Published : 04/11/2021 12:27 IST

ఈ ‘కాఫీ లేడీ’ కథేంటో తెలుసా?

(Photo: Instagram)

‘వ్యాపారం ప్రారంభించాలనుకుంటే సరిపోదు.. అందుకు తగిన పెట్టుబడి మన వద్ద ఉండాలి.. నష్టాలొస్తే తట్టుకునే శక్తిని కూడగట్టుకోవాలి.. అప్పుడే విజయం సాధించగలం’ అంటోంది నాగాలాండ్‌కి చెందిన జకిత్సోనో జమీర్. ‘కాఫీ లేడీ ఆఫ్‌ నాగాలాండ్‌’గా పేరుగాంచిన ఆమె.. ఇప్పుడీ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి చేసింది. మధ్యలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా తన ఆశయాన్ని మాత్రం వదల్లేదామె. తనొక్కర్తే ఎదగడం కాకుండా.. తన చుట్టూ ఉన్న మహిళలూ స్వశక్తితో పైకి రావాలని కోరుకునే జమీర్‌.. వారికీ పలు స్వయం ఉపాధి మార్గాలను సూచిస్తోంది. కెరీర్‌ ఏదైనా తప్పొప్పులకు తల వంచకుండా స్వీయ నమ్మకంతో ముందుకు సాగినప్పుడే విజయం తథ్యమంటోన్న ఈ కాఫీ లేడీ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

జకిత్సోనో జమీర్‌ నాగాలాండ్‌ దిమాపూర్‌ జిల్లా Medziphema అనే గ్రామంలో పుట్టి పెరిగింది. పెద్దయ్యాక అందరిలా కాకుండా తనకంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని చిన్నతనం నుంచీ కోరుకునేది. అందుకు వ్యాపారమే సరైన మార్గమని నిర్ణయించుకున్న ఆమె.. చదువు పూర్తయ్యాక ఈ వైపుగా దృష్టి పెట్టాలనుకుంది. అయితే సాహిత్యంలో డిగ్రీ చదువుతోన్న సమయంలో ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చిందామె.

వర్క్‌షాప్‌లో వచ్చిన ఆలోచన!

ఇక తన సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని నిర్ణయించుకుంది జమీర్‌. కానీ ఏ బిజినెస్‌ ప్రారంభించాలో ఆ సమయంలో తనకు అర్థం కాలేదు. అప్పుడే కాఫీ తయారీ గురించి స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ వర్క్‌షాప్‌కి హాజరైందామె. కాఫీ గింజల్ని సాగు చేయడం దగ్గర్నుంచి కప్పులోకొచ్చేదాకా ప్రతి విషయాన్నీ తలకెక్కించుకుంది. కాఫీ ప్రత్యేకతల గురించి ఇంటర్నెట్‌లో శోధించి మరిన్ని విషయాలు తెలుసుకుంది. ఇలా కాఫీ లవర్‌గా మారిపోయిన ఆమె.. అదే తన వ్యాపారమని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే 2018లో ‘Farmers Square Cafe’ పేరుతో ఓ కాఫీ షాప్‌ని ప్రారంభించింది.

అప్పుడు కలిసి రాలేదు!

‘కాఫీతో ప్రయోగాలు చేయడం నాకిష్టం. అయితే ఆర్థిక కారణాల వల్ల వ్యాపారం ప్రారంభించిన కొన్ని నెలలకే షాప్‌ని తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. కానీ నాలో ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కడా సడల్లేదు. అదే ఏడాది స్థానికంగా ఏర్పాటు చేసిన ‘Her & Now’ (జర్మన్‌ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ, స్థానిక భాగస్వాములతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం) అనే వ్యాపార అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా. గతంలో నేను చేసిన తప్పొప్పులు తెలుసుకున్నా.. నా వ్యాపార నైపుణ్యాలకు మెరుగులద్దుకున్నా. తాత్కాలికంగా మూసేసిన నా షాపుని తిరిగి 2019లో తెరిచా. ఇక అప్పట్నుంచి నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోంది..’ అంటోంది జమీర్.

అవే మా ప్రత్యేకతలు!

ఎప్పుడో తయారుచేసి ప్యాక్‌ చేసిన కాఫీ పొడి కంటే.. కాఫీ గింజల్ని అప్పటికప్పుడు పొడి చేసుకొని తయారుచేసుకునే కాఫీ ఎంతో రుచికరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే! అయితే మనకు ఇంట్లో అంత ఓపిక, తీరిక ఉండకపోవచ్చు. అంత శ్రద్ధగా కాఫీ తయారుచేసి అందించే కెఫేలను కూడా వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. తమదీ అలాంటి అరుదైన కెఫే అంటోంది జమీర్.

‘కాఫీ బీన్స్‌ని అప్పటికప్పుడు పొడి చేసి తాజాగా, రుచికరమైన కాఫీని తయారుచేసి, డెకరేట్‌ చేసి అందించడం మా ప్రత్యేకత. ఈ క్రమంలో కాఫీ తయారీ దగ్గర్నుంచి వినియోగదారులకు అందించడం దాకా.. ఇలా అన్నింట్లోనూ పర్యావరణహితమైన వస్తువుల్నే వాడతాం. మా షాపు వాతావరణం కూడా ఎకో-ఫ్రెండ్లీగానే ఉంటుంది. స్థానికంగా తయారుచేసిన పచ్చళ్లు, క్యాన్‌డ్‌ పైనాపిల్స్‌, సాస్‌తో పాటు ప్రత్యేకంగా పండించిన పుట్టగొడుగులూ మా షాపులో దొరుకుతాయి..’ అంటూ తమ కాఫీ షాప్‌ ప్రత్యేకతల గురించి చెప్పుకొచ్చిందీ కాఫీ లేడీ.

వాళ్లూ ఎదగాలని..!

ఇలా తన కాఫీ బిజినెస్‌తో కొంతమంది మహిళలకూ ఉపాధి కల్పిస్తోంది జమీర్‌. అంతేకాదు.. మహిళలు స్వశక్తితో జీవించాలన్న సిద్ధాంతాన్ని నమ్మే ఆమె.. కాఫీ తయారీలో భాగంగా స్థానిక మహిళలకు వర్క్‌షాప్స్‌ సైతం నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో వివిధ రకాల కాఫీలు; కాఫీ తయారీలో మెలకువలు;  కాఫీ రుచి, వాసనలు పసిగట్టే సామర్థ్యం.. వంటి అంశాల్లో ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇస్తోంది. ఆసక్తి ఉన్న యువతులకు కాఫీ పంటల సాగులో మెలకువలు నేర్పిస్తూ వారికి అన్ని రకాలుగా అండగా ఉంటోందీ కాఫీ లవర్!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని