Varalaxmi: అతడి అందమైన మనసు చూసి ఇష్టపడ్డా!

ప్రేమ.. అదో మధురమైన బంధం.. ఏళ్లు గడుస్తున్నా నిత్య యవ్వనంగా ఉండే శాశ్వతమైన అనుబంధం. అలాంటి తమ ప్రేమ బంధాన్ని తాజాగా పెళ్లి పీటలెక్కించారు కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ - నికోలయ్‌ సచ్‌దేవ్‌ జంట.

Published : 05 Jul 2024 12:44 IST

(Photos: Instagram)

ప్రేమ.. అదో మధురమైన బంధం.. ఏళ్లు గడుస్తున్నా నిత్య యవ్వనంగా ఉండే శాశ్వతమైన అనుబంధం. అలాంటి తమ ప్రేమ బంధాన్ని తాజాగా పెళ్లి పీటలెక్కించారు కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ - నికోలయ్‌ సచ్‌దేవ్‌ జంట. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్ల గాఢమైన ప్రేమ బంధం వీరిది! తమ సుదీర్ఘమైన ప్రేమ ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, కష్టసుఖాల్ని కలిసే పంచుకుంటూ ప్రేమకు అసలు సిసలైన అర్థం చెప్పిందీ అందాల జంట. మరి, ఈ క్యూట్‌ కపుల్‌ ప్రేమ ముచ్చట్లు, పెళ్లి కబుర్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

దారులు వేరైనా..!

వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. కోలీవుడ్‌ నటుడు శరత్‌కుమార్‌ కూతురిగానే కాదు.. చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. తెలుగు, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లో నటించిన ఈ భామ.. హీరోయిన్‌గానే కాదు.. పలు సినిమాల్లో విలన్‌గానూ మెప్పించింది. అందుకే వరలక్ష్మిని ఫ్యాన్స్‌ ముద్దుగా ‘లేడీ విలన్‌’ అని పిలుచుకుంటారు.

ఇక నికోలయ్‌ ముంబయికి చెందిన ఆర్ట్‌ గ్యాలరిస్ట్‌. వివిధ రకాల పెయింటింగ్స్‌, కళాకృతుల్ని ఆన్‌లైన్‌ వేదికగా విక్రయిస్తుంటారు. అయితే నికోలయ్‌కి ఇదివరకే కవిత అనే అమ్మాయితో వివాహమైంది. గతంలో ఆమె పలు అందాల పోటీల్లోనూ పాల్గొని విజయం సాధించిందట! అంతేకాదు.. ఈ జంటకు 15 ఏళ్ల కూతురు కూడా ఉందట! ప్రస్తుతం ఆమె వెయిట్‌ లిఫ్టర్‌గా రాణిస్తోందట! పలు కారణాల రీత్యా నికోలయ్‌ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వరలక్ష్మి పరిచయమవడం, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. దారులు వేరైనా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఏళ్ల తరబడి తమ ప్రేమను నిత్యనూతనం చేసుకుంటూ ముందుకు సాగుతోందీ కొత్త జంట.

ప్రేమ.. మనసుకు సంబంధించింది!

ఏళ్లు గడిచే కొద్దీ తరిగిపోయే ప్రేమబంధాల్నే ఈకాలంలో ఎక్కువగా చూస్తున్నాం.. కానీ తమది మాత్రం కాలంతో పాటు దృఢమయ్యే అనుబంధం అంటోంది వరలక్ష్మి. తనకు కాబోయే భర్త అందం, మొదటి పెళ్లి.. తదితర విషయాల్లో అతడిపై వచ్చిన విమర్శల్ని సున్నితంగా తిరస్కరించిన ఈ కోలీవుడ్‌ బ్యూటీ.. ఆ క్షణం తన ఇష్టసఖుడికి అండగా నిలబడింది.
‘14 ఏళ్ల క్రితమే ఓ సందర్భంలో నికోలయ్‌ నాకు పరిచయమయ్యాడు. మాది తొలిప్రేమ అని చెప్పను కానీ.. క్రమంగా ఇద్దరం ప్రేమలో పడ్డాం.. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం.. అన్ని విషయాల్లో తోడుగా నిలిచాం.. అయితే నికోలయ్‌ మొదటి వివాహం గురించి కొందరు విమర్శించారు. నా దృష్టిలో రెండో పెళ్లి తప్పు కాదు. అలాగే నికోలయ్‌ అందాన్ని చూసి నేను ప్రేమించలేదు.. అతడి అందమైన మనసు చూసి ప్రేమించా. తను చాలా మంచివాడు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటాడు.. నార్వేలో నార్తర్న్‌ లైట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో కుటుంబ సభ్యులందరి ముందు అతడు నాకు ప్రపోజ్‌ చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను..’ అంటూ మురిసిపోతోందీ చక్కనమ్మ.

మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌!

ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి-నికోలయ్‌ జంట.. తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. తమ 14 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకుంది. థాయ్‌ల్యాండ్‌లో నాలుగు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు నిర్వహించారు. మెహెందీ వేడుకలో లేత ఆకుపచ్చ రంగు క్రీప్‌ లెహెంగాలో మెరిసిన ఈ కొత్త పెళ్లి కూతురు.. వివాహంలోనూ సంప్రదాయబద్ధంగా ముస్తాబైనట్లు తెలుస్తోంది. అయితే వీరి వివాహానికి సంబంధించిన అధికారిక ఫొటోలు ఇంకా బయటికి రాలేదు. ఇక తాజాగా సినీ, రాజకీయ ప్రముఖుల కోసం చెన్నైలో వివాహ విందును ఏర్పాటుచేసిందీ కొత్త జంట. ఈ వేడుక కోసం మెరూన్‌ కలర్‌ భారీ ఎంబ్రాయిడరీ లెహెంగాను ఎంచుకుంది వరు. డైమండ్‌ జ్యుయలరీ, సింపుల్‌ మేకప్‌, స్టైలిష్‌ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ని పూర్తిచేసిన ఈ చక్కనమ్మ.. క్యూట్‌ బ్రైడ్‌గా మెరిసిపోయింది. తన ఇష్టసఖి లుక్‌కి మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ అయ్యేలా వైన్‌ కలర్‌ షేర్వాణీలో ముస్తాబయ్యాడు నికోలయ్‌. ఇలా వీళ్లిద్దరి పెయిర్‌ చూడముచ్చటగా కనిపించింది. త్రిష, ఖుష్బూ, టబూ, శోభన.. ఇలా ఎంతోమంది తారలు వీళ్ల రిసెప్షన్‌లో సందడి చేశారు. ప్రస్తుతం ఈ జంట రిసెప్షన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కంగ్రాట్స్‌ లవ్లీ కపుల్‌!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్