అతనితో బ్రేకప్.. పెళ్లైన తర్వాత మళ్లీ చాట్ చేస్తున్నాడు..!

నేను పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయాం. అయితే కొన్ని రోజుల క్రితం అతను వాట్సప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత చాట్ చేయడం ప్రారంభించాడు. నేను మళ్లీ అతనిపై ద్వేషం....

Published : 16 Jun 2023 15:44 IST

నేను పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయాం. అయితే కొన్ని రోజుల క్రితం అతను వాట్సప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత చాట్ చేయడం ప్రారంభించాడు. నేను మళ్లీ అతనిపై ద్వేషం పెంచుకోవాలనుకోలేదు. అందుకే నేను కూడా నార్మల్‌గానే స్పందిస్తున్నాను. కానీ, అతని ఉద్దేశం మాత్రం వేరే విధంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం నేను నా భర్తతో ఆరోగ్యకరమైన బంధంలో ఉన్నాను. దీనిని ఏ కారణం చేత కూడా నాశనం చేసుకోవాలనుకోవడం లేదు. ఈ క్రమంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా అతని నుంచి దూరం జరగాలంటే ఏం చేయాలి. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు గతంలో ప్రేమించిన వ్యక్తి తిరిగి వాట్సప్‌లో మెసేజ్‌లు చేస్తున్నాడని అంటున్నారు. మీరు సాధారణంగానే స్పందిస్తున్నా.. అతని ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం మీ భర్తతో మీరు ఆరోగ్యకరమైన బంధంలో ఉన్నానని.. దానిని కాపాడుకోవాలని అనుకుంటున్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా అతని నుంచి దూరం జరగాలని అనుకుంటున్నారు. ఇది మంచి ఆలోచన కూడా..! అయితే ఈ విషయం అతనితోనే నేరుగా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవడం మంచిది.

అతనితో మాట్లాడేటప్పుడు సున్నితంగా, మర్యాదగా మాట్లాడండి.

మీరు చెప్పాలనుకున్న విషయాలను స్పష్టంగా తెలియజేయండి.

ప్రస్తుతం మీ జీవిత భాగస్వామితో ఎంత సంతోషంగా ఉన్నారో వివరించండి. అలాగే భవిష్యత్తులో తనతో ఎలా గడపాలనుకుంటున్నారో చెప్పండి. దీనివల్ల మీ బంధంపై అతనికి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది.

మీరు గతం గురించి ఎంతమాత్రం ఆలోచించడం లేదని, దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేశానన్న విషయాన్ని కూడా స్పష్టం చేయండి. దీనివల్ల మీ గురించి, మీతో బంధం గురించి అవతలి వ్యక్తి వాస్తవాలకు అతీతమైన అంచనాలను పెట్టుకునే అవకాశం ఉండదు.

ఒకవేళ మీరు అతనితో కేవలం ఓ స్నేహితురాలిగా మాత్రమే మాట్లాడాలనే నిర్ణయానికి వస్తే ముందే ఇద్దరి మధ్య స్పష్టమైన పరిధులను నిర్ణయించుకోండి. కానీ మీ పట్ల అతని ఆలోచనలు వేరుగా ఉన్న నేపథ్యంలో ఓ ఫ్రెండ్‌గా మాత్రమే ఉండడం ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యమో ఆలోచించండి. మీరు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం అతనితో ఎలాంటి సంబంధాలూ కొనసాగించకపోవడమే మంచిదేమో కూడా ఆలోచించండి.

ఇద్దరి మధ్య బంధం దృఢంగా ఉండాలంటే ప్రేమతో పాటు ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. మీరు మీ భర్తతో ఆరోగ్యకరమైన బంధంలో ఉన్నానని అంటున్నారు. కాబట్టి, దాన్ని సవ్యంగా కొనసాగించడానికి ప్రయత్నించండి. మీకు మీరుగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మీకంటూ కొన్ని పరిధులను నిర్ణయించుకోండి. మీ ఆలోచనలు, అభిప్రాయాలకు విలువిచ్చే వ్యక్తులు మీ జీవితంలో ఉంటారు. అలా లేనివారి గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని