‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

Updated : 10 Jul 2021 19:28 IST

Photo: Twitter

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

వారందరినీ వెనక్కి నెట్టి!

అమెరికా నేషనల్‌ స్పెల్లింగ్‌- బీ పోటీల్లో గత కొన్నేళ్లుగా భారతీయ అమెరికన్‌ విద్యార్థులే హవా కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా 2020 పోటీలు రద్దు కాగా, 2019లో 8 మంది కో-ఛాంపియన్లుగా నిలిచారు. అందులో ఏడుగురు భారత సంతతి చిన్నారులే ఉండడం విశేషం. తాజాగా జరిగిన పోటీల్లోనూ వీరిదే ఆధిపత్యం. స్పెల్లింగ్‌ బీ-2021 ఫైనల్‌ రౌండ్‌ పోటీలకు చేరుకున్న 11 మందిలో 9మంది చిన్నారులు భారత సంతతికి చెందిన వారే. దీంతో వారే విజేతగా నిలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే వారందరినీ వెనక్కి నెట్టి ప్రతిష్ఠాత్మక స్పెల్లింగ్‌-బీ ట్రోఫీని గెల్చుకుంది జైలా. దీంతో పాటు 50వేల డాలర్ల బహుమతిని సొంతం చేసుకుంది.

209 మంది పోటీ పడ్డారు!

గతేడాది పోటీలు రద్దు కావడంతో ఈ ఏడాది పోటీలకు ప్రాధాన్యం బాగా పెరిగింది. మొత్తం 209 మంది చిన్నారులు ఈ పోటీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 12 నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా పోటీలు ప్రారంభమయ్యాయి. మొత్తం 18 రౌండ్లుగా జరిగిన ఈ పోటీల్లో 11 మంది చిన్నారులు ఫైనల్‌ రౌండ్‌ పోటీలకు అర్హత సాధించారు. ఇక తుది రౌండ్‌ పోటీలకు ముందు అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ స్వయంగా వచ్చి ఫైనలిస్టులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 11 మంది ఫైనలిస్టులు, వారి తల్లిదండ్రులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారీ అమెరికన్‌ ఫస్ట్‌ లేడీ. ఇప్పుడే కాదు.. 2009 స్పెల్లింగ్‌-బీ పోటీలకు కూడా ఆమె ఇలాగే హాజరయ్యారు.

ఆ తర్వాత జరిగిన పోటీల్లో లూసియానాకు చెందిన జైలా, తెలుగు సంతతికి చెందిన చైత్ర తుమ్మల తుది పోరుకు చేరుకోగా.. Murraya అనే పదానికి సరైన స్పెల్లింగ్‌ చెప్పి విజేతగా నిలిచింది జైలా. Murraya అనేది ఆస్ట్రేలియాకు చెందిన ఓ పూల మొక్క పేరు. అదే సమయంలో Neroli Oil అనే పదానికి సరైన స్పెల్లింగ్‌ చెప్పలేకపోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది చైత్ర తుమ్మల. భారత సంతతికి చెందిన మరో అమ్మాయి 13 ఏళ్ల భావన మూడో స్థానంలో నిలిచింది.

రోజుకు 7 గంటల సాధన!

ఈ క్రమంలో స్పెల్లింగ్‌- బీ ట్రోఫీ గెలుచుకున్న మొట్టమొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కింది జైలా. అన్నే మ్యాక్స్‌వెల్‌ (జమైకా) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించింది. పోటీల్లో భాగంగా Querimonious, Solidungulate వంటి కఠిన పదాలకు కూడా కరెక్ట్‌గా స్పెల్లింగ్‌ చెప్పి ఆకట్టుకున్న జైలా రోజుకు 7 నుంచి 8 గంటల పాటు కొన్ని వేల పదాల స్పెల్లింగ్స్ ప్రాక్టీస్‌ చేస్తుందట.

ఒకేసారి ఆరు బంతులతో!

ప్రస్తుతం 8వ తరగతి చదువుతోన్న జైలాకు బాస్కెట్‌ బాల్‌లోనూ మంచి ప్రావీణ్యముంది. ఒకేసారి ఆరుబంతులతో బాస్కెట్ బాల్ ఆడడం, డ్రిబ్లింగ్‌ చేయడం, బౌన్స్‌ చేయడంలో నేర్పరి అయిన ఆమె పేరిట మూడు గిన్నిస్‌ రికార్డులు కూడా ఉన్నాయి. ‘స్పెల్లింగ్‌- బీ పోటీల్లో గెలవడం సంతోషంగానే ఉంది. అయితే నా దృష్టంతా బాస్కెట్ బాల్ మీదనే ఉంది. జాతీయ మహిళల పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని చెబుతోంది జైలా.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు బరాక్‌ ఒబామా, మిచెల్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్‌.. తదితర ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా జైలాకు అభినందనలు తెలిపారు.

2, 3 స్థానాలు మనవే!

గత కొన్నేళ్లుగా అమెరికా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీల్లో ఇండో-అమెరికన్‌ విద్యార్థులదే హవా! ఇప్పటివరకు మొత్తం 26 మంది ఇండో-అమెరికన్‌ చిన్నారులు ఈ పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచారంటే వారి ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది విన్నింగ్‌ ట్రోఫీ గెలవకపోయినా 2, 3 స్థానాలను మన భారతీయ సంతతి చిన్నారులే కైవసం చేసుకున్నారు.

* రెండో స్థానంలో నిలిచిన 12 ఏళ్ల చైత్ర తుమ్మల తెలుగు సంతతి అమ్మాయి కావడం విశేషం. ఆమె తల్లిదండ్రులు మురళీమోహన్‌, శ్రీ దివ్యలది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు. వీరు కొన్నేళ్ల క్రితమే అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. చైత్ర ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది.

* మూడో స్థానంలో నిలిచిన 13 ఏళ్ల భావనా మదిని తల్లిదండ్రులు కూడా ఇండియాకు చెందినవారే. వీరు ప్రస్తుతం న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. భావన ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్