Published : 16/10/2021 16:48 IST

బాత్రూమ్ కాస్త విశాలంగా కనిపించాలా??

ఇల్లు పెద్దదైనా.. లేక చిన్నదైనా.. చాలా పొందిగ్గా అలంకరించుకొని ఇంటికి మంచి లుక్ తీసుకొస్తారు గృహిణులు. కానీ బాత్రూమ్ విషయానికి వచ్చే సరికి మాత్రం ఎక్కడి వస్తువులు అక్కడ నామమాత్రంగా సర్ది వూరుకుంటారు. సృజనాత్మకంగా దానిని అలంకరించాలన్నా లేక అందంగా తీర్చిదిద్దాలన్నా తగినంత స్థలం ఆ గదిలో ఉండకపోవడమే అందుకు కారణం. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చిన్నదిగా ఉన్న బాత్రూమ్‌ని కూడా కాస్త పెద్దదిగా కనిపించేలా చేస్తూనే అందంగా అలంకరించుకోవచ్చంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ ఓసారి తెలుసుకుందాం రండి..

తెలుపు రంగుతో..

బాత్రూమ్‌లో చాలామంది సింక్, టైల్స్.. వంటివి తెలుపు రంగులో ఉన్నవాటినే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గోడలకు కూడా తెలుపు రంగు పెయింట్ వేయిస్తే గదంతా ప్రకాశవంతంగా కనిపించడమే కాదు.. కాస్త విశాలంగానూ కనబడుతుంది. అయితే ప్లెయిన్ కలర్‌ని ఉపయోగించడం ఇష్టం లేనివారు దీనిని మెటాలిక్ లేదా గోల్డ్ షేడ్స్‌తో కూడా మిక్స్ చేసి కూడా పెయింట్ చేసుకోవచ్చు. ఫలితంగా భిన్నమైన లుక్‌తోపాటు బాత్రూమ్ కాస్త పెద్దదిగానూ కనిపించేలా చేయచ్చు. అలాగే తెలుపు రంగు ఉపయోగించమన్నాం కదాని మొత్తం గదిని అదే రంగుతో నింపేస్తే లుక్ అంతా ఎబ్బెట్టుగా కనిపించే అవకాశాలూ లేకపోలేవు. అందుకే ఓవైపు తెలుపు రంగుని ఎక్కువగా ఉపయోగిస్తూనే మిగతా షేడ్స్‌ని కూడా ఇంటీరియర్‌లో భాగం చేయాలి.

గోడపైనే పొందిగ్గా..!

మనం ఉపయోగించే రకరకాల సబ్బులు, షాంపూలు.. అన్నీ బాత్రూమ్‌లోనే అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకించి స్థలం లేదు అనుకున్నప్పుడు గోడకు చిన్న చిన్న షెల్ఫ్స్ ఏర్పాటుచేసి వాటిపైనే అవన్నీ అందంగా సర్దుకోవచ్చు. పైగా ఈ షెల్ఫ్‌లను మనకు నచ్చినట్లు అలంకరించుకునే వీలు కూడా ఉంటుంది. అంతేకాదు.. వుడెన్, గ్లాస్.. ఇలా మీకు నచ్చిన తరహాలో ఉన్న షెల్ఫ్‌లను ఏర్పాటుచేసుకోవడం ద్వారా కూడా బాత్రూమ్‌కి భిన్నమైన లుక్‌ని తీసుకురావచ్చు. అయితే ఎంచుకున్న మెటీరియల్‌కు అనుగుణంగానే దానిని అలంకరించడం కూడా ముఖ్యమే అని గుర్తుంచుకోవాలి సుమా! అలాగే బాత్రూమ్‌లో ఉపయోగించే వాష్‌బేసిన్ దగ్గరే గోడకు ఈ షెల్ఫ్‌లను ఏర్పాటుచేసుకోవడం ద్వారా స్థలాభావం సమస్య కూడా అంతగా కనిపించదు.

