మీరో అగ్నిపర్వతం.. ఎవరూ అణచివేయలేరు..!
వివిధ ఆంక్షలు, కట్టుబాట్ల పేరుతో పితృస్వామ్య భావజాలం రాజ్యమేలే కొన్ని దేశాల్లో మహిళల పరిస్థితి గురించి వింటూనే ఉంటాం. ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న సంఘటనలు దీనికి అడ్డం పడుతున్నాయి. హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న అభియోగంపై అరెస్ట్ అయిన ఇరాన్ యువతి మాసా....
వివిధ ఆంక్షలు, కట్టుబాట్ల పేరుతో పితృస్వామ్య భావజాలం రాజ్యమేలే కొన్ని దేశాల్లో మహిళల పరిస్థితి గురించి వింటూనే ఉంటాం. ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న సంఘటనలు దీనికి అడ్డం పడుతున్నాయి. హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న అభియోగంపై అరెస్ట్ అయిన ఇరాన్ యువతి మాసా అమీని మరణంతో అక్కడి మహిళల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. చట్టాలు, నిబంధనల పేరిట వేషధారణ విషయంలో మహిళల స్వేచ్ఛను హరిస్తున్నారంటూ జరుగుతోన్న ఈ నిరసనలకు ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ మద్దతు తెలుపుతున్నారు.. మరోవైపు పలువురు సెలబ్రిటీలూ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ మహిళలకు అండగా నిలుస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా చేరిపోయింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ‘బలవంతపు మౌనం తర్వాత వినిపించే గళాలు అగ్నిపర్వతాల్లా ఇలాగే బద్దలవుతాయం’టూ ఇరాన్ మహిళల దుస్థితి పట్ల స్పందించింది ప్రియాంక. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్వాపరాలను ఓసారి పరిశీలిద్దాం..!
ఇరాన్‌లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ పాటించాలి. జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్ ధరించాలి. ఈ నియమాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ ఏడాది జులైలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలకు జరిమానాలు విధించడంతో పాటు వారిని అరెస్ట్ చేసేందుకు కూడా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా నైతిక పోలీసు విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు.
‘అణచివేతను ఇకనైనా ఆపండం’టూ..!
అయితే ఇలాంటి నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను మాసా అమీని అనే 22 ఏళ్ల యువతిని గత నెలలో అరెస్ట్ చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 16న మరణించింది. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో సెప్టెంబర్ 17న ప్రారంభమైన నిరసనలు.. ఇరాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులా విస్తరించాయి. చట్టాల పేరుతో ఏళ్ల తరబడి ఎదుర్కొంటోన్న అణచివేతను ఇకనైనా ఆపాలంటూ.. ఇరాన్ మహిళలు జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను తగలబెడుతూ నిరసనలు తెలుపుతున్నారు. దీన్ని అక్కడి ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. నిరసనలు చేస్తోన్న మహిళలపై భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో కొంతమంది మహిళలు అక్కడిక్కడే చనిపోవడం అక్కడి మహిళల దుస్థితికి అద్దం పడుతోంది.
అయితే అమీని భద్రతా దళాల దాడి కారణంగా చనిపోలేదని.. సెరిబ్రల్ హైపాక్సియా కారణంగా అవయవాల వైఫల్యంతో మరణించినట్లు అమీని మృతిపై విచారణ చేపట్టిన అధికారిక నివేదిక పేర్కొనడం గమనార్హం.
ఆ మౌనం లావాలా బద్దలైంది!
చట్టాన్ని అడ్డుపెట్టుకొని తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని హరిస్తున్నారంటూ ఇరాన్ మహిళలు చేస్తోన్న పోరాటానికి విదేశీ ప్రముఖులతో పాటు మన దేశానికి చెందిన పలువురు సినీ తారలు కూడా తమ మద్దతు పలుకుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ భామ మందనా కరీమి ముంబయి వీధుల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే! ఇక తాజాగా ప్రియాంక చోప్రా కూడా దీనిపై స్పందించింది. ఇరాన్ నిరసనలను ప్రతిబింబించేలా ఓ ఇలస్ట్రేషన్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె.. ‘ఏళ్లకేళ్లు అణచివేతతో మూగబోయిన గొంతులు ఒక్కసారిగా గళమెత్తితే.. ఇలా అగ్నిపర్వతం బద్దలైనట్లుగానే ఉంటుంది. వాటిని ఎవరూ అణచివేయలేరు. మీ ధైర్యానికి నా జోహార్లు. పితృస్వామ్య కట్టుబాట్లు ఉన్న చోట హక్కుల కోసం పోరాడడమంటే అదో పెను సవాలే! అయినా మీరు వెనకడుగు వేయట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇరాన్ మహిళలకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడి పాలకులు, అధికారులు నిరసనకారుల సమస్యలను అర్థం చేసుకొని వారికి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నా..’ అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది పీసీ.
ఆ హక్కు ఎవరికీ లేదు!
వివిధ మతాల ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయి. అయితే మతపరమైన విశ్వాసాల్ని అడ్డుపెట్టుకొని.. మహిళల హక్కుల్ని హరించడం, వారి స్వేచ్ఛకు భంగం కలిగించడం; నిబంధనలు, వాటి ఉల్లంఘనల పేరుతో వారిని హింసించడం మాత్రం సమంజసం కాదంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు. అసభ్యతకు తావివ్వనంత వరకు మహిళల ఆహార్యం గురించి ప్రశ్నించే హక్కు, దానిపై ఆంక్షలు విధించే అధికారం ఎవరికీ లేవని సమష్టిగా గొంతెత్తి నినదిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.