Breast Cancer Survivor: ఈ జీవనశైలితోనే క్యాన్సర్‌ను జయించా!

క్యాన్సర్‌.. ఈ పేరు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది.. జీవితం ఇంతటితో ముగిసినట్లే అన్న వైరాగ్యం ఆవహిస్తుంది.. ప్రతి క్షణం భయంతోనే సావాసం చేయాల్సి వస్తుంది.. నిజానికి క్యాన్సర్‌ కంటే ఇలాంటి ప్రతికూల ఆలోచనలే ఎంతోమంది జీవితాల్ని కబళిస్తున్నాయని..

Published : 25 Oct 2021 15:56 IST

(Photos: Facebook)

క్యాన్సర్‌.. ఈ పేరు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది.. జీవితం ఇంతటితో ముగిసినట్లే అన్న వైరాగ్యం ఆవహిస్తుంది.. ప్రతి క్షణం భయంతోనే సావాసం చేయాల్సి వస్తుంది.. నిజానికి క్యాన్సర్‌ కంటే ఇలాంటి ప్రతికూల ఆలోచనలే ఎంతోమంది జీవితాల్ని కబళిస్తున్నాయని చెబుతోంది నాగాలాండ్‌కు చెందిన చెరిల్ కైర్ అచుమి ఒకానొక దశలో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన ఆమె.. నా జీవితం ఇంతేనేమోనని భయపడలేదు. ఈ మహమ్మారిని ఎలాగైనా జయించాలన్న ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.. చక్కటి జీవనశైలిని అలవర్చుకుంది.. ప్రతిగా క్యాన్సర్‌ను జయించడమే కాదు.. ప్రత్యేకంగా ఓ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేసి అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతోంది. అందరి ఆరోగ్యాన్ని కాంక్షించే మహిళలకు తమ విషయంలో మాత్రం నిర్లక్ష్యం కూడదంటోన్న ఈ డేరింగ్‌ లేడీ.. తన క్యాన్సర్‌ అనుభవాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

నేను పుట్టి పెరిగిందంతా నాగాలాండ్‌లోని దిమాపూర్‌లోనే! హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, బీఏ ఇంగ్లిష్‌ చదివా. ఆ తర్వాత అటు ఉద్యోగం చేస్తూనే ఇటు సైడ్‌ బిజినెస్‌ చేసేదాన్ని. నాకు చిన్నతనం నుంచే వ్యాపారమంటే ఆసక్తి ఎక్కువ. ఈ మక్కువ వల్లేనేమో కొన్నాళ్లకు ఉద్యోగం మానేసి అప్పటిదాకా పార్ట్‌టైమ్‌గా చేస్తోన్న వ్యాపారాన్ని ఫుల్‌టైమ్‌గా మార్చుకున్నా.

అది 2014. అప్పటికే పెళ్లై నాకిద్దరు పిల్లలు పుట్టారు. మావారు అబ్రహాం బొటోకింగ్‌. తను వృత్తిరీత్యా బ్యాంకర్. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కూడా! నాకూ ముందు నుంచీ ఆరోగ్యంపై శ్రద్ధ కాస్త ఎక్కువే! మావారి ప్రోత్సాహంతో అడపాదడపా వ్యాయామాలూ చేసేదాన్ని. అయితే ఇలా కుటుంబంతో హాయిగా సాగిపోతున్న నా జీవితంలోకి క్యాన్సర్‌ మహమ్మారి ప్రవేశించింది. ఓ రోజు నా రొమ్ములో చిన్న గడ్డ తగిలినట్లనిపించింది. ఎందుకైనా మంచిదని డాక్టర్‌ దగ్గరికెళ్లి పరీక్ష చేయించుకున్నా. నా అనుమానమే నిజమైంది. నాకు రొమ్ము క్యాన్సర్‌ తొలి దశలో ఉందని డాక్టర్‌ చెప్పారు. ఆ సమయంలో నా మనసులో ఏదో తెలియని ఆందోళన! అయినా ‘భయపడాల్సిందేమీ లేదని.. చక్కటి జీవనశైలి మార్పులతో ఈ వ్యాధిని జయించచ్చ’ని వైద్యులు చెప్పిన మాటలు నా మనసుకు కాస్త ఊరట కలిగించాయి. ఆ వెంటనే చికిత్స మొదలైంది. కీమోథెరపీ, రేడియోథెరపీ, మూడు ఆపరేషన్లు అయ్యాయి. ఈ క్రమంలో భరించలేనంత నొప్పి, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. అన్నీ మూకుమ్మడిగా నాపై దాడి చేశాయి. వీటికి తోడు మందుల కారణంగా సుమారు ఇరవై కిలోల బరువు పెరిగాను.

******

దీంతో ఏదైనా చిన్న పని చేద్దామన్నా శరీరం సహకరించేది కాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మా వారే నాకు అండగా నిలిచారు. ‘వ్యాయామంతోనే నువ్వు కోలుకోగలవు’ అన్నారు. ఆయన సలహా మేరకు కోర్‌ వ్యాయామాలు, బరువులెత్తే వర్కవుట్లు, స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజెస్‌.. వంటివన్నీ క్రమంగా సాధన చేయడం ప్రారంభించా. అలాగే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకున్నా. కాయగూరలు, పండ్లు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌, సూప్స్‌.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నా. ఇక డాక్టర్‌ సలహా మేరకు కొన్ని విటమిన్‌ సప్లిమెంట్స్‌ కూడా వాడాను. తద్వారా క్రమంగా నా బరువు అదుపులోకి రావడం మొదలైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు క్యాన్సర్‌ నుంచీ కోలుకోగలిగా. అయితే నా లైఫ్‌స్టైల్‌ను మాత్రం మార్చుకోలేదు.. ఇప్పటికీ, ఎప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలినే పాటించాలని నిర్ణయించుకున్నా.

అయితే ఈ వ్యాధికి చికిత్స తీసుకునే క్రమంలో ఎన్నో ఆలోచనలు నా మదిలో మెదిలేవి. ఆరోగ్య స్పృహ పెంచడానికి, ఫిట్‌నెస్‌ విషయంలో నన్ను ప్రోత్సహించడానికి నాకంటూ ఓ వ్యక్తి పక్కనే ఉన్నారు. కానీ అందరికీ ఈ అవకాశం ఉండచ్చు.. ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యత నేను తీసుకోవాలనుకున్నా. ఇదే విషయమై మా వారితో చర్చిస్తే సరేనన్నారు. తనూ తన బ్యాంకింగ్‌ ఉద్యోగాన్ని వదులుకొని ఈ వ్యాపారం పైనే పూర్తి దృష్టి పెట్టారు. ఇలా 2016లో ‘City Gymn’ పేరుతో ఓ జిమ్‌ సెంటర్‌ని ప్రారంభించాం. మా జిమ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సెక్షన్‌ని కూడా ఏర్పాటుచేశాం. అయితే ఇందుకూ ఓ కారణముంది.. చాలామంది మహిళలు కుటుంబ ఆరోగ్య విషయంలో తీసుకున్నంత శ్రద్ధ తమ విషయంలో తీసుకోరు. ఒక రకంగా చెప్పాలంటే.. క్యాన్సర్‌ వంటి మహమ్మారుల బారిన పడడానికి ఈ నిర్లక్ష్యమే కారణం. అందుకే మహిళల్ని ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ దిశగా ప్రోత్సహించడానికి, వారు కంఫర్టబుల్‌గా వ్యాయామాలు చేసుకోవడానికి ఇలా ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటుచేశాం. ఇలా మా జిమ్‌లో ఇప్పటివరకు వందలాది మంది శిక్షణ పొంది ఫిట్‌నెస్‌పై పట్టు సాధించారు.. ఆరోగ్యం ప్రాముఖ్యాన్ని ఒంటబట్టించుకున్నారు.

******

అయితే లాక్‌డౌన్‌ సమయంలో మా వద్ద శిక్షణ పొందే వృద్ధుల కోసం వారిళ్లకే కొన్ని జిమ్‌ పరికరాల్ని పంపించాం. తద్వారా వారు నిర్భయంగా, సురక్షితంగా వ్యాయామాలు సాధన చేసుకోగలిగారు. ఇలా ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేయడంతో పాటు.. మరోవైపు ఔత్సాహిక వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడానికి, వారి వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టడానికి రూపొందించిన ‘Her&Now Entrepreneurship Support Programme’లోనూ భాగమయ్యాను. భవిష్యత్తులో మరిన్ని జిమ్‌ సెంటర్లు, ఆటస్థలాలు తెరిచి వీటి ద్వారా అందరిలో ఆరోగ్య స్పృహ పెంచాలన్న ఆలోచన కూడా ఉంది.

క్యాన్సర్‌ను జయించిన అనుభవంతో మహిళలందరికీ ఆఖరుగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఈ మహమ్మారిని నివారించాలంటే ఎవరికి వారు స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకోవడం తప్పనిసరి. అలాగే రొమ్ము క్యాన్సర్‌ గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం కూడా ముఖ్యమే! వయసును బట్టి నిర్ణీత వ్యవధుల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం.. చాలా ముఖ్యం! అలాగే మీకు తెలిసిన విషయాల్ని ఇతరులతో పంచుకుంటూ వారిలోనూ అవగాహన పెంచగలిగితే మనల్ని మనం కొంత వరకు కాపాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్