Women in Manufacturing: ఏదైనా ‘తయారు’ చేసేస్తాం!
నట్టు బిగిస్తానంటే.. అమ్మాయివి నీవల్లేమవుతుందిలే అంటారు..నట్టు బిగిస్తానంటే.. అమ్మాయివి నీవల్లేమవుతుందిలే అంటారు..వెల్డింగ్ చేసే మహిళల్ని ‘ఇంకే పనీ దొరకలేదా’ అన్నట్లు చులకనగా చూస్తుంటారు..పెద్ద పెద్ద పరికరాల్ని అనుసంధానం చేయడం మహిళలకు చేతకాదనుకుంటారు..
నట్టు బిగిస్తానంటే.. అమ్మాయివి నీవల్లేమవుతుందిలే అంటారు..
నట్టు బిగిస్తానంటే.. అమ్మాయివి నీవల్లేమవుతుందిలే అంటారు..
వెల్డింగ్ చేసే మహిళల్ని ‘ఇంకే పనీ దొరకలేదా’ అన్నట్లు చులకనగా చూస్తుంటారు..
పెద్ద పెద్ద పరికరాల్ని అనుసంధానం చేయడం మహిళలకు చేతకాదనుకుంటారు..
ఇలాంటి మూసధోరణుల్ని తోసిరాజని ఎంతోమంది అతివలు తయారీ రంగంలో తమదైన ప్రతిభ కనబరుస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే కంపెనీలు కూడా మహిళల వైపే మొగ్గు చూపుతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్స్, మైనింగ్, భారీ ఇంజినీరింగ్ ప్రాజెక్టులు.. వంటి పురుషాధిపత్యం ఉన్న రంగాల్లో అనుభవజ్ఞులైన మహిళలకు ప్రస్తుతం అపార అవకాశాలు లభిస్తున్నాయంటున్నారు నిపుణులు.
మరికొన్ని కంపెనీలు కూడా ప్రస్తుతం ఇదే పంథాలో కొనసాగుతున్నాయి. ఇంతకీ పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలో కంపెనీలు మహిళల వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? ఇందులో రాణించాలంటే ఔత్సాహిక మహిళలు అందిపుచ్చుకోవాల్సిన నైపుణ్యాలేంటి? ఈ రంగంలో మహిళల భవితవ్యం ఎలా ఉండనుంది? తదితర విషయాల గురించిన ప్రత్యేక కథనం ఇది!
పురుషాధిపత్యం వేళ్లూనుకుపోయిన రంగాల్లో తయారీ రంగం ఒకటని చెప్పాలి. మహిళల శక్తియుక్తుల్ని తక్కువ చేసి చూపడం, వారిపై ఉన్న వివక్ష, సమాజాన్ని పట్టి పీడిస్తోన్న మూసధోరణులు.. ఇలా ఎన్నో అంశాలు వారి ఆశలకు గండి కొడుతున్నాయి. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. అరుదైన రంగాల్ని కెరీర్ ఆప్షన్లుగా ఎంచుకునే అమ్మాయిలు పెరుగుతున్నారు. వాళ్ల ఆసక్తిని, నైపుణ్యాలను గమనించి కంపెనీలూ మహిళల వైపే మొగ్గు చూపుతున్నాయంటున్నాయి పలు అధ్యయనాలు.
ఇక్కడ స్త్రీలదే హవా!
పురుషాధిపత్యం అధికంగా ఉండే మైనింగ్, ఆటోమొబైల్స్, భారీ ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో గతంతో పోలిస్తే - ఇటీవలి కాలంలో మహిళల సంఖ్య పెరిగిందని కొన్ని కంపెనీలు మహిళలకిస్తోన్న ప్రాధాన్యాన్ని బట్టి అర్థమవుతోంది.
* టాటా స్టీల్ ‘Women@Mines’ కార్యక్రమంలో భాగంగా.. జార్ఖండ్‌లోని బొకారో గనుల్లో భారీ ఎర్త్ మూవింగ్ ఆపరేటర్లుగా 38 మంది మహిళల్ని నియమించుకుంది.
* హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ పశ్చిమ బంగలోని సిలిగురిలో త్వరలోనే ఓ ఫ్యాక్టరీని ప్రారంభించే పనుల్లో ఉంది. ఇందుకోసం 60 శాతం మంది మహిళా ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
* Daimler India Commercial Vehicles సంస్థ చెన్నై ప్లాంట్ (Oragadam truck and bus manufacturing complex) లో విధుల నిమిత్తం 46 మంది మహిళలకు ఉద్యోగమిచ్చింది.
* గతేడాది తమిళనాడులో నెలకొల్పిన ‘ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ ఈ-స్కూటర్ల కంపెనీ తయారీ యూనిట్‌ను పూర్తిగా మహిళలతో నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో 10 వేల మంది మహిళల్ని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. ఇప్పటికే కొంతమందిని విధుల్లోకి తీసుకొని పనులు కూడా ప్రారంభించిందీ కంపెనీ.
* తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని కనయూరులో కిర్లోస్కర్ సంస్థ గృహావసరాలకు ఉపయోగపడే పంపుల తయారీ యూనిట్‌ని నడుపుతోంది. ఇందులో ప్రొడక్షన్ నుంచి ప్యాకింగ్ వరకు అన్ని విభాగాల్లోనూ మహిళలదే హవా! ప్రస్తుతం 204 మంది మహిళలు పనిచేస్తోన్న ఈ సంస్థ.. నెలకు ఐదు లక్షల యూనిట్లని ఉత్పత్తి చేస్తూ.. ఏడాదికి సుమారు రూ.132 కోట్లు ఆర్జిస్తోంది.
* ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని తయారుచేసే ‘Syrma Technology Pvt Ltd.’ సంస్థ అన్ని శాఖల్లో కలిపి 1800కు పైగా మహిళలకు శిక్షణనిస్తోంది.
* ప్రముఖ అల్యూమినియం ఉత్పత్తి సంస్థ ‘వేదాంత అల్యూమినియం’ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘Vedanta#BreakTheBias’ Augmented Reality (AR) క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. విద్యార్థినులు, మహిళలు తయారీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోమని ప్రోత్సహించడమే దీని ముఖ్యోద్దేశం!
అందుకే మహిళలే కావాలంటున్నాయ్!
ఇలా చెప్పుకుంటూపోతే ఈ మధ్య కాలంలో ఎన్నో తయారీ రంగ సంస్థలు మహిళలకు రెడ్ కార్పెట్ వేసి మరీ తమ కంపెనీలోకి ఆహ్వానిస్తున్నాయన్నది స్పష్టమవుతోంది. అయితే చాలా సంస్థలు ఇలా మహిళల వైపు మొగ్గు చూపడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.
* కంపెనీల మధ్య పోటీతత్వం ఉన్నప్పుడే మార్కెట్లో నిలదొక్కుకోగలం.. ఎక్కువ మంది వినియోగదారుల్ని ఆకట్టుకోగలం. అయితే ప్రతిభతో పాటు సృజనాత్మకత కలగలిసిన ఉద్యోగులున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయంలో పురుషులతో పోల్చితే మహిళలే నాలుగాకులు ఎక్కువ చదివారంటున్నారు నిపుణులు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చాలా కంపెనీలు స్త్రీలకే ప్రాధాన్యమిస్తున్నారని చెబుతున్నారు.
* మహిళలు సున్నిత మనస్కులు. చేసే పనిలో, మాట్లాడే మాటల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. ఇక పని చేస్తున్నప్పుడు కూడా బిగ్గరగా అరవడం, ఒకరినొకరు మాటలనుకోవడం వంటివి చేయరట. తద్వారా ఇతరుల పనికి ఆటంకం కలగకుండా ఉంటుంది. అలాగే పనిలోనూ ఒకరికొకరు సహకరించుకునే స్వభావం వీరికి ఎక్కువట! అంతేకాదు.. పని పూర్తయ్యే వరకు ఎంతో ఓపికను, నేర్పును ప్రదర్శిస్తుంటారు. ఈ లక్షణాల వల్లే రిక్రూటర్లు అతివలకు ఎక్కువ అవకాశాలిచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
* పెళ్లి, పిల్లలు, ఇతర బాధ్యతల రీత్యా.. కొన్నాళ్ల పాటు కెరీర్ బ్రేక్ తీసుకున్నా.. ఆపై తిరిగి విధుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు పలువురు మహిళలు. కెరీర్‌లో రాణించడానికి తపన పడుతున్నారు. తయారీ రంగ సంస్థలు స్త్రీలను తమ ఫుల్‌టైమ్ ఉద్యోగులుగా నియమించుకోవడానికి వృత్తి పట్ల వారిలో ఉన్న ఈ ఆసక్తే కారణం అని చెబుతున్నారు నిపుణులు.
* నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడంతో పాటు మహిళల్ని నియమించుకోవడం, సంస్థను ముందుకు తీసుకెళ్లడం.. వంటివన్నీ తెలివైన వ్యాపారంలో భాగమేనంటున్నారు నిపుణులు. తయారీ సంస్థలు మహిళల వైపు మొగ్గుచూపడానికి ఇదీ ఓ కారణమేనట!
* మహిళల పనితనం, నైపుణ్యాలను ఒంట బట్టించుకునే తీరు, లోపాల్ని పసిగట్టి వాటిని పరిష్కరించే నేర్పు.. ఇవే తయారీ రంగంలో అతివలకు భారీ అవకాశాల్ని తెచ్చిపెడుతున్నాయంటున్నారు నిపుణులు.
సౌకర్యాలకూ కొదవ లేదు!
కేవలం ఇలా మహిళలకు ఉద్యోగాలివ్వడమే కాదు.. వారికి అనువుగా ఉండేందుకు పని ప్రదేశంలో సకల సౌకర్యాలూ సమకూర్చుతున్నాయి కొన్ని కంపెనీలు.
