Sologamy: చెప్పినట్లే తనను తనే పెళ్లి చేసుకుంది!

మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటే అంత ఆనందంగా ఉండగలుగుతాం.. ఇతరులకూ అంతే ప్రేమను పంచగలుగుతాం.. అయితే తన ప్రేమను తనకు తప్ప మరే వ్యక్తికీ పంచనంటోంది గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు. తన జీవితంలో తనకు తప్ప మరే వ్యక్తికీ చోటు లేదంటోన్న ఆమె.. తనను తానే పెళ్లాడతానని....

Published : 09 Jun 2022 18:35 IST

(Photo: Instagram)

మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటే అంత ఆనందంగా ఉండగలుగుతాం.. ఇతరులకూ అంతే ప్రేమను పంచగలుగుతాం.. అయితే తన ప్రేమను తనకు తప్ప మరే వ్యక్తికీ పంచనంటోంది గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు. తన జీవితంలో తనకు తప్ప మరే వ్యక్తికీ చోటు లేదంటోన్న ఆమె.. తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే అత్యంత సన్నిహితుల సమక్షంలో క్షమ ఇంట్లోనే తనను తానే పెళ్లి చేసుకుంది. ఆపై సోలోగా రెండు వారాల పాటు హనీమూన్‌కు కూడా ప్లాన్‌ చేసుకున్నట్లు చెబుతోంది క్షమ. ‘సోలోగమీ’ పేరుతో పిలిచే ఈ తరహా వివాహం మన దేశంలో ఇదే తొలిసారి కాగా.. ‘స్వీయ ప్రేమంటే నాదే..’ అంటూ గర్వంగా చెబుతోందీ అమ్మాయి. ఇలా తన అరుదైన నిర్ణయంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో పాపులారిటీ సంపాదించిన క్షమ పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు చిన్నతనం నుంచీ తనను తాను ఇష్టపడుతూ పెరిగింది. ఎలా ఉన్నా తనను తాను అంగీకరించుకునేది.. తన నిర్ణయాన్ని తాను గౌరవించుకునేది. తనకు నచ్చినట్లుగానే రడీ అయ్యేది.. ఉండేది కూడా! ఈ స్వీయ ప్రేమే తన జీవితంలో తనకు తప్ప మరెవరికీ స్థానం లేదనేంతగా తన మనసును మార్చేసిందంటోంది క్షమ.

అదే హంగు.. అంతే ఆర్భాటంతో..!

తనను తాను అమితంగా ప్రేమించే క్షమ.. స్వీయ వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. అందుకు జూన్‌ 11న ముహూర్తం కూడా ఫిక్స్‌ చేయించుకుంది. అయితే, ఆమె వివాహం వివాదాస్పదంగా మారింది. క్షమ తీరును తప్పుబట్టిన కొందరు ఆమె పెళ్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తం కంటే రెండు రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే నేడు వివాహం చేసుకొంది.

ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అన్ని వేడుకలు చేసుకుంది క్షమ. హల్దీ, మెహందీ కార్యక్రమాలతో పాటు వేదమంత్రాల నడుమ ఏడడుగులు కూడా నడిచింది. తనకు తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నాకు నేనే ‘వన్‌ పీస్’!

ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోన్న క్షమ.. తన పెళ్లి కోసం కొన్ని వారాలు సెలవు కూడా పెట్టుకుంది. ‘నా జీవితంలో నేనెవరినీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ పెళ్లి కూతురిని కావాలన్న కోరిక ఉంది. అందుకే నన్ను నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. బహుశా.. ఈ తరహా వివాహం మన దేశంలో ఇదే మొదటిది కాబోలు! స్వీయ వివాహం అంటే.. మన కోసం మనం కట్టుబడి ఉండడం.. మనపై మనం చూపించే షరతులు లేని ప్రేమకు నిదర్శనం. చాలామంది తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు.. అలా నాకు నేను నచ్చాను.. అందుకే ఈ పెళ్లి. నిజానికి ఈ ఆలోచన నా మనసులో ముందు నుంచే ఉన్నా బయటపెట్టలేదు. నన్ను నేను పెళ్లి చేసుకోవచ్చా? అని గూగుల్‌లో వెతికినప్పుడు ఈ సోలోగమీ గురించి తెలిసింది. ఇక మరో ఆలోచన చేయకుండా అడుగు ముందుకేశా. చిన్నప్పట్నుంచి స్వతంత్రంగా ఉండడమంటేనే నాకిష్టం. అందుకే నా స్వీయ వివాహ నిర్ణయాన్నీ నా తల్లిదండ్రులు వ్యతిరేకించలేదు. ఎవరేమనుకున్నా నా సంతోషమే నాకు ముఖ్యం..’ అంటోంది క్షమ.

క్షమ తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. స్నేహితుల సమక్షంలో జరిగిన తమ కూతురు పెళ్లికి వారు వీడియోకాల్ ద్వారా హాజరయ్యారు.


అక్కడ ఇది మామూలే!

ఇప్పుడు క్షమా బిందు స్వీయ వివాహం చేసుకుంటే ఎంతోమందికి ఆశ్చర్యంగా ఉంది.. కానీ నిజానికి ఇటలీ, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, తైవాన్‌.. వంటి దేశాల్లో ఇప్పటికే ఈ ట్రెండ్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అక్కడ కొంతమంది అమ్మాయిలు ఈ తరహా వివాహాలు చేసుకొని స్వీయ ప్రేమను చాటుకున్నారు.

* గతేడాది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ప్యాట్రికా క్రిస్టీన్‌ అనే 28 ఏళ్ల అమ్మాయి తనను తానే వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. వృత్తి రీత్యా టీచర్‌ అయిన ఆమెకు 8 ఏళ్ల క్రితం నిశ్చితార్థమైంది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆ పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె.. భవిష్యత్తంతా తనతో తానే గడపాలని నిర్ణయించుకుంది. తనను తానే వివాహం చేసుకుంది.

* న్యూయార్క్‌కు చెందిన ఎరికా అండర్సన్‌ ‘సింగిల్‌గా ఉండడం మన హక్కు.. ఇలాంటప్పుడే సంతోషంగా, స్వతంత్రంగా ఉండచ్చు..’ అంటోంది. ఈ క్రమంలో 2017లో తనను తాను వివాహం చేసుకొని స్వీయ ప్రేమను చాటుకుంది. ‘మనకు భాగస్వామి దొరికినా, దొరక్కపోయినా.. మనకు మనమే పర్‌ఫెక్ట్‌ జోడీ.. ఈ విషయాన్ని ప్రతి మహిళా గ్రహించాలి..’ అని చెబుతోంది ఎరిక.

* స్వీయ వివాహమే అయినా.. సాధారణ పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా గ్రాండ్‌గా చేసుకోవచ్చని నిరూపించింది ఫ్లోరిడాకు చెందిన నేకా కార్టర్‌. 40 మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తనను తానే వివాహమాడిన ఆమె.. ‘కరోనా సమయంలో చాలామంది ఒంటరిగా ఫీలయ్యారు. కానీ ఆ సమయంలో నాతో నేను గడిపిన సమయం నేనేంటో తెలుసుకునేలా చేసింది. స్వీయ ప్రేమను పెంచింది. అందుకే నాకు నేనే బెస్ట్‌ జోడీ’ అంటోంది కార్టర్.

వీరిలాగే వివిధ దేశాలకు చెందిన మరికొంతమంది మహిళలు.. బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి హంగూ-ఆర్భాటాలకు కొదవ లేకుండా, పూల వేదికలు-కేక్‌ కటింగ్స్‌ మధ్య తమకు తామే పెళ్లి ప్రమాణాలు చేసుకొని తమ స్వీయ ప్రేమను చాటుకున్నారు.


ప్రత్యేక ప్యాకేజీలిచ్చి మరీ..!

ఇక జపాన్‌లోని ఓ కంపెనీ దగ్గరుండి మరీ అమ్మాయిలకు స్వీయ వివాహం జరిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘సెరెకా ట్రావెల్‌’ అనే సంస్థ అమ్మాయిల కోసం రెండు రోజుల పాటు ప్రత్యేక ప్యాకేజీలు అందించి ప్రోత్సహిస్తోంది. పెళ్లి కోసం బ్యాంకెట్ హాల్‌ బుక్‌ చేయడం-అలంకరించడం దగ్గర్నుంచి.. ఫొటోషూట్స్‌, వచ్చిన అతిథులకు అతిథి మర్యాదలు, చక్కటి భోజనం, పెళ్లి కూతురు తన పెళ్లిలో కట్‌ చేయడానికి ప్రత్యేకమైన కేక్‌ సిద్ధం చేయడం.. ఇలా ఇవన్నీ ఆ ప్యాకేజీలో కవరవుతాయట! మొత్తానికి స్వీయ వివాహం చేసుకునే అమ్మాయిలకు ఈ విధంగా బోలెడన్ని మెమరీస్‌ అందిస్తోందీ సంస్థ.


‘సోలోగమీ’.. కారణాలెన్నో!

అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఈ వివాహ సంస్కృతిని ఫాలో అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇలా ఎవరిని వారు వివాహం చేసుకోవడమనేది మనకు కాస్త విచిత్రంగానే అనిపించినా.. అమ్మాయిలు ఈ పద్ధతిని ఎంచుకోవడం వెనుక పలు కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒకటి.. క్షమ లాగా చిన్నతనం నుంచి తమను తాము ప్రేమించుకుంటూ స్వీయ ప్రేమను చాటుకోవడమైతే.. మరికొంతమంది తమ పూర్వపు అనుబంధాల్లో ఎదురైన చేదు అనుభవాల వల్ల విసుగెత్తిపోవడం మరో కారణంగా చెప్పచ్చు. ఈ క్రమంలో మొదటి పెళ్లిలో భర్త చేతిలో వేధింపులకు గురవడం లేదంటే మోసపోవడం, భర్త నుంచి విడాకులు తీసుకోవడం.. ఇలాంటి కారణాల వల్లే సగానికి సగం మంది మహిళలు సోలోగమీ వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఏదేమైనా, ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా అమ్మాయిలు స్వీయ ప్రేమను చాటుకోవడం అనేది మంచి పరిణామమే అంటున్నారు నిపుణులు. తద్వారా సానుకూల దృక్పథం అలవడుతుందంటున్నారు. మరి, దీనిపై మీ అభిప్రాయమేంటి? Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్