ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. నాకేంటి క్యాన్సర్ అనుకున్నా..!

రొమ్ము క్యాన్సర్‌.. ఈ పేరు వినగానే మన వెన్నులో వణుకు పుడుతుంది.. దీని బారిన పడితే ఇక జీవితం ముగిసినట్లే అనే ఆలోచనలో ఉండిపోయి జీవచ్ఛవంలా బతుకుతుంటారు కొందరు. కానీ ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని చెబుతోంది దిల్లీకి చెందిన స్వప్న.  తానూ రొమ్ము క్యాన్సర్‌ బాధితురాలినేనని, మొదటి దశలో గుర్తించడం వల్ల ఈ మహమ్మారిపై

Updated : 04 Feb 2022 19:42 IST

రొమ్ము క్యాన్సర్‌.. ఈ పేరు వినగానే మన వెన్నులో వణుకు పుడుతుంది.. దీని బారిన పడితే ఇక జీవితం ముగిసినట్లే అనే ఆలోచనలో ఉండిపోయి జీవచ్ఛవంలా బతుకుతుంటారు కొందరు. కానీ ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని చెబుతోంది దిల్లీకి చెందిన స్వప్న.  తానూ రొమ్ము క్యాన్సర్‌ బాధితురాలినేనని, మొదటి దశలో గుర్తించడం వల్ల ఈ మహమ్మారిపై విజయం సాధించగలిగానంటోంది. అంతేకాదు.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను రంగరించి ఓ పుస్తకంగా రాస్తున్నానని, వాటిలో కొన్నైనా ఇతరులకు ఉపయోగపడితే చాలన్న మంచి మనసుతో తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

ఆరోగ్యకరమైన జీవన శైలి, చక్కటి ఆహారపుటలవాట్లు.. మన ఆరోగ్యానికి ఈ రెండూ కీలకం. నేనూ ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అయితే కొన్ని రకాల జబ్బులు మనం పాటించే జీవన విధానంతో సంబంధం లేకుండా మనపై దాడి చేస్తుంటాయి. క్యాన్సర్‌ కూడా అందులో ఒకటి. ఇది మనం అనుసరించే లైఫ్‌స్టైల్‌ పరంగా కాకుండా వంశపారంపర్యంగా కూడా కొంతమందిలో వస్తుంటుంది. నేనూ అలాగే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డాను కాబట్టే ఈ విషయం నాకు అవగతమైంది.

******

నేను పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా.. పెళ్లయ్యాక దిల్లీ వెళ్లిపోయా. ఎందుకంటే మా వారు అక్కడే ప్రభుత్వోద్యోగం చేస్తున్నారు. నేనూ అక్కడే ఓ కంపెనీలో జాబ్‌ చేయడం మొదలుపెట్టా. నేను, మా వారు.. చిలకాగోరింకల్లా సాగిపోయే సంసారం.. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. మా ప్రేమకు గుర్తుగా అన్వేష్‌ పుట్టాడు. అయితే అనుకోకుండా వచ్చిన ఈ కరోనా పరిస్థితుల కారణంగా ఏడెనిమిది నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తున్నా. నాకు చిన్నతనం నుంచి ఒక అలవాటుంది. అదేంటంటే.. ఏ పనిలోనైనా నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ నాకంటూ ఓ గంట సమయమైనా కేటాయించుకునేదాన్ని. వ్యాయామం చేయడం కూడా నా లైఫ్‌స్టైల్లో భాగమే! ఇక ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లినప్పుడు తప్ప బయటి ఫుడ్‌కు దాదాపు నో చెప్పేదాన్ని. ఇవే అలవాట్లను ఇప్పటికీ కొనసాగిస్తున్నా. అయితే లాక్‌డౌన్‌ మొదట్లో ఇంటి నుంచి పనిచేస్తోన్న క్రమంలో ఒకరోజు ఉన్నట్లుండి ఎడమవైపు రొమ్ములో నొప్పి మొదలైంది. నెలసరి సమయంలో ఈ నొప్పి మామూలే కదా అని దాన్ని తేలిగ్గా తీసుకున్నా.

కానీ పిరియడ్స్‌ ముగిసి వారం రోజులు గడిచినా నొప్పి మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇలా ఎందుకు జరుగుతుందా అని నెట్‌లో శోధించా. ఈ క్రమంలోనే ‘రొమ్ము క్యాన్సర్‌ - బ్రెస్ట్‌ సెల్ఫ్‌ ఎగ్జామ్‌’ గురించి కొన్ని విషయాలు నాకు తెలిశాయి. ఆ వెంటనే నెట్‌లో దొరికిన సమాచారం ప్రకారం నా రొమ్ముల్ని స్వయంగా పరీక్షించుకొని చూశా. ఈ క్రమంలో నొప్పిగా ఉన్న వక్షోజంలో ఓ చిన్న గడ్డలాగా నా మునివేళ్లకు తగిలింది. ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్‌ చేస్తే అక్కడికి దగ్గర్లోని క్యాన్సర్‌ సెంటర్‌కి వెళ్లమని సలహా ఇచ్చారు. వారు పరీక్షించి నా రొమ్ములో ఉన్న గడ్డ నుంచి శాంపిల్‌ సేకరించి బయాప్సీకి పంపించారు. అప్పుడు తెలిసింది అది బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు సంబంధించిందేనని! కానీ నాకెలాంటి చెడు అలవాట్లు లేవు.. అలాంటిది నాకు రొమ్ము క్యాన్సరా అనుకున్నా. ఆ సమయంలో ‘ఈ వ్యాధి వంశపారంపర్యంగానూ రావచ్చు. అయినా మీకు క్యాన్సర్‌ మొదటిదశలో ఉంది.. కాబట్టి భయపడాల్సిందేమీ లేదు.. కీమోథెరపీ చికిత్స తీసుకుంటూ, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే నెమ్మదిగా కోలుకోవచ్చు..’ అని డాక్టర్‌ చెప్పారు. అప్పుడు గుర్తొచ్చింది.. గతంలో మా అమ్మ తరఫు బంధువుల్లో ఒకరు క్యాన్సర్‌తో చనిపోయిన విషయం!