* తయారీ రంగ సంస్థల్లో వారాంతపు సెలవులతో పని లేకుండా నిరంతరాయంగా పని చేయాల్సిందే! ఈ క్రమంలో వారానికి ఏదో ఒక రోజు వీక్లీ-ఆఫ్ తీసుకోవచ్చు. అలాగే ఆడ-మగ భేదం లేకుండా ఏ షిఫ్ట్‌లోనైనా పనిచేయాల్సిందే! అయితే ఇందులో భాగంగా కొన్ని కంపెనీలు తమ మహిళా ఉద్యోగులు ఫలానా షిఫ్ట్‌లోనే రావాలన్న నియమమేమీ పెట్టకుండా వారి సౌకర్యార్థం ఏదో ఒక షిఫ్ట్‌లో పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అలాగే మెటర్నిటీ బెనిఫిట్స్ సదుపాయం అందిస్తున్నాయి.
* పని ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులు/ఇతర సమస్యలకు గురికాకుండా కొన్ని కంపెనీలు ప్రత్యేక పాలసీలు రూపొందిస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఎదురైనా.. అందుకు కారణమైన ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్నా పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడట్లేదు.
* కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్న వారిని చూసి భవిష్యత్తులో తామూ ఏదో ఒక రోజు అంతటి స్థాయికి ఎదగాలని ఆరాటపడే వారు ఎంతోమంది ఉంటారు. అయితే ఈ క్రమంలో మహిళలు తమ మహిళా బాస్‌లు/పైఅధికారుల్ని చూసి స్ఫూర్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొనే మహిళా ఉద్యోగులకు మహిళా బాస్‌లను నియమిస్తున్నట్లు కొన్ని కంపెనీ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇది కూడా మహిళలు కెరీర్‌లో ఎదగడానికి సంస్థలు కల్పిస్తోన్న సౌకర్యమే!
* ఫ్రెషర్స్ అయినా, నైపుణ్యాలు నేర్చుకున్న వారైనా.. ఇటు ఉద్యోగం చేస్తూనే, అటు జాబ్‌కి సంబంధించిన ఇతర మెలకువలు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఖాళీ సమయంలో బయటికెళ్లి సంబంధిత కోర్సులు నేర్చుకోలేని మహిళలకు ఇది మహదవకాశమే అని చెప్పాలి.
అందిపుచ్చుకుంటే అందలమే!
రోజురోజుకీ అవకాశాలు పెరుగుతోన్న తయారీ రంగాన్నే మహిళలు తమ కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవాలంటే అందుకు కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.
* ఏ ఉద్యోగంలోనైనా సవాళ్లు సహజం. అందుకే వాటిని పాజిటివ్‌గా స్వీకరించి ఎదుర్కొనే నైపుణ్యాలను సంపాదించుకోవాలి. ఈ క్రమంలో మీలో ఉన్న బలాలతో బలహీనతల్ని అధిగమించాలని చెబుతున్నారు నిపుణులు.
* తయారీ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, ఇందులో చోటుచేసుకుంటోన్న మార్పులు-చేర్పులు, టెక్నాలజీ వినియోగం.. వంటి విషయాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి.
* ముఖ్యంగా AI, 3-D ప్రింటింగ్.. వంటి టెక్నాలజీలతో పాటు వేగంగా పనులు పూర్తి చేసే సామర్థ్యం, క్రమంగా పొరపాట్లను తగ్గించుకుంటూ ఉత్పత్తి నాణ్యతను పెంచుకునేలా మన నైపుణ్యాలకు మెరుగులద్దాలి.
* మల్టీ టాస్కింగ్, క్రిటికల్ థింకింగ్, సృజనాత్మకత, ఓపిక.. వంటివీ తయారీ రంగంలో రాణించాలంటే ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు. కాబట్టి ఉద్యోగంలో చేరడానికి ముందే ఈ లక్షణాలన్నీ అలవర్చుకుంటే ఆ తర్వాత అందులో నిలదొక్కుకోవడం సులువవుతుంది.
* సహచరులతో, వినియోగదారులతో సులభంగా కలిసిపోయేందుకు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు.
* తయారీ రంగంలోకి వెళ్లాలని ముందు నుంచే నిర్ణయించుకున్న అమ్మాయిలు.. తమ అకడమిక్ కోర్సుల్లో STEM (Science, Technology, Engineering, Mathematics) సబ్జెక్టులుండేలా చూసుకోవాలి. అలాగే అప్పటికే ఈ రంగంలో ఉన్న వారితో టచ్‌లో ఉంటూ సంబంధిత స్కిల్స్‌ని అవపోసన పడితే మరీ మంచిది.
ఇలా ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే తయారీ రంగంలో మనదైన ముద్ర వేయడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. ఇక ఇంట్లో వాళ్లు, సమాజం.. కష్టమైన రంగం అంటూ అమ్మాయిల్ని నిరుత్సాహపరచకుండా వారి ఆసక్తులకు ప్రాధాన్యమిస్తే తయారీ రంగంలోనూ కొద్ది రోజుల్లోనే లింగ సమానత్వాన్ని చూడచ్చు.. మరి, మీరేమంటారు?
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.