అందమైన అద్దం..!

ప్రదేశం ఏదైనా సరే.. చిన్నదిగా కనిపించినప్పుడు దాన్ని విశాలంగా కనిపించేలా చేయాలంటే చాలామంది పాటించే మొట్టమొదటి చిట్కా ఆ ప్రదేశంలో ఒక అద్దాన్ని అమర్చడం. దీనినే బాత్రూమ్ విషయంలో కూడా అనుసరించవచ్చు. అయితే ఇందుకు ఎంపిక చేసుకునే అద్దం డిజైన్, పరిమాణం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరీ చిన్నదిగా లేదా పెద్దదిగా కాకుండా మధ్యస్థ పరిమాణంలో ఉన్న అద్దాన్ని ఎంపిక చేసుకొని బాత్రూమ్‌లో గోడకు ఫిట్ చేసి చూడండి. దానిలో కనిపించే ప్రతిబింబం వల్ల బాత్రూమ్ కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఆ అద్దం చుట్టూ అందమైన స్టిక్కర్స్ లేదా తీగజాతి పూలను అమర్చండి. ఇది గది మొత్తానికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.

ప్రకాశవంతంగా కనిపించేలా..

ఇంటిని అందంగా, పొందిగ్గా అమర్చుకునే చాలామంది బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అంతగా దృష్టి సారించరనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ గదిలో ఏర్పాటుచేసే వెలుతురు విషయంలోనూ కాస్త అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. అయితే బాత్రూమ్ ఉన్నదాని కంటే కొంచెం పెద్ద పరిమాణంలో కనిపించాలంటే అందుకు ఆ గదిలో ఏర్పాటుచేసే లైటింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే! సాధారణంగా గదిలో వెలుతురు ఎంత ఎక్కువగా ఉంటే గది అంత విశాలంగా కనిపించే అవకాశాలుంటాయి. కాబట్టి బాత్రూమ్‌లో లైట్లు బిగించేటప్పుడు ఈ విషయం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే గది మధ్యలో ఒక లైట్ పెట్టి వదిలేయడం కాకుండా చిన్న చిన్న సీలింగ్ లైట్స్ అమర్చుకోవడం ద్వారా కూడా ఆ గదికి కాస్త స్పెషల్ లుక్ తీసుకురావచ్చు.

ఈ చిట్కాలు కూడా..

* గోడలు, నేలపై ఉపయోగించే టైల్స్ కలర్ ఒకేలా ఉన్నవి ఎంపిక చేసుకోవడం లేదా గోడలపై వేసిన రంగు, సీలింగ్‌కు మ్యాచయ్యే విధంగా జాగ్రత్తపడడం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాలో కావడానికి ప్రయత్నించాలి.

* బాత్రూమ్ పరిమాణం మరీ చిన్నదిగా ఉన్నప్పుడు బాత్‌టబ్ వంటివి అందులో ఏర్పాటుచేసుకోకపోవడమే మంచిది.

* స్థలం చాలా తక్కువగా ఉన్నప్పుడు అనవసరమైన వస్తువులకు బాత్రూమ్‌లో స్థానం ఇవ్వకండి. ఒకవేళ మరీ తప్పదనిపిస్తే అలాంటి వస్తువులను బయటకు కనిపించకుండా పొందిగ్గా అమర్చండి.

చూశారుగా.. పరిమాణంలో చిన్నదిగా ఉన్న బాత్రూమ్‌ని కాస్త విశాలంగా కనిపించేలా చేయాలంటే పాటించాల్సిన చిట్కాలు.. అయితే ఇవి కొన్ని మాత్రమే.. మీకు దగ్గర్లోని ఇంటీరియర్ నిపుణులను ఒకసారి సంప్రదిస్తే మీ గదికి అనుగుణంగా ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అందులో ఏమేమి ఎలా అమర్చుకోవాలి.. మొదలైన విషయాలు మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏమంటారు??


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని