బుమ్రా బౌలింగ్‌ సీక్రెట్‌... అమ్మే!

క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లనూ ఆడగల క్రికెటర్‌! ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడు. యార్కర్, బౌన్సర్,  ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్‌.. అంటూ ఈ భారత ఫాస్ట్‌ బౌలర్‌ తన అమ్ములపొదిలోని అస్త్రాలతో... ప్రత్యర్థికి చెమటలు పట్టించేస్తాడు.

Updated : 06 Jul 2024 07:04 IST

క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లనూ ఆడగల క్రికెటర్‌! ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడు. యార్కర్, బౌన్సర్,  ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్‌.. అంటూ ఈ భారత ఫాస్ట్‌ బౌలర్‌ తన అమ్ములపొదిలోని అస్త్రాలతో... ప్రత్యర్థికి చెమటలు పట్టించేస్తాడు. తాజాగా తన సూపర్‌ బౌలింగ్‌తో టీ20 2024 ప్రపంచకప్‌ పోటీల్లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు... జస్‌ప్రీత్‌ బుమ్రా. అయితే, క్రికెటర్‌గా అతను రాణించడం వెనక... తల్లి దల్జీత్‌కౌర్‌ పాత్ర ఎంతో!

పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడే భర్త జస్వీర్‌ సింగ్‌ని కోల్పోయారు దల్జీత్‌ కౌర్‌. అహ్మదాబాద్‌లో స్థిరపడిన పంజాబీ సిక్కు కుటుంబం వారిది. భర్తను పోగొట్టుకుని పుట్టెడు బాధలో ఉన్న కోడలిని చేరదీయాల్సిన బుమ్రా తాత సంతోక్‌ సింగ్‌ ఊరొదిలి వెళ్లిపోయాడు. దాంతో వారి జీవితం తలకిందులైంది. దల్జీత్‌ ఆ షాక్‌ నుంచి చాన్నాళ్లు కోలుకోలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలకు మూడుపూటలా భోజనమూ పెట్టలేని పరిస్థితి. అది గమనించిన దల్జీత్‌ స్నేహితురాలు దీపల్‌ నెలరోజుల పాటు... బుమ్రా, వాళ్లక్క జుహికా సంరక్షణ బాధ్యతని తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు అప్పటివరకూ గృహిణిగా ఉన్న దల్జీత్‌ గడపదాటి బయటకు రాక తప్పలేదు. కుటుంబ పోషణ కోసం టీచర్‌గా మారారు. కొన్నేళ్లలోనే ప్రిన్సిపల్‌ హోదానీ అందుకున్నారు. దీంతోపాటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ... రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడేవారు. పిల్లలకి ఏ లోటూ రాకుండా చూసుకుంటూ వాళ్లకి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించారు.

ఆ శబ్దం విసుగు తెప్పించడంతో...

తల్లి ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న స్కూల్లోనే బుమ్రా ప్రాథమిక విద్య సాగింది. జస్‌ప్రీత్‌కి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. క్రికెటర్‌ కావాలని కలలు కనేవాడు. దల్జీత్‌ కూడా కొడుకు ఇంజినీరో, డాక్టరో అవ్వాలని ఒత్తిడి తేలేదు. నీ మనసు మాట విను...కానీ, ఆంగ్ల భాషపై పట్టు సాధించమని మాత్రం చెప్పారట. రెండుమూడు భాషల్లో నైపుణ్యం ఉంటే ఏ వృత్తిలోనైనా ఎదగొచ్చనేది ఆమె నమ్మకం. టీవీలో ఫాస్ట్‌ బౌలింగ్‌ చూసి రబ్బరు బంతిని గోడకు కొట్టి బౌలింగ్‌ సాధన చేసేవాడు బుమ్రా. అయితే, రోజూ ఆ శబ్దం దల్జీత్‌కి విసుగు తెప్పించేదట. దాంతో ఓ రోజు తక్కువ సౌండ్‌ వచ్చేలా ఆడుకోగలిగితేనే ఇంట్లో ఆడమని బుమ్రాకు చెప్పారట. అలా అమ్మ కోపానికి గురవ్వకుండా ఉండేందుకు కనిపెట్టిన టెక్నిక్కే... అతడి కెరియర్‌ని మలుపు తిప్పింది. బంతిని ఫ్లోరింగ్, గోడ కలిసే చోట వేసి శబ్దాన్ని నియంత్రిస్తూ నేర్చుకున్న తొలిపాఠంతోనే షార్ప్‌గా యార్కర్లు వేయగలుగుతున్నానంటాడు బుమ్రా.

అప్పుడు ఎంతగానో బతిమాలాడు...

‘మొదట్లో క్రికెట్‌లో రాణించగలడో లేడో అని భయపడ్డా. గుజరాత్‌ అండర్‌ 16లో ప్రతిభ చూపించినా... అండర్‌ 19కి ఎంపిక కాకపోవడం బాధ కలిగించింది. దాంతో ఇక క్రికెట్‌ వదిలేయమన్నా. తిరిగి చదువుపై దృష్టిపెట్టి ఉద్యోగం సంపాదించమని కోరా. నా మాట కాదనలేకపోయాడు. కొన్నాళ్లు అలానే చేశాడు. కానీ, వాడి మనసు మాత్రం క్రికెట్‌మీదే ఉండేది. అందుకే, తిరిగి నన్ను ఒప్పించాలని పదే పదే ప్రయత్నించేవాడు. నేనూ ఇక వాడి ఆసక్తి చూసి సరేనన్నా. అది మొదలు వాడి దశ తిరిగింది. ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ జట్టులో సభ్యుడిగా తరవాత మరెన్నో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో ఫాస్ట్‌ బౌలర్‌గా తన ప్రతిభ చూపించాడు. అయితే, నన్నో విషయం ఇప్పటికీ బాధపెడుతుంది. అప్పట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆరంభంలో బుమ్రాకు ఓ నాణ్యమైన క్రికెట్‌ కిట్‌ని కూడా కొనలేకపోయా. నన్ను అర్థం చేసుకుని ఉన్న ఒక జత షూ, టీషర్టులనే ఉతుక్కుని ప్రాక్టీస్‌ చేసేవాడు. చిన్నప్పటి నుంచీ నా కొడుకు సిగ్గరి. ఏ విషయమైనా నాతో చెప్పనిదే, నా అనుమతి లేనిదే ముందుకెళ్లేవాడు కాదు’ అంటూ తన బిడ్డ గురించి చెప్పి మురిసిపోతారు దల్జీత్‌.

తాజాగా బుమ్రా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో ఆటను మలుపు తిప్పడమే కాదు... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ గెలుచుకున్నాడు. అమ్మ లేకపోతే క్రికెటర్‌గా నాకు కెరియర్‌ లేదంటాడు బుమ్రా. ‘‘క్లిష్ట సమయాల్లో స్థితప్రజ్ఞత, సంయమనం పాటించడం ఎలానో తల్లి నుంచే నేర్చుకున్నాననీ, అమ్మే తన స్ఫూర్తి అనీ అంటాడు. ‘నేనీ స్థితిలో ఉండటానికి నా తల్లి చేసిన త్యాగాలెన్నో. తనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.. జీవితాంతం ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవడం తప్ప..!  మ్యాచ్‌కి ముందు వీలైతే అమ్మను కలుసుకోవడం, లేదంటే ఫోన్లో మాట్లాడడం..సెంటిమెంట్‌’ అని చెబుతాడు ఈ టీమిండియా పేసర్‌. 2021లో స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ సంజనా గణేశన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఒక అబ్బాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్