లావున్నాడు.. పెళ్లి చేసుకోనా?

నేను డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సంబంధం వచ్చింది. అతను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి కుటుంబ నేపథ్యం ఉంది. అయితే ఆ అబ్బాయి అధిక బరువు ఉన్నాడు.

Published : 22 Jun 2024 20:27 IST

నేను డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సంబంధం వచ్చింది. అతను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి కుటుంబ నేపథ్యం ఉంది. అయితే ఆ అబ్బాయి అధిక బరువు ఉన్నాడు. తన అలవాట్లను గమనిస్తే.. బరువు తగ్గేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయట్లేదనిపిస్తోంది. దాంతో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అతను మంచి వ్యక్తి. నా జీవనశైలితో పోలిస్తే అతని జీవనశైలి పూర్తి భిన్నం. నేను ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తాను. ఈ సంబంధం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నా. అతని అధిక బరువుని దృష్టిలో పెట్టుకొని ‘నో’ చెప్పాలా? లేదంటే చదువుకొని మంచి ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నాడన్న కారణంతో ‘ఓకే’ చెప్పాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది కీలకమైన మలుపు. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ ఎన్నో అంశాలను పరిశీలిస్తుంటారు. మీరు కూడా కాబోయే భాగస్వామి విషయంలో కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలనుకుంటున్నారు. అయితే చాలా సందర్భాల్లో మీరు అనుకున్న లక్షణాలు అవతలి వ్యక్తిలో ఉండచ్చు.. ఉండకపోవచ్చు. ఫలితంగా ఉన్న వాటితోనే సర్దుకుపోవాలా? లేదంటే నచ్చిన భాగస్వామి దొరికే వరకు వేచి చూడాలా? అన్న అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీ విషయంలో కూడా ఇదే జరిగింది.

మీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధంలో అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడని చెబుతున్నారు. అలాగే కుటుంబ నేపథ్యం కూడా బాగుందంటున్నారు. కానీ, అధిక బరువు ఉండడంతో పాటు దానిని అదుపులో పెట్టుకోవడానికి సరైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపించడం లేదని అంటున్నారు. అయితే ఈ విషయం గురించి అతనితో చర్చించారా? లేదా? అన్న విషయాన్ని చెప్పలేదు.

వివాహ బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్న మీరు మొదటగా మీ ప్రాధాన్యతలేంటి? అన్న అంశంపై ఒక అవగాహనకు రండి. ఒకవేళ అతను మీకు తగిన వ్యక్తి అని భావిస్తే మీ ప్రాధాన్యతల్ని అతనితో చర్చించండి. అదే క్రమంలో అతని ప్రాధాన్యతలు, ఇష్టాయిష్టాలు, అభిరుచులూ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాల్సిన అవసరాన్నీ అతడికి వివరించండి. ఇద్దరూ అందుకు సుముఖంగా ఉంటే ముందుకెళ్లచ్చు. లేదంటే నచ్చిన వ్యక్తి తారసపడే వరకు వేచి చూడచ్చు. ఒకవేళ అప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతే మాత్రం ఒకసారి ప్రి-మ్యారేజ్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్