98 ఏళ్లు.. అయినా మనోధైర్యంతో కరోనాను జయించింది!

మాయదారి కరోనా మహమ్మారి ఎవరినీ కనికరించడం లేదు. యువతను, చిన్నపిల్లలను సైతం కబళిస్తూ ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో వృద్ధులు, అందులోనూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. అయితే సరైన సమయంలో చికిత్స తీసుకోవడంతో పాటు కొంచెం మానసిక స్థైర్యం ఉంటే కరోనానే కాదు ఎలాంటి మహమ్మారి వైరస్‌లనైనా మట్టుబెట్టవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Published : 29 Jun 2021 16:04 IST

Image for Representation

మాయదారి కరోనా మహమ్మారి ఎవరినీ కనికరించడం లేదు. యువతను, చిన్నపిల్లలను సైతం కబళిస్తూ ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో వృద్ధులు, అందులోనూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. అయితే సరైన సమయంలో చికిత్స తీసుకోవడంతో పాటు కొంచెం మానసిక స్థైర్యం ఉంటే కరోనానే కాదు ఎలాంటి మహమ్మారి వైరస్‌లనైనా మట్టుబెట్టవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శతాధిక వృద్ధులు కూడా కరోనా నుంచి కోలుకున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరొక సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.

వారం రోజుల్లోనే వైరస్‌ను జయించింది!

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ సమీపంలోని చంద్రశేఖర్‌పూర్‌కు చెందిన అన్నపూర్ణ బిస్వాల్‌ వయసు 98 ఏళ్లు. రెండు దశాబ్దలుగా మధుమేహంతో బాధపడుతున్న ఈ బామ్మకు ఫైలేరియా, బీపీ లాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. వీటికి తోడు వృద్ధాప్య సమస్యలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ సోకితే ఎవరైనా తెగ భయపడిపోతారు. కానీ సెంచరీకి చేరువవుతోన్న ఈ బామ్మ మాత్రం ఎలాంటి బెరకు లేకుండా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. మనోధైర్యంతో పాటు మరికొంత కాలం బతకాలన్న కోరికతో కరోనా మహమ్మారిని జయించింది. వారం రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జై ఇంటికి చేరుకుంది.

ఆక్సిజన్ లెవెల్స్‌ క్షీణించినా అధైర్యపడలేదు!

ఒడిశా రాష్ట్రానికి సంబంధించి కరోనా నుంచి కోలుకున్న అతి పెద్ద వయస్కురాలిగా అరుదైన గుర్తింపు పొందారీ ఓల్డ్‌ వుమన్. ఈ క్రమంలో అన్నపూర్ణ రికవరీతో ఆస్పత్రిలో ఓ రకమైన సానుకూల దృక్పథం నింపిందంటున్నారు ఆమెకు చికిత్స అందించిన వైద్యులు.

‘ఆస్పత్రిలో ఉన్నప్పుడు చాలాసార్లు బామ్మ ఆక్సిజన్‌ లెవెల్స్‌ క్షీణించాయి. కానీ ఆమె ధైర్యం కోల్పోవడం మేం ఎప్పుడూ చూడలేదు. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు వైద్యులతో పాటు నర్సులకు పూర్తిగా సహకరించింది. ఆమె మానసిక దృఢత్వం, మరికొంతకాలం ఈ లోకంలో ఉండాలన్న కోరికలే తనను త్వరగా కోలుకునేలా చేశాయి. ఇక్కడ అన్నపూర్ణ లాంటి వృద్ధులు ఎంతోమంది కరోనాతో పోరాడుతున్నారు. తన రికవరీతో వాళ్లందరిలోనూ ఓ సానుకూల దృక్పథాన్ని నింపారామె’ అని ఓ వైద్యుడు చెప్పుకొచ్చారు.

ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు అసలు విషయం చెప్పలేదు!

అన్నపూర్ణ కోలుకోవడంలో వైద్యులు కూడా కీలకపాత్ర పోషించారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ‘అమ్మకు సేవలందించే హోం నర్సు ద్వారానే ఈ మహమ్మారి మా ఇంట్లోకి ప్రవేశించింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిన మరుసటి రోజే అమ్మకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారితమైంది. దీంతో అందరమూ కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాం. అదృష్టవశాత్తూ అమ్మతో పాటు మా ఇంట్లో మరొకరికి మాత్రమే కొవిడ్‌ ఉన్నట్లు తేలింది. అమ్మ రెండు దశాబ్దాలుగా మధుమేహంతో పోరాడుతోంది. బీపీ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు కరోనా సోకడంతో మొదట భయపడ్డాం. అందుకే ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు అమ్మతో కూడా ఈ విషయం చెప్పలేదు’.

ఇంటికొచ్చాక కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు!

‘ఇక చికిత్స సమయంలో రోజూ రెండుసార్లు వీడియోకాల్‌లో అమ్మతో మాట్లాడే వాళ్లం. ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌ సహాయంతో నిరంతరం తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేవాళ్లం. అలా వైద్యుల సహకారంతో వారం రోజుల్లోనే అమ్మ కరోనాను జయించింది. ఇటీవలే తనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. అంబులెన్స్‌లో ఇంటికొచ్చాక కొద్ది సేపు అమ్మ ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఇంట్లో అందరూ మాస్క్‌లు ధరించాలని, తన దగ్గరకు ఎవరూ రావొద్దని మాకు సూచించింది’ అని ఆమె కుమారుడు చెప్పుకొచ్చాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్