Going Solo: పెళ్లితో జీవితం ఆగిపోదని నిరూపించారు..!
సమాజంలో చాలామంది మహిళలు స్వతంత్రంగా జీవించాలని అనుకుంటారు. కానీ, కొన్ని సామాజిక కట్టుబాట్లు వారిని వెనక్కి లాగుతుంటాయి. కొంతమంది మాత్రం వాటిని తెంచుకుని మరీ తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఇందులో గరీమా శంకర్, రేణూ సింఘీలు...
సమాజంలో చాలామంది మహిళలు స్వతంత్రంగా జీవించాలని అనుకుంటారు. కానీ, కొన్ని సామాజిక కట్టుబాట్లు వారిని వెనక్కి లాగుతుంటాయి. కొంతమంది మాత్రం వాటిని తెంచుకుని మరీ తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఇందులో గరీమా శంకర్, రేణూ సింఘీలు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ పెళ్లై పిల్లలు పుట్టిన చాలాకాలం తర్వాత సామాజిక కట్టుబాట్లను దాటుకుని మరీ సైక్లింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సుదూర సైకిల్ యాత్ర (London-Edinburgh-London) లో పాల్గొని తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. వీరి ప్రయాణం ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వీరి ప్రయాణం గురించి మరింతమందికి చేరవేయడానికి ‘గోయింగ్ సోలో’ పేరుతో ఓ డాక్యుమెంటరీ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వారి ప్రయాణం, డాక్యుమెంటరీ గురించి మరిన్ని వివరాలు.. మీ కోసం..
సంపన్న కుటుంబంలో జన్మించినా...
గరీమా శంకర్ (44) దిల్లీలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, తనకున్న సమస్యల్లా స్వతంత్రంగా జీవించలేకపోవడం. గరీమా యుక్తవయసులో స్వేచ్ఛగా బయట తిరగాలని అనుకునేవారు. కానీ ఆమె తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు ఒంటరిగా పంపేవారు కాదు. అలా ఆమె జీవితం 37 సంవత్సరాల పాటు సగటు ఆడపిల్లలాగే సాగింది. ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత ఆమెకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. క్రమంగా బరువు పెరిగారు. అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి సైక్లింగ్ చేయడం మంచి మార్గమని భావించారు.
అలా గరీమా 37 ఏళ్ల వయసులో సైకిల్ తొక్కడం ప్రారంభించారు. ఇందుకు ఆమె కజిన్ సహాయం తీసుకున్నారు. ఎప్పుడైతే సైక్లింగ్ చేయడం మొదలుపెట్టారో అప్పటినుంచి ఆమె సంతోషం రెట్టింపైందని గ్రహించారు. దాంతో విరామం ఇవ్వకుండా సైక్లింగ్ చేశారు. అలా కొద్ది రోజులకే రెగ్యులర్ రైడర్‌గా మారారు. దాంతో మరికొంతమంది ఆమెతో సైక్లింగ్ చేయడం ప్రారంభించారు. తోటి స్నేహితులు ఇచ్చిన సలహాతో పలు సైక్లింగ్ ఈవెంట్లలో పాల్గొనడం మొదలుపెట్టారు.
పట్టు వదలకుండా...
సైక్లింగ్‌పై పట్టు వచ్చిన తర్వాత దేశంలో జరిగిన పలు సైక్లింగ్ ఈవెంట్లలో పాల్గొన్నారు గరీమా. ఈ క్రమంలోనే తోటి సైక్లిస్టులు London-Edinburgh-London (LEL) ఈవెంట్‌కు సన్నద్ధం అవుతుండడంతో తను కూడా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికి ఈవెంట్ జరగడానికి కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. LEL బ్రిటన్‌లో ప్రతిష్టాత్మకమైన సైక్లింగ్ ఈవెంట్. ఈ ఈవెంట్‌లో భాగంగా 1550 కిలోమీటర్ల దూరాన్ని 128 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దూరాన్ని పట్టించుకోకుండా గరీమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రైడ్ మొదలైన నాలుగు రోజుల తర్వాత ఆమెకు లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం అనిపించింది. ఆమె స్థానంలో ఉన్న చాలామంది మధ్యలోనే వెనుతిరిగారు. కానీ, గరీమ మాత్రం చివరి వరకు పోరాడాలని నిశ్చయించు కున్నారు. కానీ, లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అయితే చివరి దాకా ఆమె పోరాడిన తీరును చూసి ఆమెకు మెడల్ అందజేశారు.
పెళ్లితో మారిపోయింది...!
రేణూ సింఘి (58) రాజస్థాన్‌లోని ఓ జైన్ కుటుంబంలో జన్మించారు. సంప్రదాయ కుటుంబంలో జన్మించినప్పటికీ రేణూ బాల్యం స్వేచ్ఛగానే గడిచింది. ఆమె యుక్తవయసులో జోధ్‌పూర్ వీధుల్లో సైక్లింగ్ కూడా చేశారు. అయితే రేణూ జీవితం పెళ్లి తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆమె అత్తింటి వారు పూర్తి సంప్రదాయ పద్ధతులు పాటించేవారు. దాంతో రేణూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. వంట పని, ఇంటి పని, ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకోవడంతోనే చాలా సమయం గడిచిపోయింది.
గురూజీని కలవడంతో..
కుటుంబ బాధ్యతలతో సాగిపోతున్న రేణూ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 52 ఏళ్ల వయసులో తన కొడుక్కి సైకిల్ కొందామని ఓ స్టోర్‌కి వెళ్లారు. ఆ సమయంలో తన గురూజీ అయిన సునీల్ శర్మను అనుకోకుండా కలిశారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె కూడా ఒక సైకిల్ కొని సైక్లింగ్ చేయడం ప్రారంభించారు.
‘మొదట్లో సైక్లింగ్ చేయడాన్ని మా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. కానీ, సైక్లింగ్‌పై నాకున్న మక్కువను వాళ్లు నిలువరించలేకపోయారు. అలా కొద్ది రోజులకే దూర ప్రాంతాల్లో సైక్లింగ్ చేయడం ప్రారంభించాను. కొన్ని రైడ్స్ చేసిన తర్వాత అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనాలని అనుకున్నాను’ అని చెప్పుకొచ్చారు రేణూ.
ఈ క్రమంలోనే గతేడాది జరిగిన London-Edinburgh-London (LEL) ఈవెంట్‌లో పాల్గొన్నారు రేణూ. ఈ ఈవెంట్‌లో ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1900 మంది పాల్గొన్నారు. ఈ రైడ్‌ను రేణూ 124 గంటల 30 నిమిషాల్లో నే పూర్తి చేసి ఔరా అనిపించారు. తద్వారా LEL పూర్తి చేసిన తొలి భారత మహిళగా రికార్డు సాధించారు.
ఇతరుల్లో స్ఫూర్తి నింపడానికి...!
గరీమా, రేణూ ఇద్దరూ సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. వీరిద్దరూ సైక్లింగ్ మొదలుపెట్టే సమయానికి ఎన్నో బాధ్యతల వలయంలో ఉన్నారు. అయినా వాటిని లెక్క చేయకుండా సైక్లింగ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరికి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వీరి ప్రయాణం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే దర్శకుడు అమేయ గోరే వీరి ప్రయాణాన్ని డాక్యుమెంటరీగా తీసుకురావాలనుకున్నారు. ఇందుకోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 50 వేల డాలర్లను సేకరించారు. ప్రస్తుతం 60 శాతం డాక్యుమెంటరీ పూర్తైంది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం డాక్యుమెంటరీ పూర్తి చేసి ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.