌లో సమయం, శక్తి రెండూ ముఖ్యమైనవి. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంద’ని అంటారామె. ఆమె దినచర్య నాలుగు గంటలకే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు చెప్పాల్సిన నోట్స్‌ని ప్రిపేర్‌ చేసుకుంటారు. అలా చదువు పాఠాలతో పాటు జీవితానుభవాలను విద్యార్థులకు పంచి వారిలో స్ఫూర్తి కలిగిస్తున్నారు శాంతమ్మ. మరో విశేషం ఏంటంటే.. ‘ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన ప్రొఫెసర్‌’గా త్వరలోనే గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకునేందుకు సిద్ధమవుతున్నారీ ప్రొఫెసరమ్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్