******

అయితే నా అనారోగ్యం గురించి మా అమ్మానాన్నలకు, అత్తయ్య వాళ్లకు చెబితే అనవసరంగా ఆందోళన చెందుతారని చిన్న సమస్యే అని మేనేజ్‌ చేశా. అయినా వాళ్లు దిల్లీ రావడంతో అసలు విషయం తెలిసిపోయింది. దాంతో దగ్గరుండి నన్ను చూసుకోవడానికి అమ్మ ఇక్కడే ఉండిపోయింది. అంతలోనే నాకు కీమోథెరపీ చికిత్స ప్రారంభమైంది. ఈ క్రమంలో నీరసం, వికారం ఆవహించాయి. ఒక దశలో నా నుంచి నా ప్రాణం ఎవరో తీసుకుపోతున్నట్లనిపించేది. మరోవైపు అమ్మకేమైందో అర్థం చేసుకోలేని నా బాబు ఏడుపు చూసి నా మనసు నీరయ్యేది. అయినా ధైర్యం చెడలేదు.. ‘నా బాబు కోసమైనా నేను త్వరగా కోలుకోవాలి..’ అన్న సంకల్పాన్ని నా మనసులో నింపుకొన్నా. అంతేకాదు.. నేను డీలా పడిపోతే అది చూసి అమ్మ తట్టుకోలేదు. ఈ వయసులో ఆమెను అలా బాధపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ట్రీట్‌మెంట్‌ వల్ల ఎంత నొప్పి కలిగినా పంటి బిగువున భరిస్తూ పైకి నవ్వుతూ కనిపించేదాన్ని.

ఇలా నాకు ట్రీట్‌మెంట్ జరిగినన్నాళ్లూ అమ్మే నన్ను దగ్గరుండి చూసుకుంది.. నా కోసం ప్రత్యేకంగా వంట చేసేది.. ఎందుకంటే కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొన్ని పదార్థాలకు దూరంగా ఉన్నా. ఈ క్రమంలో నాలుగు కిలోలు తగ్గా. ఇక రోజువారీ చెకప్స్‌, హాస్పిటల్‌కి తీసుకెళ్లడం, తీసుకురావడం, ఇతర పనులన్నీ మా వారే చూసుకున్నారు. ఇలా అమ్మ సపోర్ట్‌, భర్త అండదండలతో ఇటీవలే క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్నా. ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టా. ఈ క్రమంలో చక్కెర పూర్తిగా మానేశా.. ప్యాక్‌ చేసిన ఆహారం జోలికి అసలు వెళ్లట్లేదు.. కేవలం ఇంటి భోజనమే తీసుకుంటున్నా.. మానసికంగా మరింత దృఢంగా ఉండడం కోసం యోగా, ధ్యానం చేస్తున్నా. మా వారిని, బాబును కూడా ఆరోగ్యం విషయంలో మరింత అలర్ట్‌ చేశా. మొత్తానికి దేవుడి దయ, నా ధైర్యం, కుటుంబం అండతో ఈ మహమ్మారి నుంచి గట్టెక్కా. అయినా నా రెగ్యులర్‌ బ్రెస్ట్‌ సెల్ఫ్‌ ఎగ్జామ్‌ని కొనసాగిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఒక్కసారి వచ్చిపోయింది కదా మళ్లీ రాదనుకోవడానికి వీల్లేదని డాక్టర్‌ చెప్పారు. అందుకే మరింత అలర్ట్‌గా ఉంటున్నా.

******

మరి, మీ అనుభవాలన్నీ మాకెందుకు చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఏ విషయం గురించైనా మనం సాధారణంగా తెలుసుకున్న దానికంటే.. స్వీయానుభవంతో చెప్పినవే మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం గురించైతే ఇలాంటి కథలే మనల్ని మరింత అలర్ట్‌ చేస్తాయి. అందుకే రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో నాకెదురైన అనుభవాలను మీతో పంచుకున్నా. అంతేకాదు.. ప్రస్తుతం వీటి గురించి మరింత సునిశితంగా ఓ పుస్తకంలో పొందుపరుస్తున్నా. ఇవి కొంతమందికైనా ఉపయోగపడతాయని ఆశిస్తున్నా. ఇక ఆఖరిగా ఒక్క మాట.. చాలామంది క్యాన్సర్‌ బాధితులు.. తమ జీవితం ముగిసిపోయిందని తీవ్ర నిరాశలోకి కూరుకుపోతారు.. కానీ మన ధైర్యమే మన ఆయుధం.. దృఢ సంకల్పం ఉంటే ఎంతటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు.. అలాగే ఎలాంటి అనారోగ్యాన్నైనా ప్రారంభంలోనే గుర్తిస్తే నయం చేసుకోవడం మరింత సులభమవుతుంది.. ఇవే నా జీవితంలో నేను నేర్చుకున్న విలువైన పాఠాలు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్